ఖైదున కైగట్టిన మోహ గీతికలు

ABN , First Publish Date - 2020-08-10T10:59:43+05:30 IST

ప్రణయ లాలసలో ఓలలాడే సఖి నిగూఢ లోలక కనుతారకలు, మా వ్యామోహ కలువపూల పాన్పుపైన డోలలూగే మరాళ లాలనలూ,...

ఖైదున కైగట్టిన మోహ గీతికలు

1

ప్రణయ లాలసలో ఓలలాడే

సఖి నిగూఢ లోలక కనుతారకలు,

మా వ్యామోహ కలువపూల పాన్పుపైన

డోలలూగే మరాళ లాలనలూ,

వేకువలో లజ్జతో వాలే ఆ మదన వదనము,

ఇంకనూ

స్మరిస్తున్నాను.


2

జాబిలి జిలుగులో సఖి ముఖం

కలాపంలో లయగా కంపించే ఆ దేహం 

కేళి పగ్గాలు వడిసి పట్టిన ప్రణయిని చేతులు

ధనువులా ధిటవు కటి వంపు ఒంపిన 

లావణ్య విశాల కుచ కుంభములు 

పురి విడిన గింగిరాల కేశ మేఘమాలికల 

          చకోర విన్యాసాలు

ఇంకనూ

మెదలుతున్నాయి.


3

బంగారు లోలాకులు చుంబించే 

కెంపు చెంపల చెలి ముద్దుమోము

మగ రసపట్టును తన వశం చేసుకునే 

ఆమె సరస సల్లాపంలో

లోలక దేహంపై పోగై మెరిసే పగడాల సరాలు

అంతకంతకు ఉబ్బి కురిసే చెమట బిందువులు

ఇంకనూ

కనుల కదలాడుతున్నాయి.


4

కేళి తదుపరి గసలో గుసగుసలా 

గడబిడతో మైమరపులో 

మాటల అలవరసలు ఏమారుస్తూ

తత్తరగా సాగే కుచ్చీటప్పాలలో 

నా పై కురిసే వేనవేల మెచ్చుకోళ్ళు

ఇంకనూ

గింగురుమంటున్నాయి.


5

రత్యానంతర వ్యాకులతలో 

వాల్చిన రెప్పలు

సోలిన మేను హొయలు

కమలినిలో రాయంచ ప్రాసక్రీడల్లా

జన్మజన్మలనూ వెన్నంటే 

ముచ్చటైన ఆమె ఉలిపిరి దుస్తులు

పురులు విడిన ఆమె కురుల ముడులు

వాలక మూయని నా రెప్పల వెనుక తారకలే

ఇంకనూ.


6

ఆమె జగదేక రసిక రమణి

ముగ్ధ మోహన సౌష్ఠవ సౌందర్య రాశి

జుర్రుకునేందుకు సిద్ధంగా వున్న 

అసమాన సంపూర్ణ చషకం ఆమె

ప్రణయకేళిలో 

చెరకు వింటి వేలుపు వలపు శరాల క్షతగాత్రి

ఇంకనూ 

మదిన మెదలుతు వుంది.


7

నేను మధుర అధర అమృతాన్ని 

మిక్కిలి సేవించిన సొలపులో 

దిట్టమైన పారవశ్య తేజోమూర్తి 

స్తన మండలంపైన నా నఖక్షదం

ఆనవాలు గమనించాను

ఆ ముద్రలను ఆమె

వాలుకనుల పరిశీలనగా చూసి 

తన కరకమలాలతో జాగ్రత్త చేయడం

ఇంకనూ

జ్ఞాపకమే! 


English : Barbara Stoler Miller, 

Sanskrit : The Caurapancasika – The northern 

Recension, And notes by Smt. Lila Siveswarakar.

అనంతు చింతపల్లి

Updated Date - 2020-08-10T10:59:43+05:30 IST