కీసర తహశీల్దార్‌ నాగరాజు అరెస్ట్: ఏసీబీ

ABN , First Publish Date - 2020-08-16T01:44:03+05:30 IST

ల్యాండ్ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తహశీల్దార్ నాగరాజు, వీఆర్ఏ‌ సాయి రాజ్‌ లను అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. భారీ స్థాయిలో తహశీల్దార్

కీసర తహశీల్దార్‌ నాగరాజు అరెస్ట్: ఏసీబీ

హైదరాబాద్: ల్యాండ్ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తహశీల్దార్ నాగరాజు, వీఆర్ఏ‌ సాయి రాజ్‌ లను అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. భారీ స్థాయిలో తహశీల్దార్ డబ్బులు లంచం తసుకుంటున్నట్లు తమకు సమాచారం అందిందని, ఆ మేరకు దాడులు నిర్వహించగా తహశీల్దార్ అవినీతి పర్వం బయటపడిందని తెలిపారు. 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి తహశీల్దార్ నాగరాజు లంచం డిమాండ్ చేశాడని, దానికి సంబంధించిన రూ. కోటీ పది లక్షల డబ్బును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని అధికారులు వివరించారు. ఉప్పల్‌లోని శ్రీ చౌలా శ్రీనాథ్ యాదవ్, శ్రీ సత్య డెవలపర్ల నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ విచారణలో తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు.


తహశీల్దార్ వద్ద భారీ మొత్తంలో డబ్బుతో పాటు, అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. తహశీల్దార్ నాగరాజు కారులో రూ. 8 లక్షలు, అతని ఇంట్లో రూ.28 లక్షల నగదును సీజ్ చేశామన్నారు. అలాగే 500 గ్రాముల బంగారు ఆభరణాలు, లాకర్ కీ దొరికాయని చెప్పారు. అనేక స్థిరాస్తులు తమ సోదాల్లో బయటపడ్డాయన్నారు. లంచం తీసుకున్న తహసీల్దార్ నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, లంచం ఇచ్చినందుకు చౌలా శ్రీనాథ్ యాదవ్‌ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితులను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

Updated Date - 2020-08-16T01:44:03+05:30 IST