ఖలిస్థాన్ ఉగ్రవాది తమ్ముడికి కీలక పదవి..

ABN , First Publish Date - 2021-11-24T19:54:57+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తాజా నియమాకం ..

ఖలిస్థాన్ ఉగ్రవాది తమ్ముడికి కీలక పదవి..

ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తాజా నియమాకం వివాదం రేపుతోంది. పంజాబ్ జెన్కో లిమిటెడ్ చైర్మన్‌గా బల్వీందర్ సింగ్‌ను పంజాబ్ సర్కార్ నియమించింది. బల్విందర్ సింగ్ స్వయానా ఖలిస్థాన్ ఉగ్రవాది అవతార్ సింగ్ పన్ను సోదరుడు కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.


ఉగ్రవాదులను బుజ్జగించేందుకే బల్వీందర్ సింగ్‌కు కీలక పదవి అప్పగించినట్టు బీజేపీ, సాద్ నేతలు చన్నీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నియామకంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని 'సాద్' నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేసారు. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) ఆఫీస్ బేరర్‌ తమ్ముడిని పంజాబ్ జెన్సో లిమిటెడ్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిందని, దీనిపై సీఎం ఏమి సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. ఖలిస్థాన్ ఏర్పాటుకు మద్దతుగా నిలిచిన వేర్పాటువాద సంస్థ ఎస్‌ఎఫ్‌జీ. దీనికి అవతార్ సింగ్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాల విషయంలో భారత ఏజెన్సీలు అవతార్ సింగ్ కదలికలపై నిఘా ఉంచాయి. కాగా, వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Updated Date - 2021-11-24T19:54:57+05:30 IST