Abn logo
Oct 23 2021 @ 01:03AM

టీడీపీ MP Kesineni Nani అలక వీడారా...!?

అధినేత చంద్రబాబుకు సంఘీభావం తెలిపి, ప్రసంగిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని

  • చంద్రబాబు దీక్షకు కేశినేని సంఘీభావం  
  • విజయవాడ నుంచి దీక్షా స్థలికి భారీ ర్యాలీ

విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అలక వీడారా? ఆయన మళ్లీ టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారా? తాజా పరిణామాలను చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని నిరసిస్తూ.. గురువారం ఉదయం దీక్ష చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు శుక్రవారం ఎంపీ కేశినేని నాని సంఘీభావం తెలిపారు. కేశినేని దాదాపు 50 కార్లు, 150కి పైగా మోటారు బైక్‌లతో భారీ ర్యాలీగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవడంతో బెజవాడ టీడీపీలోని కేశినేని వర్గం నాయకులు, కార్యకర్తల్లో మళ్లీ నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఎంపీ కేశినేని మళ్లీ పార్టీలో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల ముందు నుంచి సొంత పార్టీలో తన వ్యతిరేకవర్గంతో అంతర్యుద్ధం చేస్తున్న ఎంపీ కేశినేని నాని.. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన పార్టీ అధినేత చంద్రబాబును కలిసి ఇక మీదట తాను టీడీపీ తరఫున పోటీ చేయబోనని, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొననని స్పష్టం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. మొన్నటికి మొన్న తన కార్యాలయమైన కేశినేని భవన్‌లో టాటా సంస్థల అధినేత రతన్‌ టాటా చిత్రపటాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎంపీ కేశినేని పార్టీ మారబోతున్నారని, బీజేపీలో చేరేందుకు ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారంటూ సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఇదంతా కేశినేని వ్యతిరేకవర్గం నాయకులు కావాలనే చేయిస్తున్నారని కేశినేని భవన్‌ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. టాటా ట్రస్టు, కేశినేని ట్రస్టులు కలిసి సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తున్న తరుణంలోనే రతన్‌ టాటాతో ఎంపీ నాని ఉన్న ఫొటోను ఒకచోట ఏర్పాటు చేశామని, కేశినేని భవన్‌లోనూ, భవన్‌ చుట్టూ చంద్రబాబు, ఎన్టీఆర్‌ల ఫ్లెక్సీలు, ఫొటోలు అలాగే ఉన్నాయని, నాని టీడీపీలోనే కొనసాగుతారని టీడీపీ మైనారిటీ నాయకుడు ఫతావుల్లా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.

కొట్టుకుందామా.. రండి..

‘జగన్‌ అంటే వీరుడు, సూరుడూ అని చెప్పుకుంటున్నారు కదా? దమ్ముంటే చూసుకుందాం రండి.. ఇక డైరెక్ట్‌ ఫైట్‌. ఏదైనా ఉంటే అప్పుడే తేల్చుకుందాం. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండా? ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియమా? వైసీపీ నాయకులు టైమూ, డేటూ చెబితే మేం వచ్చేస్తాం..’ అంటూ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) వైసీపీ శ్రేణులకు సవాల్‌ విసిరారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు మద్దతుగా కేశినేని విజయవాడ నుంచి భారీ ర్యాలీతో తరలివెళ్లారు. చంద్రబాబును కలిసిన అనంతరం మాట్లాడుతూ, ‘వైసీపీ ఎక్కడుంటే అక్కడ టీడీపీ వాళ్లు ఉంటారు.. కొట్టుకుందామంటే కొట్టుకుందాం.. ఒకేసారి తేల్చేసుకుందాం. రోజూ కొట్టుకుంటుంటే ఏపీకి చెడ్డపేరు వస్తుంది..’ అన్నారు. జగన్‌ రాక్షసపాలనను ప్రపంచమంతా చూస్తోందన్నారు. రౌడీయిజం, గుండాయిజం పిరికిపందల చర్యలని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఏనాడూ శాంతిభద్రతల సమస్య రాలేదని చెప్పారు. వైసీపీ వాళ్లు తప్పుచేసినా మిన్నకున్నామన్నారు. రేపనేది ఒకటుంటుందని జగన్‌ గమనించాలన్నారు. జగన్‌కు త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.