ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్‌ వ్యూహం ఇదేనా..!? పరోక్షంగా ఆ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టనున్నారా..!?

ABN , First Publish Date - 2021-12-04T17:01:30+05:30 IST

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి ఛాన్స్‌ ఇవ్వనని సీఎం కేసీఆర్‌ పరోక్షంగా చెప్పారా? ముందస్తు ఎన్నికల్లో ఎక్కువ మంది సిట్టింగ్‌లకు సీట్లిచ్చిన కేసీఆర్‌..

ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్‌ వ్యూహం ఇదేనా..!? పరోక్షంగా ఆ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టనున్నారా..!?

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి ఛాన్స్‌ ఇవ్వనని సీఎం కేసీఆర్‌ పరోక్షంగా చెప్పారా? ముందస్తు ఎన్నికల్లో ఎక్కువ మంది సిట్టింగ్‌లకు సీట్లిచ్చిన కేసీఆర్‌.. ఈసారి వ్యూహం మార్చి కొత్త ముఖాలతో ముందుకెళ్లనున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త వారికి ఛాన్స్‌ ఇవ్వడంతో ఎమ్మెల్యేల్లో దడ మొదలైందా? వచ్చే ఎన్నికల కోసం సమగ్ర సర్వేలు కేసీఆర్ దగ్గరకి చేరాయా? ఎమ్మెల్యేలను పార్టీ సేవలకు ఉపయోగించుకుంటారా? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


హ్యాట్రిక్‌ కోసం కేసీఆర్‌ ప్లాన్‌ ..40 మంది సిట్టింగ్స్‌ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్‌? 

వరుసగా  మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఈసారి శాసససభ్యుల టికెట్ల విషయంలో  సీఎం కేసీఆర్‌ సరికొత్తగా ముందుకువెళ్లనున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. నియోజకవర్గాల్లో శాసనసభ్యులపై ఉన్న వ్యతిరేకత టీఆర్‌ఎస్‌పై పడకుండా ఉండేందుకు సిట్టింగ్స్‌కు ఈసారి నో ఛాన్స్‌ చేప్పే అవకాశముందనే టాక్ వస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశమిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకునేలా కేసీఆర్‌ ప్లాన్ చేస్తున్నట్లు లీకులొస్తున్నాయి. టికెట్‌దక్కని సిట్టింగ్స్‌లో తమ పేరు ఉంటుందేమో అనే ఆందోళన శాసనసభ్యుల్లో రోజురోజుకీ ఎక్కువవుతున్నట్లు నియోజకవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో కొత్తవారికి ఛాన్స్‌ ఇస్తారనే చర్చ 

శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా, స్థానిక కోటా టికెట్ల పంపిణీని విశ్లేషించుకుంటున్న ఎమ్మెల్యేలు వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమకు టికెట్‌ దక్కుతుందా లేదా అనే డైలామాలో పడిపోతున్నారు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు సీట్లలో తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్ ముదిరాజ్‌కు కొత్తగా అవకాశం ఇచ్చారు. కేవలం ఇద్దరు సిట్టింగ్‌లకు మాత్రమే రెన్యువల్ చేశారు. ఇక 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదు స్థానాలకు కొత్త వారిని బరిలోకి దింపారు. దండే విఠల్, తాతా మధు, యాదవరెడ్డి, ఎంసి కోటిరెడ్డి, ఎల్. రమణ వీరంతా  కొత్త వాళ్ళే. రాజకీయ, సామాజిక సమీకరణలను బేరీజు వేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ వీరికి అవకాశం కల్పించారు. సిట్టింగ్స్‌లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కొంతమంది నేతలకు చెక్ పెట్టారు. దీంతో భవిష్యత్తులో  ప్రక్షాళనకు ఇది సంకేతం అనే చర్చ పార్టీలో జరుగుతోంది.


