కేజీహెచ్‌లో ప్రసవానికి గర్భిణి ససేమిరా!

ABN , First Publish Date - 2020-07-14T10:13:32+05:30 IST

మండలంలోని అంతర్ల గ్రామంలోని నెలలు నిండిన సికెల్‌ సెల్‌ ఎనీమియా గర్భిణీ ప్రసవం కోసం కేజీహెచ్‌కి వెళ్లేందుకు ..

కేజీహెచ్‌లో ప్రసవానికి గర్భిణి ససేమిరా!

సికెల్‌ సెల్‌ ఎనీమియా బాధపడుతున్న వైనం

ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్న ఆర్‌వీనగర్‌ వైద్యలు

అవసరమైతే పోలీసు సహకారం తీసుకోవాలని పీవో సూచన


చింతపల్లి: మండలంలోని అంతర్ల గ్రామంలోని నెలలు నిండిన సికెల్‌ సెల్‌ ఎనీమియా గర్భిణీ ప్రసవం కోసం కేజీహెచ్‌కి వెళ్లేందుకు నిరాకరిస్తున్నది. ఆర్‌వీనగర్‌ పీహెచ్‌సీ వైద్యులు ఎంత చెప్పినా గర్భిణీ, ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించడంలేదు. దీంతో పీహెచ్‌సీ వైద్యాధికారిణి గాయత్రి ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటేశ్వర్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన పీవో అవసరమైతే పోలీసుల సహకారంతో కేజీహెచ్‌కు పంపించమని సూచించారు. వివరాల్లోకి వెళితే..


అంతర్ల గ్రామానికి చెందిన కవడం శిరీష సికెల్‌ సెల్‌ ఎనీమియతో బాధపడుతున్నది. మూడేళ్ల క్రితం ఆమె తొలి గర్భం ధరించడంతో వైద్యులు అతికష్టంపై సుఖప్రసవం చేశారు. అప్పట్లోనే రెండో గర్భం కోసం ప్రయత్నిస్తే ప్రాణానికి ప్రమాదమని వైద్యులు సూచించారు. అయినా శిరీష రెండో గర్భం ధరించింది. ఈనెల 16న ఆమెకు ప్రసవం జరుగుతుందని వైద్యులు సూచించారు. ఆమె ప్రస్తుతం 8ఎంజీ హిమోగ్లోబిన్‌ కలిగి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేజీహెచ్‌లో మాత్రమే ఆమెకు ప్రసవం చేయాలని, ఐదు రోజులు ముందుగా ఆస్పత్రికి తరలించాలని వైద్యాధికారి గాయత్రి చెబుతున్నారు.


రెండు రోజులుగా ఆమెను కేజీహెచ్‌కి తరలించేందుకు వైద్యాధికారి, కార్యదర్శి శ్రీనివాసరావు, ఏఎన్‌ఎం ప్రయత్నిస్తున్నప్పటికీ గర్భిణీ, ఆమె భర్త శివ, కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. కేజీహెచ్‌లో ఉండలేమని, ఇంటిలోనే ప్రసవం పొందుతామని గర్భిణీ చెబుతున్నది. దీంతో వైద్యాధికారిణి ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళ్లారు. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం పోలీసుల సహకారంతో కేజీహెచ్‌కి తరలించాలని వైద్యసిబ్బంది భావిస్తున్నారు. 

Updated Date - 2020-07-14T10:13:32+05:30 IST