10 ప్రత్యామ్నాయ పంటలు!

ABN , First Publish Date - 2021-11-29T08:26:39+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై దృష్టి సారించింది. యాసంగి ధాన్యం ఉప్పుడు బియ్యానికే అనుకూలంగా ఉండడం.. కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని కొనబోమని స్పష్టం చేయడంతో ప్రత్యామ్నాయాలపై ప్రణాళిక సిద్ధం చేసింది.

10 ప్రత్యామ్నాయ పంటలు!

  • వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమలు, 
  • పెసర్లు, ఆముదం, మినుము, పొద్దుతిరుగుడు, జొన్న 
  • యాసంగి సీజన్‌కు వ్యవసాయ శాఖ ప్రణాళిక
  • వరి సాధారణ సాగు విస్తీర్ణం 31 లక్షల ఎకరాలు
  • విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం ఉన్నచోటే వరి
  • మిగిలిన చోట్ల వద్దని ఇప్పటికే ప్రకటించిన సీఎస్‌
  • యాసంగి సీజన్‌కు వ్యవసాయశాఖ ప్రణాళిక
  • పప్పుధాన్యాలు, నూనెగింజలు వేయాలని రైతులకు సూచన
  • నేటి క్యాబినెట్‌ భేటీలో కీలక చర్చ


హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై దృష్టి సారించింది. యాసంగి ధాన్యం ఉప్పుడు బియ్యానికే అనుకూలంగా ఉండడం.. కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని కొనబోమని స్పష్టం చేయడంతో ప్రత్యామ్నాయాలపై ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ యాసంగి సాగుకు అనుకూలమైన 10 పంటలను ప్రతిపాదిస్తూ ప్రణాళిక విడుదల చేసింది. పల్లి, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమలు, పెసర్లు, ఆముదం, మినుము, పొద్దుతిరుగుడు, జొన్న వేయాలని రైతులకు విజ్ఞప్తి చేసింది. 


యాసంగిలో వరి సాగు విస్తీర్ణం రెండేళ్లుగా పెరుగుతూ వస్తోంది. 2019-20లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17 లక్షల ఎకరాలు ఉంటే.. 39.31 లక్షల ఎకరాల్లో సాగైంది. 2020-21లో సాధారణ విస్తీర్ణం 22.20 లక్షల ఎకరాలు కాగా.. వాస్తవ సాగు 52.79 లక్షల ఎకరాలకు పెరిగింది. రాష్ట్ర చరిత్రలో ఇంత అసాధారణ స్థాయిలో యాసంగిలో వరి సాగైన సందర్భాలు లేవు. ఈ ఏడాది యాసంగి (2021- 22)లో సాధారణ సాగు విస్తీర్ణం 31 లక్షల ఎకరాలకు పెరిగింది. గత ఏడాది తరహాలో విస్తీర్ణం రెట్టింపవుతుందనే ఆందోళన నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో సాధ్యమైనంత వరకు వరి సాగుకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ యాసంగిలో సాగుకు అనుకూలమైన 10 రకాల పంటలను ప్రతిపాదిస్తూ ప్రణాళిక విడుదల చేసింది. ఏ పంట సాగుచేయాలి? ఎలాంటి రకాలు విత్తాలి? దిగుబడి ఎంత వస్తుంది? వంటి వివరాలను రైతులకు సూచిస్తూ ప్రకటన జారీచేసింది. 


వరి విస్తీర్ణం తగ్గేదెంత?

ఇప్పటివరకు యాసంగిలో 800 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. యాసంగి వరి సాధారణ విస్తీర్ణాన్ని 31 లక్షల ఎకరాలుగా రాష్ట్ర వ్యవసాయశాఖ గుర్తించింది. సాగును నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డీలర్లు విత్తనాలు అమ్మకుండా కలెక్టర్లు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే నిరుడు యాసంగిలో సాగైన వరి (52.79 లక్షల ఎకరాలు) విస్తీర్ణం కంటే ఈ యాసంగిలో ఎంత తగ్గుతుంది? సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే తగ్గుతుందా? పెరుగుతుందా? అనేది కొద్దిరోజుల్లో తేలిపోతుంది.


నేటి క్యాబినెట్‌ భేటీ తర్వాత కీలక ప్రకటన

మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ అవుతోంది. ఈ భేటీ ప్రధానంగా వ్యవసాయ రంగంపైనే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పుడు బియ్యంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల ఢిల్లీ  పర్యటన, కేంద్ర ప్రభుత్వ స్పందన, ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్ల పురోగతి, వచ్చే యాసంగి సీజన్‌ కార్యాచరణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రోత్సాహకాలు, రైతుబంధు నిధుల పంపిణీ తదితర అంశాలు మంత్రివర్గ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం పంటల సాగుకు సంబంధించి సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడానికి ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, హరియాణా, కేరళ తదితర రాష్ట్రాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.


తెలంగాణ రైతులను పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగువైపు మళ్లించడానికి అలాంటి ప్రోత్సాహకాలు ఏమైనా ప్రకటిస్తారా? గల్ఫ్‌ దేశాలకు ఉప్పుడు బియ్యం ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ఎగుమతులు ప్రోత్సహించడానికి ఏదైనా పాలసీని ప్రకటిస్తారా? పంటల బీమా పథకం ఏమైనా అమలు చేస్తారా? లేదంటే వరి వేయొద్దని ఉచిత సలహా ఇచ్చి తప్పించుకుంటారా? అనేది తేలిపోనుంది. కాగా, రైతులు ఏ పంట వేసినా, అసలు సాగు చేయకపోయినా రైతుబంధు ఇవ్వాల్సిందేనని కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Updated Date - 2021-11-29T08:26:39+05:30 IST