కేసీఆర్‌ మాటల్లో నిజాయితీ లేదు

ABN , First Publish Date - 2021-12-08T06:52:21+05:30 IST

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో యుద్ధం చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల్లో నిజాయితీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

కేసీఆర్‌ మాటల్లో నిజాయితీ లేదు
రైతు ర్యాలీలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం, పక్కన కోదండరాం తదితరులు

 మద్దతు ధరల చట్టం తేవాలి 

మిర్యాలగూడలో రైతు ర్యాలీలో సీపీఎం నేత వీరభద్రం, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం

మిర్యాలగూడ, డిసెంబరు 7: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో యుద్ధం చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల్లో నిజాయితీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఐకేపీ కేంద్రాల్లో అన్నిరకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అఖిలపక్ష రైతుసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మిర్యాలగూడలో  మంగళవారం నిర్వహించిన రైతుల ర్యాలీలో తమ్మినేని వీరభద్రం, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. అనంతరం రాజీవ్‌చౌక్‌లో నిర్వహించిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రైతు పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తున్నామని కేసీఆర్‌ చెప్పాడని, కేంద్రం కొనబోమని తేల్చిచెప్పడంతో నాటకానికి తెరలేపాడన్నారు. గత సెప్టెంబరు నెలలోనే ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వగా; హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓటమి అనంతరం ఆ లేఖలు బహిర్గతం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మోదీతో అమీతుమీ తేల్చుకుంటానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా అడగకపోవడం రైతులపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనమన్నారు. కార్పొరేట్‌ శక్తులకు, అమెరికా అగ్రరాజ్యానికి మోదీ ప్రభుత్వం సాష్టాంగపడుతోందన్నారు. అలగటమే ఎరగని రైతులు కన్నెర్రజేస్తే అధికార పీఠాలు కదులుతాయన్నారు. కోదండరాం మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక లేదన్నారు. వరికి బదులుగా వేరుశనగ, మినుము, కుసుమలు, ఆవాలు సాగుచేయాలన్న అధికారులు కనీసం విత్తనాలనైనా రైతులకు అందుబాటులోకి తేలేదన్నారు. వానాకాలం ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో మక్కుతోందన్నారు. తేమ, తాలు, తరుగు, హమాలీ చార్జీల పేరుతో రైతులను దోపిడీకి గురి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్‌చార్జి బంటు వెంకటేశ్వర్లు, సీపీఎం నాయకులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతుసంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, తెలంగాణ విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య , బి.హరికృష్ణ, ఎన్‌. రాముడుశర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T06:52:21+05:30 IST