ఒకరి నుంచి మరొకరికి

ABN , First Publish Date - 2020-03-28T09:23:47+05:30 IST

‘‘లాక్‌ డౌన్‌ ప్రకటించి ఉండకపోతే పరిస్థితి మరింత విస్ఫోటనకరంగా ఉండేది. అందరి బతుకులూ ప్రమాదంలో పడేవి. లాక్‌డౌన్‌ వంటి జాగ్రత్త చర్యలు

ఒకరి నుంచి మరొకరికి

ఇకపై పెరిగే స్టేజీ ఇదే.. రాష్ట్రంలో ఇప్పటికే వచ్చేసింది

లాక్‌డౌన్‌ ప్రకటించకపోతే విస్ఫోటమే

అయినా, శుక్రవారం పది కేసులు

హోం క్వారంటైన్‌లో 20 వేల మంది

స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్ష

60 వేల మందికి వచ్చినా చికిత్సకు సిద్ధం

12,400 బెడ్లు, వైద్య సిబ్బంది సిద్ధం

ఇతర రాష్ట్రాల వారిని ఉపాసం ఉండనీయం

ఏపీ పిల్లలూ.. ఎక్కడి వారు అక్కడే ఉండండి

పేదలు, యాచకులు, అనాధలకూ సంరక్షణ

లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 15 వరకూ: కేసీఆర్‌


మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూసుకోవడమే. గుంపులుగా గుమిగూడకపోవడమే. భారత్‌లో వసతులు,  వెంటిలేటర్లు, వైద్య సదుపాయాలు విదేశాలంత లేవు. మనకున్నదల్లా ఐకమత్యం, తెలివితేటలు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడమే మన చేతిలో ఉన్న పని. భారతీయులందరూ ఇదే చేస్తున్నారు. 

సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ‘‘లాక్‌ డౌన్‌ ప్రకటించి ఉండకపోతే పరిస్థితి మరింత విస్ఫోటనకరంగా ఉండేది. అందరి బతుకులూ ప్రమాదంలో పడేవి. లాక్‌డౌన్‌ వంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. శుక్రవారం ఒక్కరోజే పది పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తదితర సంస్థలు, పరిశీలకులు చెబుతున్న దాని ప్రకారం అమెరికా, చైనా, ఇటలీ, స్పెయిన్‌ తరహాలో భారత్‌లోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందితే 20 కోట్ల మంది దీని బారినపడతారు. ప్రధాని, సీఎంలు, అధికారులు.. ఎవరూ అతీతులు కారు. ఈ ఆపత్కాలంలో స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష. ఇంటి నుంచి ఎవరూ బయటికి రావద్దు. ఏమవుతదిలే అన్న నిర్లక్ష్యం పనికి రాదు. దీన్ని అర్థం చేసుకుని ప్రజలు మరింత క్రమశిక్షణ పాటించాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఒకవేళ 60 వేల మందికి కరోనా పాజిటివ్‌గా తేలినా వైద్యం అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. ధైర్యం కోల్పోయి లేమని, పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్పారు.


ప్రగతి భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈరోజు 10 పాజిటివ్‌ కేసులు తేలాయి. వీరిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చారు. ఇందులో కొంతమంది కారణంగా వారి కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 59 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 20 వేల మంది హోం క్వారంటైన్‌, ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నారు’’ అని వివరించారు. విమానాలు, పోర్టులను బంద్‌ చేశామని, అంతర్జాతీయంగా కరోనా మనకు సోకే పీడ పోయిందని తెలిపారు. ‘‘కానీ.. మన రాష్ట్రంలోనే ఒకరి నుంచి మరొకరికి అంటించే బాపతు వస్తోంది. ఇకమీదట పెరిగే స్టేజీ అదే. రాష్ట్రంలోకి ఇది ఇప్పటికే వచ్చేసింది. కొంతమంది తెల్వక మూర్ఖంగా ప్రవర్తించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.


