సహకారమా.. ప్రతీకారమా?

ABN , First Publish Date - 2020-12-03T06:46:33+05:30 IST

అన్నదాతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్‌ అట్టహాసంగా ప్రకటనలు చేస్తుంటారు.

సహకారమా.. ప్రతీకారమా?

అప్పు కట్టలేదంటూ పేద రైతుపై వీరంకిలాకు పీఎస్‌లో కేసు

రూ.60వేల అప్పు కోసం 2.20 ఎకరాల జప్తునకు యత్నం

చైర్మన్‌ ఆదేశాలతో రంగంలోకి సీఈవో

కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ సొంత ఊర్లో అధికారుల వీరంగం

అప్పు చెల్లించినా జప్తు చేస్తామంటూ వీరంగం

పంట కోయకుండా అడ్డుకుని రైతుపై దౌర్జన్యం


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

అన్నదాతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్‌ అట్టహాసంగా ప్రకటనలు చేస్తుంటారు. మరోవైపు ఆయన పార్టీ నేతలు మాత్రం చిన్న, సన్నకారు రైతులపై తమ ప్రతాపం చూపుతున్నారు. అప్పు కట్టలేదంటూ ఏకంగా ఓ పేద రైతుపై పోలీసు కేసు నమోదు చేసిన ఉదంతం పమిడిముక్కల మండలం పెనుమత్స గ్రామంలో చోటుచేసుకుంది. ఇది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీ) చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు స్వగ్రామం కావడం గమనార్హం. 

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఓ పేద రైతుపై కేడీసీసీ బ్యాంకు యంత్రాంగం మొత్తం జులుం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. స్వామి భక్తి ప్రదర్శించేందుకు సాక్షాత్తు బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో), డీజీఎం స్థాయి వ్యక్తులు లక్ష రూపాయల అప్పు వసూలు పేరిట రైతు ఆస్తి జప్తు చేసేందుకు అత్యుత్సాహం చూపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


60 వేల కోసం..

పమిడిముక్కల మండలం పెనుమత్సకు చెందిన యార్లగడ్డ మల్లేశ్వరరాణి తన భూమి తనఖా ఉంచి, 2014లో రూ.60వేలు కృష్ణాపురం సహకార సంఘం నుంచి రుణం పొందారు. అనంతరం భూమి విషయంలో కుటుంబంలో వివాదాలు ఏర్పడ్డాయి. ఈ వివాదం వల్ల కృష్ణాపురం సహకార సంఘంలో ఉన్న బాకీ చెల్లించలేదు. ప్రస్తుతం సుమారు 2.20 ఎకరాల భూమి మల్లేశ్వరరాణి కుమారుడు చంద్రశేఖర్‌రావు సాగు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్‌రావుతో తనకు ఉన్న రాజకీయ విభేదాలను మనసులో ఉంచుకుని, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ వెంకట్రావు పాత అప్పును సాకుగా చూపి, చంద్రశేఖర్‌రావు పొలాన్ని జప్తు చేయించేందుకు ప్రయత్నించారు. దీనికి బ్యాంకు సీఈవో సహా అందరూ పూర్తిస్థాయిలో సహకారం అందించారు. నవంబరు 14న చంద్రశేఖర్‌రావు పంట కోయడానికి సిద్ధం కాగా, ఆ సమయంలో బ్యాంకు అధికారులు ప్రత్యక్షమై పంట కోయడానికి వీల్లేదని, అప్పు కట్టనందున పొలాన్ని జప్తు చేస్తున్నామని తెలిపారు. అదే రోజు వీరంకిలాకు పోలీసుస్టేషన్‌లో అప్పు చెల్లించకుండా చంద్రశేఖర్‌ తప్పించుకు తిరుగుతున్నారంటూ కృష్ణాపురం సహకార సంఘం కార్యదర్శితో ఫిర్యాదు చేయించారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల రైతులు అందరూ  ఏకమయ్యారు. అప్పు చెల్లించకపోతే కేసులు పెట్టడం గతంలో ఎన్నడూ లేదని, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే రేపు తమకూ అదే విధంగా జరుగుతుంటూ సమస్యను స్థానిక ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కేసును ఉపసంహరించుకోవాలని సహకార సంఘం కార్యదర్శిని ఆదేశించడంతో గత నెల 15వ తేదీన కేసును ఉపసంహరించుకున్నారు. ఈ విషయం తెలియడంతో బ్యాంకు చైర్మన్‌ వెంకట్రావు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఏమైనా సరే ఆ రైతు ఆస్తిని జప్తు చేయాలని సీఈవోని ఆదేశించారు. దీంతో సీఈవో స్వయంగా రంగంలోకి దిగి, ఆస్తి జప్తు చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు రైతు చంద్రశేఖర్‌ తన అప్పు మొత్తం రూ.1.17 లక్షలను కృష్ణాపురం సహకార సంఘంలో చెల్లించేసి, రశీదు పొందారు. ఈలోగా బ్యాంకు యంత్రాంగం రైతు పొలం వద్దకు వెళ్లి పొలం జప్తు చేస్తున్నట్లు టామ్‌ టామ్‌ వేయించడం మొదలుపెట్టారు. దీంతో రైతు అడ్డం తిరిగారు. తాను అప్పు చెల్లిస్తే, పొలం ఎలా జప్తు చేస్తారంటూ నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో బ్యాంకు అధికారులు వెనుదిరిగారు. తమ గ్రామస్థుడే అయిన బ్యాంకు చైర్మన్‌ ఓ పేద రైతును ఇబ్బంది పెట్టడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపక్క తుఫాను తరుముకొస్తోందని పంట కోతకు సిద్ధపడిన రైతును జప్తు పేరుతో మానసిక క్షోభకు గురి చేసిన బ్యాంకు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


కేసు పెట్టి వేధించే ప్రయత్నం చేశారు

రైతులకు అప్పులుండటం సహజం. కానీ లక్ష రూపాయల అప్పు కోసం నన్ను కేడీసీసీ బ్యాంకు అధికారులు తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు. నా పొలం వద్దకు వచ్చి పంటను కోయనీకుండా దౌర్జన్యం చేశారు. 100కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం, వారు జోక్యం చేసుకోవడంతో అధికారులు వెనక్కి తగ్గారు. కేవలం రాజకీయ విభేదాలతోనే చైర్మన్‌ ఆదేశాల మేరకు అధికారులు కక్షపూరితంగా వ్యవహరించారు. - యార్లగడ్డ చంద్రశేఖర్‌రావు

Updated Date - 2020-12-03T06:46:33+05:30 IST