ఒకే ఒక్క ఫోన్ కాల్.. నదిని దాటి, కిలోమీటర్ల కొద్దీ నడిచిన వైద్యులు.. అసలేం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-05-28T21:48:12+05:30 IST

ఒక్క ఫోన్ కాల్ అందుకొన్న డాక్టర్లు.. కిలోమీటర్లు నడిచి, నదులు దాటి, అడవుల్లో పరుగులెత్తారు. ఇదంతా ప్రాణాలు కాపాడటంలో వారికున్న ఆత్రుతే. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఎంతలా విలయం సృష్టిస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి

ఒకే ఒక్క ఫోన్ కాల్.. నదిని దాటి, కిలోమీటర్ల కొద్దీ నడిచిన వైద్యులు.. అసలేం జరిగిందో తెలిస్తే..

ఒక్క ఫోన్ కాల్ అందుకొన్న డాక్టర్లు.. కిలోమీటర్లు నడిచి,  నదులు దాటి, అడవుల్లో పరుగులెత్తారు. ఇదంతా ప్రాణాలు కాపాడటంలో వారికున్న ఆత్రుతే. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ఎంతలా విలయం సృష్టిస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా లక్షణాలు లైట్‌గా బయటపడినా సరే ప్రజలు వణికిపోతున్నారు. వెంటనే కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. దాని ఫలితం వచ్చే వరకూ వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో అభివృద్ధి అంటే తెలియని అడవుల్లో ప్రజల మాటేమిటి? రోడ్డు అంటే తెలియని తండాల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చేదెవరు? అలా ఒక ఆటవిక గూడెంలో చికిత్స అవసరం అని తెలియడంతోనే.. డాక్టర్ల బృందం అడవి బాట పట్టింది. కేరళలో ప్రజలందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ డాక్టర్ల సాహసానికి సంబంధించిన ప్రత్యేక కథనమిది.


అది కేరళలోని పాలక్కడ్‌లో అత్తపాడి. ఇక్కడకు 20 కిలోమీటర్ల దూరంలో అడవిలో కొన్ని ఆటవిక గూడేలు ఉన్నాయి. వాటిలో ఇరుల, ముడుగార్, కురుంబా తెగలకు చెందిన 100మంది వరకూ ప్రజలు ఉంటారు. వారిలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురికి సడెన్‌గా తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. అలా ఎందుకు జరిగిందో తెలియదు. భయపడిన తండా ప్రజలు.. అధికారులకు ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాల్ అందుకున్న పుత్తూర్‌లోని డొమిసిలియరీ కేర్ సెంటర్ (డీసీసీ) అధికారులు.. వెంటనే ఒక మెడికల్ బృందాన్ని సిద్ధం చేశారు. వారికి ఫోన్ కాల్ వివరాలు వెల్లడించి, అవసరమైన కిట్లతో సాగనంపారు. తమ వాహనాల్లో అటవీ గ్రామానికి బయలు దేరిన వైద్య బృందానికి అడవికి వెళ్లిన తర్వాత కానీ ఆ ప్రయాణంలోని కష్టాలు అర్థం కాలేదు.


ఇక్కడి భవానీ పూజ నది వరకూ మాత్రమే వారి వాహనాలు వచ్చాయి. నది దాటాలంటే కార్లను కాక కాళ్లను నమ్ముకోవాల్సిందేనని డాక్టర్లకు అర్థమైంది. ఇక వాహనాలు దిగి కాలినడకన నది దాటారు. నది దాటిన తర్వాత అత్తపాడి అడవిలో మరో 8 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా డాక్టర్లు శారీరక కష్టం చేయరు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటుంది కానీ బరువులు మోయడం, కొండలు ఎక్కడం వారికి అసలు అలవాటు ఉండదు. కానీ ఈ డాక్టర్ల బృందం మాత్రం మెడికల్ పరికరాలు కూడా భుజాలపై మోస్తూ అలవాటు లేని అడవిలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయినా సరే ఎక్కడా తగ్గకుండా శాయశక్తులా ప్రయత్నించి ఎట్టకేలకు గమ్యాన్ని చేరుకుంది. అక్కడ అనారోగ్యంతో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు చేస్తే పాజిటివ్ ఫలితం వచ్చింది.


పరిస్థితి అర్థం చేసుకున్న వైద్య బృందం.. అక్కడ ఉన్న మిగతా ప్రజలకు కూడా కరోనా పరీక్షలు చేశారు. మొత్తమ్మీద 30 మందికి కరోనా టెస్టులు చేయగా.. వారిలో ఏడుగురికి వైరస్ సోకినట్లు తేలింది.  వారిని పుత్తూర్ డీసీసీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆటవిక గ్రామం చేరుకున్న బృందంలో వైద్యురాలు డాక్టర్ సుకన్య, హెల్త్ ఇన్‌స్పెక్టర్ సునీల్ వాసు, జూనియర్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ షైజ్, డ్రైవర్ సాజేష్ ఉన్నారు. వీళ్లు చేసిన కృషికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ కూడా ఈ బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. వారు చేసిన పనిని, వారికి పని పట్ల ఉన్న శ్రద్ధను కొనియాడారు. ఈ డాక్టర్ల జర్నీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కూడా బాగా హల్‌చల్ చేస్తున్నాయి. నెటిజన్లంతా ఈ డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్నారు. 


గతేడాది కరోనా వెలుగు చూసినప్పటి నుంచి కేరళ ప్రభుత్వం ఈ మహమ్మారిని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే ఉంది. వాటిలో డీసీసీలు కూడా ఒకటి. ప్రతి గ్రామపంచాయతీలో ఒక డీసీసీ ఉండేలా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పుత్తూర్ గ్రామపంచాయతీలోని డీసీసీ కింద 67 గ్రామాలు ఉన్నాయి. ప్రధాన ఆస్పత్రులు, ఆక్సిజన్ అవసరాల భారాన్ని తగ్గించడం కోసం ఈ ప్రాంతాల్లో డీసీసీలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఈ సదుపాయం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నారు. పుత్తూర్ డీసీసీలో 120 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ పేషెంట్లకు అవసరమైన చికిత్స త్వరగా లభిస్తుంది.  తాజాగా పుత్తూర్ డీసీసీకి చెందిన వైద్య బృందం కాలినడకన అడవిలో ప్రయాణించి మరీ.. అటవీ ప్రజలకు కరోనా టెస్టులు చేయడాన్ని అత్తపాడికి చెందిన ట్రైబల్ సామాజిక కార్యకర్త ఒడియాన్ లక్ష్మణన్ ప్రశంసించారు. కేరళ ప్రభుత్వం ప్రారంభించిన డీసీసీలు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్న ఆయన.. ఈ వైద్య బృందం చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2021-05-28T21:48:12+05:30 IST