మరికొంతమందికి అమాయకంగా తెల్వక వచ్చింది కూడా’’ అని వివరించారు. ‘‘అమెరికాలోని న్యూయార్కులో 11 వేల వెంటిలేటర్లు ఉన్నాయి. కానీ, ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 30 వేల వెంటిలేటర్లు అవసరం. అంత బలం, వసతులు, ధనం ఉన్న అమెరికానే ఆగమయ్యేలా ఉంది. అందుకే, ప్రస్తుతం మన ఆయుధం సామాజిక దూరాన్ని పాటించడమే’’ అని తెలిపారు. 


అండగా ప్రధాని మోదీ

ప్రధాని మోదీతో శుక్రవారం ఉదయం తాను చాలాసేపు మాట్లాడానని, ఈ విషయంలో 24 గంటలూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారని సీఎం కేసీఆర్‌ చెప్పారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ బాగా పోరాటం చేస్తోందని కితాబు ఇచ్చారని, ఏ అవసరం ఉన్నా దేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని వివరించారు. ఇందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో 80.9 శాతం మైల్డ్‌ కేటగిరీ అని, వీరు బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. 13.8 శాతం సివియర్‌ అని తెలిపారు. మిగిలిన 4.7 శాతం క్రిటికల్‌ అని, వీరిని ఐసీయూ, వెంటిలేటర్లో పెట్టి చికిత్స అందించాల్సి ఉంటుందని వివరించారు.


ఇదే పరిస్థితి తెలంగాణలో వస్తే ఎంత వరకూ సన్నద్ధంగా ఉన్నామన్న దానిపై మంత్రి ఈటల, అధికారులతో లోతుగా చర్చించానని, ఇంకొకరిపై ఆధారపడకుండా దీన్ని ఎంతవరకూ ఎదుర్కోగలమన్న దానిపై సమీక్షించి ఓ అంచనాకు వచ్చామని వెల్లడించారు. ఇందుకు దశలవారీ ప్రణాళికను సిద్ధం చేశామని, 4 వేల మంది చొప్పున మూడు దశల్లో 11 వేల మందికి ఐసొలేషన్‌ వార్డుల్లో చికిత్స చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. సుమారు 1400 ఐసీయూ బెడ్లనూ (క్రిటికల్‌ కేర్‌) సిద్ధం చేశామన్నారు. ‘‘గచ్చిబౌలిలో రెండు, మూడు రోజుల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీ మెడికల్‌ కాలేజీలో కొన్ని ఆక్సిజన్‌ లైన్లు చిన్నచిన్నవి చేస్తున్నారు. కింగ్‌ కోఠి ఆస్పత్రిలో కూడా మార్పులు చేస్తున్నారు. అలాగే, 500 వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చాం. అవి వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు 11 వేల మంది రోగులకు ఐసొలేషన్‌ బెడ్లపై, 1400 మందికి క్రిటికల్‌ కేర్‌లో చికిత్స అందించడానికి మొత్తం 12,400 బెడ్లు, పూర్తిస్థాయి వైద్య సిబ్బందితో సిద్ధంగా ఉన్నాం’’ అని వివరించారు.


అవసరమైనప్పుడు వాడుకునేలా ఒక పూల్‌ను తయారు చేస్తున్నామని, వీరిలో ఎంబీబీఎస్‌ పాసైనవారు, పీజీ చేస్తున్నవారు కలిపి 14 వేల మంది, రిటైరైన డాక్టర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు తదితరులు ఉన్నారని వివరించారు. ‘‘అత్యవసరమైతే కేంద్రం కూడా అండదండగా ఉంటామని చెప్పింది. ప్రధాని కూడా స్వయంగా చెప్పారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేశంలో వైద్య సదుపాయాలు విదేశాలంత లేవు. మనకున్నదల్లా ఐకమత్యం, తెలివితేటలు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడమే మన చేతిలో ఉన్న పని. భారతీయులందరూ ఇదే చేస్తున్నారు. మనమూ అలాగే ముందుకు పోదాం’’ అని తెలిపారు. 


