ప్రభుత్వ పరిశీలనలో ఎల్‌ఆర్‌ఎస్‌, ఎస్సైన్‌మెంట్‌ స్థలాల సమస్య

ABN , First Publish Date - 2020-09-26T11:22:09+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు దశాబ్దాల

ప్రభుత్వ పరిశీలనలో ఎల్‌ఆర్‌ఎస్‌, ఎస్సైన్‌మెంట్‌ స్థలాల సమస్య

సీఎం, మునిసిపల్‌ మంత్రికి వివరించిన ఎమ్మెల్యే,

మునిసిపల్‌ చైర్మన్‌


సత్తుపల్లి, సెప్టెంబరు 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు దశాబ్దాల క్రితం మునిసిపాలిటీల పరిధిలో మంజూరు చేసిన ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.


సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహే్‌షలో గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మునిసిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌లను కలసి ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు.


దీనిపై స్పందించిన కేసీఆర్‌, కేటీఆర్‌లు ఈ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇవ్వటంతో పాటు అన్ని మునిసిపాలిటీల్లో ఈ తరహా సమస్యలను పరిష్కరించేందుకు గాను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సత్తుపల్లి మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌ తెలిపారు.


వారసత్వ భూములకు సంబంధించి..

అనువంశికంగా వచ్చిన పట్టా భూములలో విశాలమైన స్థలాల్లో నిర్మాణం చేసుకొని ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాల విషయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలు పునపరిశీలించాలని ఎమ్మెల్యే సండ్ర ముఖ్యమంత్రి, మునిసిపల్‌ మంత్రులను కోరారు. సత్తుపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీ నుంచి 2005లో నగర పంచాయతీగా ఏర్పడిందని, దీనిలో సత్తుపల్లి, అయ్యగారిపేట రెవెన్యూ గ్రామాలున్నాయని పేర్కొన్నారు. ఆయా రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయం ఆధారంగా నివాసం ఉంటున్న రైతు కుటుంబాలకు సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్‌ ఇబ్బందిగా మారిందని చెప్పారు.


రైతులు తమ భూముల్లో ఇంటి నిర్మాణంతో పాటు పశువుల పాకలు, వరిగడ్గి వామిలు ఏర్పాటు చేసుకునేందుకు 10 నుంచి 30 గుంటల స్థలాలను తరతరాలుగా వాడుకుంటున్నారని వివరించారు. ఇలాంటి ఇళ్ల స్థలాల విషయంలో భవిష్యత్తులో వారికి యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కొత్త నిర్మాణాలు, విక్రయాలకు అభ్యంతరాలు లేకుండా ప్రస్తుత చట్టంలోని నిబంధనలను సవరించాలని కోరారు. గతంలో బావులు, వర్షాధారంగా సేద్యం చేసుకున్న భూములు పట్టణం విస్తరించటం వల్ల ఇళ్ల స్థలాలుగా మారాయని ఈ స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తింపజేస్తే రైతులకు ఆర్థికంగా భారంగా మారుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలను సవరించాలని కోరారు.


దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ఇలాంటి స్థలాలు అన్ని మునిసిపాలిటీల్లో ఎన్ని ఉన్నాయో వెంటనే వివరాలు సేకరించాలని ఆదేశించినట్లు చైర్మన్‌ మహేష్‌ తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారని నిబంధనలు సవరిస్తే చాలా ప్రాంతాల్లో ప్రజలకు లబ్ది చేకూరుతుందని చెప్పారు.



ఎస్సైన్‌మెంట్‌ స్థలాలపై సానుకూల స్పందన

సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో రాజీవ్‌నగర్‌, ఎన్టీఆర్‌ కాలని, జలగం నగర్‌, వెంగళరావునగర్‌, విరాట్‌నగర్‌, ద్వారకాపురి కాలనీ, గాంధీనగర్‌, జవాహర్‌నగర్‌, అంబేద్కర్‌నగర్‌, కాకర్లపల్లి రోడ్‌లలో పూర్వం నుంచి 3227మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేసింది. కొన్ని కాలనీల్లో ప్రభుత్వ పరంగా కాలనీ ఇళ్లను కూడా నిర్మించి ఇచ్చారు.


వీటికి సంబంధించి అసలు ఎస్సైన్‌మెంట్‌ పట్టాలు పొందిన వారు, కాలనీ ఇళ్లు నిర్మించుకున్న వారి వారసుల పేర్లతో కూడా రికార్డుల్లో మార్పు జరగని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్‌ నగర్‌, రాజీవ్‌నగర్‌లలో మొదట్లో ఇళ్లు మంజూరైన వారు చాలా వరకూ ఇళ్లను అమ్మేసుకొని వెళ్లిపోయారు. దీంతో అలాంటి వారి పట్టాలను రద్దు చేసి వాస్తవంగా ఇళ్లలో ఎవరైతే ఉంటున్నారో వారిపేరుతో కూడా పట్టాలు మార్పిడి చేయాలని ఎమ్మెల్యే సండ్ర ముఖ్యమంత్రిని కోరారు.


కనీసం వారసుల పేర్ల మీద అయినా పట్టాలు ఇవ్వాని కోరారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కాలనీల్లో ఒరిజినల్‌ ఎస్సైనీలు ఎవరు ప్రస్తుతం ఎవరు నివశిస్తున్నారనే వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయితే ఎంతో కాలంగా నిరుపేదలు తమ పేర్లతో పట్టాలు వస్తాయనే ఎదురుచూపులు ఫలించనున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడితే అన్ని మునిసిపాలిటీల్లో ఈ రకమైన సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2020-09-26T11:22:09+05:30 IST