యూపీ ఎన్నికలపై కేసీఆర్‌ ఆరా

ABN , First Publish Date - 2022-03-02T08:39:08+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తీరుతెన్నులపై వివిధ వర్గాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్షించినట్లు తెలిసింది.

యూపీ ఎన్నికలపై కేసీఆర్‌ ఆరా

ఉత్తరాది నేతలు, పాత్రికేయులతో చర్చలు


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తీరుతెన్నులపై వివిధ వర్గాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్షించినట్లు తెలిసింది. సోమవారం రాత్రి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఈ ప్రయాణ సమయంలోనే ఆయన.. భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో సుదీర్ఘంగా చర్చించారని, ఢిల్లీకి రాగానే పలు ఉత్తరాది నేతలు, పాత్రికేయులతో చర్చలు జరిపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు కేసీఆర్‌ ఢిల్లీ వచ్చిన మాట నిజం కాదని.. తనతో పాటు సతీమణి వైద్య చికిత్సల కోసమే వచ్చారని టీఆర్‌ఎస్‌ పార్టీ నేత ఒకరు వివరించారు. కేజ్రీవాల్‌ బెంగళూరులోని జిందాల్‌ ప్రకృతి చికిత్సాలయంలో చికిత్స తీసుకుని మరో వారం తర్వాత తిరిగి వస్తారని తమకు తెలుసునని చెప్పారు. కేసీఆర్‌ మంగళవారం నిజాముద్దీన్‌ సమీపంలో ఉన్న దంత వైద్యుడి వద్దకు వెళ్లారని, ఆయన సతీమణి బుధవారం ఎయిమ్స్‌లో పరీక్షలకు వెళతారని అధికార వర్గాలు తెలిపాయి. బుధవారమే కేసిఆర్‌ హైదరాబాద్‌ తిరిగి వెళ్లే అవకాశాలు లేకపోలేదని తెలిసింది. మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌ మంగళవారం ఆయనకు ఫోన్‌ చేశారు.  

Updated Date - 2022-03-02T08:39:08+05:30 IST