కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది అందుకే...!

ABN , First Publish Date - 2021-11-26T08:55:48+05:30 IST

కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లింది ఆయన శ్రీమతి ఆరోగ్యం కోసమేనని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. బస్తీ దవాఖానాలు కేంద్ర ప్రభుత్వానివే అయినప్పటికీ రాష్ట్రం పేరు మార్చిందని ఆరోపించారు.

కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది అందుకే...!

  • ఆయన శ్రీమతి ఆరోగ్యం కోసమే!
  • కేంద్ర పథకాలను రాష్ట్రం అమలుచేయడం లేదు
  • సమీక్షలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లింది ఆయన శ్రీమతి ఆరోగ్యం కోసమేనని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. బస్తీ దవాఖానాలు కేంద్ర ప్రభుత్వానివే అయినప్పటికీ రాష్ట్రం పేరు మార్చిందని ఆరోపించారు. కేసీఆర్‌ కిట్టులో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందన్నారు. హౌసింగ్‌ స్కీంను తెలంగాణ ప్రభుత్వం సరిగా అమలు చేయడంలేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో దిశా (డిస్ర్టిక్ట్‌ డెవల్‌పమెంట్‌ కోఆర్డినేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ) సమావేశం జరిగింది. కేంద్ర పథకాల అమలుపై జరిగిన ఈ సమీక్షా సమావేశానికి మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్‌ నగరంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా కృషిచేస్తామన్నారు. సమీక్షా సమావేశాలను ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. నగరంలో శాంతి భద్రతలు, మధ్యాహ్న భోజనం, సర్వ శిక్షా అభియాన్‌, పౌర సరఫరాలు, జాతీయ ఆహార భద్రత చట్టం, జాతీయ పంపిణీ పథకం, వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ తదితర పథకాల అమలుపై చర్చించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంపై మంత్రి మండిపడ్డారు. ముఖ్యంగా కలెక్టర్‌ శర్మన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ గైర్హాజరుపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ఫోన్‌చేయడంతో ఇద్దరు అధికారులు పరుగులు తీస్తూ సమావేశం జరిగే హాల్‌కు వచ్చారు.


రైల్వే జీఎంను కలిసిన బండి సంజయ్‌

సికింద్రాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గురువారం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యాను కలిశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని జీఎంను కోరారు.

Updated Date - 2021-11-26T08:55:48+05:30 IST