కంచెలు తొలగించండి

గ్రామాల్లో కంచెలు తొలగించాలని సీఎం ఆదేశించారు. ‘‘ఇప్పుడు గ్రామాల్లో కంచెలు పెట్టుకుంటున్నారు. ఇది కొంత మంచిదే. మరో రకంగా చెడ్డది. కొన్ని లారీలు, కాంటాలు, హమాలీలు గ్రామాలకు రావాలి. ధాన్యం కొనుగోళ్లు జరగాలి. అంబులెన్సులు రావాలి. ఇది మంచి పద్ధతి కాదు. రాళ్లు, కంచెలు తొలగించండి’’ అని సూచించారు.



ఎవరికి పడితే వారికి అనుమతులివ్వం

టెస్టుల కోసం ఇప్పటి వరకు ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇవ్వలేదని, అవి ఎవరికి పడితే వారికి ఇచ్చేవి కావని సీఎం చెప్పారు. కొన్ని పాథలాజికల్‌ ల్యాబ్స్‌, డయాగ్నొస్టిక్‌ సెంటర్లకు ఐసీఎంఆర్‌ అనుమతులు ఇచ్చిందని, తాము మాత్రం ఇంకా ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వంలో టెస్టింగ్‌ కెపాసిటీ లేకపోతేనే ప్రైవేటుకు అనుమతులు ఇస్తామని చెప్పారు. 


15 వరకూ  లాక్‌ డౌన్‌ 

రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ను ఈనెల 31 వరకూ మాత్రమే ప్రకటించామని, కానీ, జాతీయ స్థాయిలో ఇది ఏప్రిల్‌ 15 వరకూ ఉందని, అందుకే, రాష్ట్రంలోనూ ఏప్రిల్‌ 15 వరకూ పొడిగిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ కాలంలో రాత్రి పూట కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుందన్నారు. కూరగాయలు, పగటి పూట నిత్యావసర సరుకుల కొనుగోలుకు ప్రజలు గ్యాంగులుగా పోవద్దని సూచించారు. 


ఎవరినీ ఉపాసం ఉండనీయం

తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం వారినైనా ఉపవాసం ఉండనీయబోమని, అందరికీ ఆహార వసతులు ఏర్పాటు చేసి పొట్టలు నింపుతామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఏ హాస్టల్‌ బంద్‌ కాదు. దయచేసి ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని సూచించారు. ఏపీ పిల్లలు గందరగోళ పడవద్దని, హాస్టళ్లు మూయబోరని భరోసా ఇచ్చారు. ‘‘ఎంతవరకూ వీలైతే అంతవరకూ కదలికలను నిరోధించాలని నాతో మాట్లాడినప్పుడు ప్రధాని మోదీ అన్నారు. ఈ విపత్కర సమయంలో ప్రజలు ఎవరూ కూడా ఆకలికి గురి కారాదని నిర్దేశించారు. పేదలు, యాచకులు, నైట్‌ షెల్టర్లలో ఉండేవారు, అనాధలు తదితరులు ఆకలికి గురి కారాదు. భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, పౌలీ్ట్ర రంగంలో పని చేసేవారి సంక్షేమంపై శ్రద్ధ తీసుకోవాలని ఆయా సంస్థలకు విజ్ఞప్తి చేశాం. వేతనాలు ఇచ్చి అన్నం కూడా పెట్టాలని కోరాం. ఏ రాష్ట్రం వారైనా ఆయా జిల్లాల్లో ఉంటే ఎంత ఖర్చయినా ఆహారం, షెల్టర్‌ కల్పించాలని, ఆరోగ్య పరీక్షలూ చేయించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించాం’’అని తెలిపారు.

Updated Date - 2020-03-28T09:23:47+05:30 IST