మోత్కుపల్లికి కీలక పదవి?

ABN , First Publish Date - 2021-09-14T06:05:41+05:30 IST

సాధారణ ఎన్నికలు..

మోత్కుపల్లికి కీలక పదవి?

రాజకీయం.. రసవత్తరం

ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు 

తుంగతుర్తి అభ్యర్థిని ప్రకటించిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ

దళిత నినాదమే అన్ని పార్టీల విధానం


యాదాద్రి(ఆంధ్రజ్యోతి): సాధారణ ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించి రాజకీయాన్ని వేడెక్కించింది. అన్ని పార్టీలూ దళిత నినాదంతో ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలపై పోరుబాట పడుతున్నాయి. దీక్షలు, నిరసనలు, సభలు నిర్వహించి అధికార టీఆర్‌ఎస్‌పై విమర్శల పదును పెంచాయి.


రాష్ట్రంలో గతంలో మాదిరిగా ముందస్తు ఎన్నికలు వస్తాయా? లేదా అన్నది పక్కన పెడితే.. నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ముందస్తుగానే ఖరారు చేసే అవకాశాలున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గానికి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా ఏపూరి సోమన్నను పార్టీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించి సంచలనానికి తెర లేపారు. పలు పార్టీలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వేదికగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.


ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి నల్లగొండ జిల్లా వేదికగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. బీఎస్పీలో చేరి రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. మూడు జిల్లాల్లోనూ సభలు, సమావేశాలు నిర్వహించారు. బీఎస్పీ ఉమ్మడి జిల్లా పైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. టీపీసీసీకి నూతన సారథి రావడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సారి ఎన్నికల బరిలో ఎవరు ఉండబోతున్నారన్న అంశంపై, ఆ పార్టీలోని సీనియర్‌ నేతల్లో చర్చ మొదలైంది. బీజేపీలో కూడా నియోజకవర్గస్థాయిలో బలమైన అభ్యర్థులను రంగంలో దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు యాత్రల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రచా రాన్ని ప్రారంభించింది. మరోవైపు వామపక్షాలు, ఇతర పార్టీలూ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. 


తెరపైకి దళిత నినాదం

దళిత నినాదం మారుమోగుతోంది. అన్ని పార్టీలూ ఎస్సీలపై ప్రత్యేక దృష్టి సారించాయి. పలు పార్టీలో గల ఎస్సీ సీనియర్‌ నాయకులను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలపై ప్రత్యేక దృష్టి సారించాయి. దళితులకు సీఎం పదవి ఏదని, మంత్రి పదవుల కేటాయింపు, మూడు ఎకరాలు భూమి, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, ఎస్పీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు, సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో, ఎస్సీల ఓట్ల కోసమే ఈ పథకాన్ని ప్రవేశ పెడుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.


యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి నుంచే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. హుజూరాబాద్‌ నియోజక వర్గంతో పాటు మరో నాలుగు నియోజకవర్గాల్లోని ఒక్కో మండలాన్ని దళిత బంధును వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళితబంధు మాదిరిగానే గిరిజనబంధు ప్రవేశపెట్టాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తుర్కపల్లి మండలం శ్రీరాంపూర్‌లో దళిత ఆత్మగౌరవసభ నిర్వహించారు. 


మోత్కుపల్లికి కీలక పదవి?

మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు కీలక పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని సముచిత స్థానం కల్పించే ఆలోచనలో ఆపార్టీ అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. ‘దళిత బంధు’ చైర్మన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలోని రాజకీయ నేతల్లో సీనియర్‌. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో కొనసాగి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. బీజేపీలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి ‘దళితబంధు’ పథకంపై పొగడ్తల వర్షం కురిపించారు.


రాష్ట్రంలో ప్రస్తుతం దళిత నినాదం తెరపైకి రావడంతో, మోత్కుపల్లికి కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. ‘దళితబంధు’ పథకం అమలుపై సీఎం కేసీఆర్‌ సోమవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా, పలువురు నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన మోత్కుపల్లి నర్సింహులుకు సీఎం పక్కనే సీటు కేటాయించడంతో ఈ విషయం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.




Updated Date - 2021-09-14T06:05:41+05:30 IST