ఉన్నతాధికారిపై దాడి కేసులో కేజ్రీవాల్‌కు ఊరట

ABN , First Publish Date - 2021-08-11T19:43:47+05:30 IST

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారిపై దాడి కేసులో ముఖ్యమంత్రి

ఉన్నతాధికారిపై దాడి కేసులో కేజ్రీవాల్‌కు ఊరట

న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారిపై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియాలకు ఉపశమనం లభించింది. ఈ కేసులో తొమ్మిది మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఊరట లభించగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాశ్ జర్వాల్, అమానతుల్లా ఖాన్‌లపై భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్లు 186, 353 ప్రకారం ఆరోపణలు నమోదయ్యాయి. 2018లో అప్పటి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై కేజ్రీవాల్, శిశోడియా, 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు నమోదైన కేసులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సచిన్ గుప్తా బుధవారం తీర్పు వెల్లడించారు. ఈ వివరాలను మనీశ్ శిశోడియా విలేకర్ల సమావేశంలో తెలిపారు. 


కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, ఇది సత్యం, న్యాయం గెలిచిన రోజు అని శిశోడియా తెలిపారు. ఈ కేసులో ఆరోపణలన్నీ నిరాధారమైనవని, తప్పుడు ఆరోపణలని కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ తప్పుడు కేసు నుంచి ముఖ్యమంత్రి నిర్దోషిగా బయటపడ్డారన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా ఈ కేసును అభివర్ణించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని తాము చెబుతూనే ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని చెప్పారు. 


2018లో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అన్షు ప్రకాశ్ ఈ కేసును దాఖలు చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం మూడేళ్ళ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనల విడుదలపై చర్చించేందుకు తనను 2018 ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి పిలిచారని తెలిపారు. అర్ధరాత్రి జరిగిన ఈ సమావేశంలో తనపై దాడి జరిగిందని ప్రకాశ్ ఆరోపించారు. తనపై కేజ్రీవాల్, శిశోడియా, 11 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఆరోపించారు. దీంతో వీరందరిపైనా నమోదైన కేసులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సచిన్ గుప్తా బుధవారం తీర్పు చెప్పారు. 


Updated Date - 2021-08-11T19:43:47+05:30 IST