పట్టువీడని కేజ్రీవాల్.. ఆ ఫైల్ మళ్లీ ఎల్‌జీ ముందుకు..

ABN , First Publish Date - 2021-06-18T04:19:25+05:30 IST

ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీ పథకానికి సంబంధించిన ఫైల్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్...

పట్టువీడని కేజ్రీవాల్.. ఆ ఫైల్ మళ్లీ ఎల్‌జీ ముందుకు..

న్యూఢిల్లీ: ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీ పథకానికి సంబంధించిన ఫైల్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆమోదం కోసం పంపారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసిన రెండు వారాలకే సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలన్నీ పరిష్కరించామని ఈ సందర్భంగా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్‌కు వివరించారు. హైకోర్టు సైతం స్టే విధించేందుకు నిరాకరించినప్పటికీ.. కేంద్రం ఈ పథకానికి ఎందుకు మోకాలడ్డుతోందని కేజ్రివాల్ ప్రశ్నించారు. వాస్తవానికి ఈ నెల 7 నుంచి ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కేంద్రం ఈ పథకానికి మోకాలడ్డిందంటూ ఈ నెల 6న కేజ్రీవాల్ ఓ మీడియో సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అనుమతి కోసం ఐదు సార్లు లేఖ రాసినప్పటికీ.. దీన్ని నిలిపివేశారని ఆయన దుయ్యబట్టారు.


‘‘ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీ పథకాన్ని ప్రారంభించేందుకు సరిగ్గా రెండ్రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంది. చట్టపరంగా చూసినా ఈ పథకాన్ని అమలు చేసేందుకు మాకు కేంద్రం అనుమతి అవసరం లేదు. ఢిల్లీ ప్రభుత్వమే దీన్ని పూర్తిగా అమలు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ... మీ దగ్గర్నుంచి మేము ఒకటి కాదు ఐదు సార్లు అనుమతి పొందాం...’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ పథకానికి పేరు మార్చడం సహా కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలన్నిటినీ మార్చిలోనే పరిష్కరించామన్నారు. ఈ పథకానికి తొలుత ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన (ఎంఎంజీజీఆర్‌వై) అని నామకరణం చేశారు. అయితే జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎస్ఎఫ్ఏ) కింద అమలు చేసే పథకానికి మరో పేరు ఎలా పెడతారంటూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అభ్యంతరం మేరకు మార్చి 9న ఈ పేరును వెనక్కి తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో రేషన్ డీలర్లు పిటిషన్ వేయడం వల్లే ఈ పథకాన్ని నిలిపివేశామంటూ కేంద్రం చెబుతోందనీ.. కానీ దీనిపై స్టే విధించాలంటూ రేషన్ డీలర్లు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘‘హైకోర్టు కూడా స్టే విధంచడానికి తిరస్కరించినప్పుడు... ఈ పథకాన్ని మీరెలా అడ్డుకుంటారు?’’ అని కేజ్రీవాల్ కేంద్రాన్ని నిలదీశారు. 

Updated Date - 2021-06-18T04:19:25+05:30 IST