సతులా? పతులా?.. నేడు ఖమ్మం కార్పొరేషన్‌ డివిజన్ల ఖరారు

ABN , First Publish Date - 2021-04-14T05:46:20+05:30 IST

ఖమ్మం నగరపాలక ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించారు. వారికి ఏఏ డివిజన్లు కేటాయిస్తారన్న విషయాన్ని లాటరీ ద్వారా నిర్ణయించనున్నారు.

సతులా? పతులా?..  నేడు ఖమ్మం కార్పొరేషన్‌ డివిజన్ల ఖరారు

 లాటరీలో తేలనున్న అదృష్టం 

 గతానికి భిన్నంగా ఈ సారి కేటాయింపులు

ఖమ్మం కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 13: ఖమ్మం నగరపాలక ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించారు. వారికి ఏఏ డివిజన్లు కేటాయిస్తారన్న విషయాన్ని లాటరీ ద్వారా నిర్ణయించనున్నారు. దీంతో డివిజన్లలో పోటీ చేసేది సతులా? లేదంటే పతులా? అన్న విషయం తేలనుంది. బుధవారం డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారైన తర్వాత లాటరీ ద్వా రా మహిళలకు డివిజన్లు కేటాయిస్తారు.

లాటరీద్వారా మహిళలకు డివిజన్లు..

గతానికి భిన్నంగా ఈసారి లాటరీ ద్వారా మహిళలకు డివిజన్లు కేటాయిస్తున్నారు. 2016లో తొలిసారి నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు ఏఏ డివిజన్లలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారో చూసి, అక్కడ మహిళలకు సీట్లు కేటాయించారు. గతంలో నగరంలో 50 డివిజన్లు ఉండగా రిజర్వేషన్ల ప్రకారం 25 డివిజన్లలో మహిళలకు పోటీచేసే అవకాశం కల్పించారు. ప్రస్తుతం 60 డివిజన్లు ఉండటంతో 30 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇద్దరూ సిద్ధంగా ఉండండి..

డివిజన్లలో టిక్కెట్లు ఇస్తామని సంకేతాలు అందినవారికి ఇద్దరూ సిద్ధంగా ఉండాలన్న సమాచారం వెళ్లింది. దీంతో టిక్కెట్లు ఆశిస్తున్న వారు తమ భార్యలను పోటీలో దింపేందుకు సన్నద్ధం చేస్తున్నారు. వస్తే తనకు, లేకుంటే తన భార్యకు టిక్కెట్టు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పతులు పోటీలో ఉంటారా. సతులు పోటీలో ఉంటారా. అన్న విషయం బుఽధవారం తరువాత తేలనుంది. డివిజన్ల మార్పులు, రిజర్వేషన్లు తదితర విషయాలు అధికారుల తయారుచేస్తే, మహిళలకు కేటాయించే డివిజన్లు మాత్రం అదృష్టం ద్వారానే తేలుతాయి అంటే లాటరీ ద్వారానే డివిజన్లు కేటాయిస్తారు.


Updated Date - 2021-04-14T05:46:20+05:30 IST