ప్రీ క్వార్టర్స్‌లో సెరెనా, సోఫియా

ABN , First Publish Date - 2020-09-07T09:32:35+05:30 IST

అరుదైన రికార్డుపై కన్నేసిన మాజీ నెంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ యూఎస్‌ ఓపెన్‌లో అంచనాలకు తగ్గట్టు రాణిస్తోంది. 24వ గ్రాండ్‌స్లామ్

ప్రీ క్వార్టర్స్‌లో సెరెనా, సోఫియా

యూఎస్‌ ఓపెన్‌

కెర్బర్‌ అవుట్‌


న్యూయార్క్‌: అరుదైన రికార్డుపై కన్నేసిన మాజీ నెంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ యూఎస్‌ ఓపెన్‌లో అంచనాలకు తగ్గట్టు రాణిస్తోంది. 24వ గ్రాండ్‌స్లామ్‌ వేటలోనున్న ఈ సూపర్‌ మామ్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరగా.. మరో ఇద్దరు అమ్మలు విక్టోరియా అజరెంకా (బెలారస్‌), స్వెతానా పిరొంకోవా (బల్గేరియా)తో పాటు రెండో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) కూడా మూడో రౌండ్‌ దాటారు. సెరెనా 2-6, 6-2, 6-2తో మాజీ చాంపియన్‌ స్టోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)పై గెలిచి నాలుగో రౌండ్‌లో మరియా సక్కారితో పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత సోఫియా కెనిన్‌ (అమెరికా) 7-6, 6-3తో ఓన్స్‌ జేబెర్‌ (ట్యునీషియా)పై, అజరెంకా 6-1, 6-2తో ఇగా స్వియాటెక్‌ (పోలెండ్‌)పై, అన్‌సీడెడ్‌ పిరొంకోవా 6-4, 6-1తో డోనా వెకిక్‌ (క్రొయేషియా)పై నెగ్గారు. కెరీర్‌లో మూడు గ్రాండ్‌స్లామ్స్‌ సాధించిన వరల్డ్‌ మాజీ నెంబర్‌వన్‌ ఏంజెలికా కెర్బర్‌ (జర్మనీ) పోరాటం ప్రీక్వార్టర్స్‌లో ముగిసింది. జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా) 6-1, 6-4తో కెర్బర్‌కు షాకిచ్చి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. 

థీమ్‌, మెద్వెదేవ్‌ అదుర్స్‌: పురుషుల సింగిల్స్‌ మూడోరౌండ్‌లో రెండో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6-2, 6-2, 3-6, 6-3తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై గెలిచాడు. మూడో సీడ్‌ మెద్వెదేవ్‌ 6-3, 6-2, 6-2తో జెఫ్రీ వోల్ఫ్‌ (అమెరికా)పై నెగ్గి ప్రీక్వార్టర్స్‌ చేరాడు. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన రోహన్‌ బోపన్న-షపోవలోవ్‌ (కెనడా) జంట 4-6, 6-4, 6-3తో క్రావిట్జ్‌-మైస్‌ (జర్మనీ) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌ చేరింది. 

Updated Date - 2020-09-07T09:32:35+05:30 IST