ఐఏఎస్ అధికారి అయినా పాడుబుద్ధి.. మహిళా జర్నలిస్టుకు వాట్సాప్‌లో అసభ్యకర స్టిక్కర్లు

ABN , First Publish Date - 2021-09-08T02:22:46+05:30 IST

ఆయనో ఐఏఎస్ అధికారి. పేరు ఎన్. ప్రశాంత్. కేరళలో స్టేట్ ఇన్‌లాండ్ నేవిగేషన్ కార్పొరేషన్ (కేఎస్ఐఎన్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్

ఐఏఎస్ అధికారి అయినా పాడుబుద్ధి.. మహిళా జర్నలిస్టుకు వాట్సాప్‌లో అసభ్యకర స్టిక్కర్లు

తిరువనంతపురం: ఆయనో ఐఏఎస్ అధికారి. పేరు ఎన్. ప్రశాంత్. కేరళలో స్టేట్ ఇన్‌లాండ్ నేవిగేషన్ కార్పొరేషన్ (కేఎస్ఐఎన్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్. ఉన్నత స్థాయిలో ఉన్నా పాడుబుద్ధి మానుకోలేదు. వాట్సాప్ ద్వారా మహిళా జర్నలిస్టుకు అసభ్యకర స్టికర్లు పంపిస్తూ అనుచితంగా ప్రవర్తించారు. విషయం కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కేయూడబ్ల్యూజే)కి చేరడంతో రాజకీయ రచ్చకు కారణమైంది. మహిళా జర్నలిస్టుకు అసభ్యకర వాట్సాప్ స్టిక్కర్లు పంపిన ప్రశాంత్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని కేయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది.


మహిళా జర్నలిస్టుకు ప్రశాంత్ రెండు స్టిక్కర్లు పంపారు. అందులో ఒకటి అసభ్యకరంగా ఉంది. దీంతో స్పందించిన కేయూడబ్ల్యూజే ముఖ్యమంత్రి పినరయి విజయన్, ముఖ్య కార్యదర్శి విశ్వాస్ మెహతాలకు లేఖ రాసింది. ప్రశాంత్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మాతృభూమి న్యూస్ పేపర్ జర్నలిస్టు అయిన కేపీ పవిత్ర ఐఏఎస్ అధికారి అయిన ప్రశాంత్‌కు వాట్సాప్ మెసేజ్ చేస్తూ.. వార్తా కథనం కోసం మాట్లాడేందుకు ఇది సరైన సమయమేనా అని అడిగారు.


బదులుగా ప్రశాంత్ ఎగతాళి చేస్తున్నట్టుగా ఉన్న ఓ మనిషి స్టిక్కర్‌ను పంపారు. దీనికి స్పందనగా ఆమె.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ మీరేం అన్నారో తెలుసుకోవాలనుకుంటున్నానని తిరిగి మెసేజ్ చేశారు.. దీనికి బదులుగా ప్రశాంత్ ఓ నటి వెనక వీపు భాగం కనిపిస్తున్న మరో స్టిక్కర్ పంపారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టిక్కర్ చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన పవిత్ర.. ఈ సమాధానం ఏంటని ప్రశ్నించగా, ఆయన ఈసారి అసభ్యంగా ఉన్న మరో స్టిక్కర్ పంపారు. 


ఐఏఎస్ అధికారి పంపిన స్టిక్కర్ చూసిన పవిత్ర షాక్‌కు గురయ్యారు. ఓ బాధ్యతాయుతమైన వ్యక్తి నుంచి ఇలాంటి పోస్టును ఊహించలేదని ఆమె వాపోయారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. దీంతో మళ్లీ స్పందించిన ప్రశాంత్.. ‘‘వార్తల కోసం మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ క్షమించండి. తప్పుడు మనిషి, తప్పుడు వ్యూహాలు’’ అని మరో రిప్లై ఇచ్చారు. కొంతమంది జర్నలిస్టులను రోడ్లు ఊడ్చే వారితో పోల్చడంలో తప్పులేదని అన్నారు.  


ప్రశాంత్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేయూడబ్ల్యూజే ఆయన చర్యలను తీవ్రంగా ఖండించింది. బదులివ్వకపోవడం సర్వసాధారణమే అయినప్పటికీ ఇలా అసభ్యకరమైన ఎమోజీలను పంపి అవమానించడం సీనియర్ ఐఏఎస్ అధికారికి తగదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఒక్క మహిళకు మాత్రమే కాదని, మొత్తం జర్నలిస్టులు, సమాజానికి జరిగిన అవమానమని కేయూడబ్ల్యూజే అధ్యక్షుడు కేపీ రేజీ, ప్రధాన కార్యదర్శి ఈఎస్ సుభాష్ అన్నారు.  

Updated Date - 2021-09-08T02:22:46+05:30 IST