యంగ్‌ ఇండియన్‌ కార్యాలయానికి ఈడీ తాళం

ABN , First Publish Date - 2022-08-04T10:17:35+05:30 IST

ఢిల్లీలోని హెరాల్డ్‌ హౌజ్‌ ప్రాంగణంలో ఉన్న ‘యంగ్‌ ఇండియన్‌’ ఆఫీసుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బుధవారం తాత్కాలికంగా సీల్‌ వేసింది.

యంగ్‌ ఇండియన్‌ కార్యాలయానికి ఈడీ తాళం

  • సాక్ష్యాల పరిరక్షణకే కార్యాలయానికి
  • సీల్‌ వేసినట్లు వెల్లడించిన ఈడీ
  • ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లే దారిలో బారికేడ్లు
  • సోనియా, రాహుల్‌ ఇళ్ల వద్ద బలగాల పెంపు
  • కాంగ్రెస్‌ ఆగ్రహం.. రాజ్యసభ నుంచి వాకౌట్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఢిల్లీలోని హెరాల్డ్‌ హౌజ్‌ ప్రాంగణంలో ఉన్న ‘యంగ్‌ ఇండియన్‌’ ఆఫీసుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బుధవారం తాత్కాలికంగా సీల్‌ వేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా.. ఈడీ మంగళవారం బహదూర్‌ షా జాఫర్‌ మార్గ్‌లోని హెరాల్డ్‌ హౌజ్‌ సహా దాదాపు 12 చోట్ల తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సోదాల సమయంలో అక్కడ ఉండాల్సిన యంగ్‌ ఇండియన్‌ కార్యాలయ ప్రతినిధులు హాజరు కాలేదు. నిబంధనల ప్రకారం.. వారు లేకుండా సాక్ష్యాలను సేకరించకూడదు. దీంతో సాక్ష్యాలను పరిరక్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు హెరాల్డ్‌ హౌజ్‌ ప్రాంగణంలోని యంగ్‌ ఇండియన్‌ కార్యాలయం ఎదుట.. అనుమతి లేకుండా తెరవకూడదంటూ ఈడీ దర్యాప్తు అధికారి సంతకం చేసిన నోటీసును అంటించాయి. సోదాలు చేయడానికి వీలుగా కార్యాలయాన్ని తెరవడానికి రావాలంటూ యంగ్‌ ఇండియన్‌ కార్యాలయ ప్రధాన అధికారి, పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గేకు ఈడీ ఈమెయిల్‌ పంపింది.


 కానీ, దానికి ఎలాంటి స్పందనా రాలేదని సమాచారం. ఆయన ఎప్పుడు వచ్చి సోదాలు ముగియడానికి సహకరిస్తారో అప్పుడు సీల్‌ తీసేస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. 10 జనపథ్‌ రోడ్డులోని సోనియాగాంధీ నివాసం వద్ద అదనపు పోలీసు సిబ్బందిని నియమించడం, కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయానికి దారితీసే రోడ్లను బారికేడ్లతో మూసేయడం వివాదాస్పదంగా మారింది. యంగ్‌ ఇండియన్‌ కార్యాలయానికి ఈడీ సీల్‌ వేసిన నేపథ్యంలో అక్బర్‌ రోడ్డులోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనకు దిగే అవకాశం ఉందన్న సమాచారం తమకు వచ్చిందని, అందుకే ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 


కాంగ్రెస్‌ నేతలు మాత్రం.. తమ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే దారులను మూసేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని మండిపడుతున్నారు. ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌ ఎదురుగా భారీగా పోలీసులు మోహరించిన వీడియోను కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరామ్‌ రమేశ్‌ షేర్‌ చేశారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ సీజ్‌లో ఉంది. ఢిల్లీ పోలీసులు మా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, కాంగ్రెస్‌ అధ్యక్షురాలి (సోనియా) ఇంటిని, మాజీ అధ్యక్షుడి (రాహుల్‌) ఇంటిని చుట్టుముట్టారు. కక్షసాధింపు రాజకీయాలకు ఇది పరాకాష్ట. ఇలాంటివాటికి మేం లొంగిపోయే ప్రసక్తే లేదు. మీరు మా నోరు మూయించలేరు. మోదీ సర్కారు వైఫల్యాలపైన, చేస్తున్న అన్యాయాలపైనా మేం గళమెత్తుతూనే ఉంటాం.’’ అని ఆయన ట్వీట్‌చేశారు. యంగ్‌ ఇండియన్‌ కార్యాలయానికి సీల్‌ వేయడం, కాంగ్రెస్‌ కార్యాలయాన్ని పోలీసు పహారాలో పెట్టడం వంటివి.. ఒక నియంత భయాన్ని, అసహనాన్ని చూపుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసింది. అయితే, ఢిల్లీ పోలీసులు కొద్దిసేపటి తర్వాత ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లే దారిలో బారికేడ్లను తొలగించారు. మరోవైపు.. రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మలికార్జున్‌ ఖర్గే సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కానీ, దీనిపై చర్చించేందుకు సభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ అనుమతించలేదు. దీంతో.. తమ సమస్యలను ఇక్కడ ప్రస్తావించనివ్వకపోతే తాము ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. ఆ సమయంలో సభలోనే ఉన్న మరో మంత్రి పీయూష్‌ గోయల్‌ దీనిపై స్పందించారు. ‘‘చట్టం తన పని తాను చేసుకుపోతోంది. అయినా.. అలాంటి పనులు చేసేటప్పుడు పర్యవసానాల గురించి కూడా ఆలోచించాలి’’ అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-08-04T10:17:35+05:30 IST