Abn logo
Sep 24 2021 @ 16:35PM

‘అత్యాచార బాధితురాలితో నిందితునికి పెళ్లయినా కేసు కొనసాగుతుంది’

కొచ్చి : అత్యాచారం కేసుల్లో రాజీపై కేరళ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. అత్యాచారం తీవ్రత న్యాయ వ్యవస్థను దిగ్భ్రాంతికి గురి చేసే స్థాయిలో, అమానుషంగా ఉంటే, ఆ కేసులో బాధితురాలు, నిందితుడు రాజీ కుదుర్చుకోవడం, ఆ తర్వాత ఇరువురు పెళ్లి చేసుకోవడం అనే అంశాలు నిందితునికి వ్యతిరేకంగా జరుగుతున్న కోర్టు వ్యవహారాల రద్దు కోసం పరిశీలించదగినవి కాదని తెలిపింది. 


అత్యాచారం అనేది బాధితురాలి పట్ల జరిగే అమానవీయమైన, తీవ్రమైన నేరం మాత్రమే కాకుండా, బాధితురాలి బంధువులపైనా, యావత్తు సమాజంపైనా చాలా తీవ్రమైన ప్రభావానికి కారణమవుతుందని పేర్కొంది. తమపై దాఖలైన ఎఫ్ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక)ను రద్దు చేయాలని కోరుతూ ఇద్దరు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. 


ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, 2017లో ఓ 17 ఏళ్ళ బాలికను కొడుంగళ్లూరు, త్రిసూర్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్ళారు. రెండో నిందితుని ఇంటికి ఆమెను బలవంతంగా తీసుకెళ్ళి, మొదటి నిందితుడు అత్యాచారం చేశాడు. లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం ప్రకారం అత్యాచారం కేసు నమోదైంది. 


ఈ కేసును రద్దు చేయాలని నిందితులిద్దరూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా వీరి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో పార్టీల మధ్య రాజీ కుదిరినట్లు తెలిపారు. విచారణను కొనసాగించాలనే ఉద్దేశం బాధితురాలికి లేదని చెప్పారు. మొదటి నిందితునితో తనకు వివాహం జరిగినట్లు బాధితురాలు అఫిడవిట్ సమర్పించారని తెలిపారు. వీరి వివాహం 2020 డిసెంబరు 8న ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం జరిగిందని, ప్రస్తుతం ఇరువురు భార్యాభర్తలుగా జీవిస్తున్నారని చెప్పారు. 


దీనిపై హైకోర్టు స్పందిస్తూ, అత్యాచారం అనేది చాలా తీవ్రమైన నేరమని, ఇది ప్రైవేటు స్వభావంగల నేరం కాదని తెలిపింది. అంతేకాకుండా ఇది సమాజం పట్ల కూడా నేరమని పేర్కొంది. ఇది హత్య కన్నా తీవ్రమైనదని తెలిపింది. బాధితురాలికి అవమానం, భయోత్పాతం కలిగిస్తుందని, అందుకే దీనిని మహిళలకు వ్యతిరేకంగా జరిగే చాలా అమానుషమైన, కిరాతకమైన, క్రూరమైన నేరంగా పరిగణిస్తారని తెలిపింది. ఈ నేరం బాలలపై జరిగినపుడు, దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, అత్యంత బాధాకరమని తెలిపింది. బాలలు ఈ నేరానికి గురైతే, వారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, మర్యాద తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మైనర్ బాధితురాలి మనసుపై పడే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, దీని పర్యవసానాలు విస్తృతంగా ఉంటాయని  పేర్కొంది. 


ప్రస్తుతం బాధితురాలు మేజర్ అయిందని, నిందితునితో కలిసి సంతోషంగా జీవిస్తోందని చేస్తున్న వాదనల్లో పస లేదని తెలిపింది. నిందితులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయడానికి పరిశీలించడం కోసం చెల్లుబాటయ్యే కారణాలు లేదా సమర్థించదగిన కారణాలు లేదా నిర్ణయించగల యథార్థాలు కావని పేర్కొంది. జ్యుడిషియల్ స్క్రూటినీ పరీక్షను నిందితులు ఎదుర్కొనాలని, ట్రయల్ కోర్టులో విచారణను ఎదుర్కొనాలని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండిImage Caption