40 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావనే ప్రచారం 

గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా సిట్టింగ్‌లకే పోటీ చేసే అవకాశం ఇచ్చారు కేసీఆర్.  ఇక జీహెచ్ఎంసి ఎన్నికల్లో  సిట్టింగ్స్‌లకే దాదాపుగా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇచ్చారు. కానీ చాలా వరకు సిట్టింగ్‌ కార్పొరేటర్లు ఓడిపోయారు. అభ్యర్థులను మార్చిన డివిజన్లలో టిఆర్ఎస్ గెలిచింది. సిట్టింగ్‌ల మీద ప్రజా వ్యతిరేకతతోనే నష్టపోయినట్లు అప్పట్లో టిఆర్ఎస్ చెప్పింది. దాంతో ఇక మార్పులకు గులాబీ బాస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీలు కొంతమందికి చెక్‌పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వటంతో ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. చాలా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్న చర్చ పార్టీలోనే  ఉంది. ఎమ్మెల్యేల పనితీరుపై  కేసీఆర్ వివిధ మార్గాల ద్వారా సర్వే  రిపోర్టులు కూడా తెప్పించుకుంటున్నారు. వారికే మళ్ళీ ఛాన్స్ ఇస్తే నష్టం తప్పదన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు టాక్ నడు స్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 40 మందికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చెక్ పెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


పదవుల మార్పుతో సంతృప్తులకు చెక్‌! 

రెండు సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిని రేసు నుంచి తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పేలా కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చేలా సహకరించాలని,మళ్లీ పవర్‌లోకి వచ్చాక మండలి ఎన్నికలు ఎలాగూ ఉంటాయని శాసనసభ్యుల మైండ్‌ను సెట్‌ చేసేలా వాతావరణం క్రియేట్‌ చేసే పనిలో కేసీఆర్‌ ఉన్నట్లు టాక్స్‌ వస్తున్నాయి. ప్రజల్లో ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి పార్టీపై పడకుండా ఉండేందుకు కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం ఒక వ్యూహమైతే మాజీలు కాబోయే శాసనసభ్యులు మున్ముందు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజాలుగా నిలుస్తారనే టాక్‌ వస్తోంది. నియోజకవర్గాల్లో నాయకత్వమార్పు కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నేతలు టికెట్లు లభిస్తే ఉత్సాహంగా పనిచేస్తారని, ప్రజల్లోనూ కొత్తవారిని ఎన్నుకున్న భావన ఉంటుందనే కోణంలో టీఆర్‌ఎస్‌ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. 


జూనియర్లకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలు గమ్మునుంటారా? 

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పదవులకు ఉండే క్రేజ్‌ వేరు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాలకు మకుటం లేని మహారాజులుగా ఎమ్మెల్యేలను తీర్చిదిద్దిందే కేసీఆర్‌. అలాంటిది ఎదురులేని పవర్‌ అనుభవించిన  శాసనసభ్యులు తమ జూనియర్లు ఎమ్మెల్యేలు అయితే తట్టుకుంటారా? పార్టీ పదవులకు పరిమితం చేస్తే ఊరుకుంటారా అనే చర్చ కూడా మొదలైంది. పార్టీకోసం పనిచేస్తున్న వాళ్లు ఎమ్మెల్యే సాబ్‌లకు సలాం కొట్టకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో స్వయంగా చూసిన ఎమ్మెల్యేలు కొత్తవాళ్లు శాసనసభ్యులు అయ్యేందుకు మనస్పూర్తిగా సహకరించడం అత్యాశే అవుతుందనే టాక్‌ వస్తోంది. 


ఎమ్మెల్యే టికెట్‌ రాకుంటే జంపింగ్‌లకు ఛాన్స్‌! 

టికెట్లు దక్కకుంటే  ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉంటుందనే విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణలో రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేలు అయినవాళ్లు కొందరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ పలుమార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కొందరు టీఆర్‌ఎస్‌లో పవర్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. కొందరు ముందస్తు ఎన్నికల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లు ఉన్నారు. ఇలా పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లు టికెట్‌ దక్కకుంటే అప్పుడుండే మానసిక పరిస్థితిలో పార్టీకి సహకరించడం అనుమానమే. దేశ రాజకీయాల్లో ఎంతోమంది సిట్టింగ్స్‌ సొంత పార్టీలో టికెట్‌ రాకుంటే అప్పటికప్పుడు పార్టీ మారి గెలిచిన సందర్బాలు కోకొల్లలు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసిన కేసీఆర్‌..సిట్టింగ్స్‌లను మాజీలు చేసేందుకు, వారి మనసు కుదటపర్చేందుకు, మాట విననివాళ్లను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేయనున్నారనేది ఎన్నికల గాలి మొదలైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశముందనే టాక్‌ వస్తోంది. 

Updated Date - 2021-12-04T17:01:30+05:30 IST