నదులు, జల వనరులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే : కేరళ హైకోర్టు

ABN , First Publish Date - 2021-07-25T20:39:47+05:30 IST

నదులను, జల వనరులను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర

నదులు, జల వనరులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే : కేరళ హైకోర్టు

కొచ్చి : నదులను, జల వనరులను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేరళ హైకోర్టు చెప్పింది. తమ పరిధిలోని జల వనరులను పరిరక్షించవలసిన కర్తవ్యం స్థానిక సంస్థలకు కూడా ఉందని తెలిపింది. మీనాచిల్ నదిలో నీటి స్వచ్ఛత కొనసాగేందుకు తగిన చర్యలను అమలు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని, కొట్టాయంలోని మూడు మునిసిపాలిటీలను ఆదేశించింది. ఈ నదీ పరీవాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించింది. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో మూడు నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని, కొట్టాయం జిల్లా కలెక్టర్‌కు నివేదికలను సమర్పించాలని ఈ మునిసిపాలిటీలను ఆదేశించింది.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మణి కుమార్, జస్టిస్ షాజీ పీ చాలీ ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది. 


మీనాచిల్ నదికి సంబంధించిన రెవిన్యూ రికార్డుల ఆధారంగా సర్వే చేయాలని, ఆక్రమణలను తొలగించాలని తాము మొదట జిల్లా కలెక్టర్, సర్వే డిప్యూటీ డైరెక్టర్‌లను కోరినట్లు పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. తాలూకా కార్యాలయాలను సంప్రదించి, సర్వే కోసం అయ్యే ఖర్చులను సొంతంగా చెల్లించి, సర్వే చేయించుకోవాలని సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఆదేశించారని తెలిపారు. సర్వే డిప్యూటీ డైరెక్టర్ జారీ చేసిన ఆదేశాలు చట్టవిరుద్ధమని, నది సరిహద్దులను నిర్ణయించి, కాపాడవలసిన బాధ్యత స్థానిక అదికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-25T20:39:47+05:30 IST