అద్దెగర్భం ఎట్‌ రూ.5లక్షలు

ABN , First Publish Date - 2020-09-26T11:13:23+05:30 IST

పేద కుటుంబాల్లోని మహిళలే లక్ష్యంగా అద్దెగర్భం( సరోగసి) దందా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగుతోంది.

అద్దెగర్భం ఎట్‌ రూ.5లక్షలు

హైదరాబాద్‌ కేంద్రంగా దందా

దళారుల వలలో ఉమ్మడి జిల్లా పేద మహిళలు

రెండోసారి గర్భం దాల్చేందుకు వెళ్లిన ఓ మహిళ

నేడో, రేపో వెళ్లేందుకు మరొకరు సిద్ధం


ఖమ్మం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):  పేద కుటుంబాల్లోని మహిళలే లక్ష్యంగా అద్దెగర్భం( సరోగసి) దందా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగుతోంది. సర్కారు చట్టాలకు పదును పెట్టినా కొందరు ఆసుపత్రుల నిర్వాహకులు టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్ల మాటున ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో మన్యం మహిళలు పావులవుతున్నారు. రాష్ట్రవ్యాప్త నెట్‌వర్క్‌లో దళారులు రూ.లక్షలు సంపాదిస్తూ దర్పం ప్రదర్శిస్తున్నారు.


పేదమహిళలతో ఒప్పందాలు

ఆర్‌ఎంపీలే ఏజెంట్లుగా అద్దెగర్భం వ్యాపారానికి తెరలేపారు. పలుగ్రామాల్లో పరిచయమున్న వ్యక్తుల ద్వారా పేదమహిళలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఆ మహిళను తమతోపాటే ఉంచుకుని ఖర్చులన్నీ భరిస్తున్నారు. ప్రసవించిన బిడ్డ పాలు మరిచేవరకు తమతోపాటే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


అందుకుగాను ఒక్కొక్కరికి ఒక్కోరేటు ఇస్తున్నారు. మహిళల ఆర్థిక  అవసరాలను బట్టి రూ. 4నుంచి రూ.5 లక్షల వరకు ముట్టజెపుతున్నారు. ఏజెంట్లు రెండువైపులా కమీషన్‌ దండుకుంటున్నారు. సులువుగా రూ.లక్షల ఆదాయం రావడంతో ఏజెంట్లు అత్యుత్సాహం చూపుతున్నారు.


హైదరాబాద్‌ కేంద్రంగా దందా

అనైతికమైన అద్దెగర్భం వ్యాపారం ఉమ్మడి జిల్లాలో జోరుగానే సాగుతోంది. దళారులు మహిళలకు కాసుల ఆశచూపి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పరిచయాలతో ఎరవేసి అమాయకపు మహిళలకు వలలోకి లాగుతున్నారు. గతంలో పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, ముదిగొండ ప్రాంతాలకు చెందిన మహిళలు ఈ వలలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా భర్త లాయర్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ డాక్టర్‌ ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటుగా ఆంధ్రాప్రాంతానికి చెందిన 150 మంది మహిళలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. గతంలో ముదిగొండ మండలంలోని ఓ మహిళ గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చి తిరిగి రాగా... ఆ తర్వాత కొద్ది రోజులకే అదే గ్రామానికి చెందిన మరో మహిళ అద్దె గర్భం దాల్చేందుకు పట్నం వెళ్లగా ఆమెకు నగదులో కోతపెట్టినట్టు సమాచారం. ఆయా మహిళలకు నగదు ఎగ్గొట్టిన విషయంలో పాల్వంచలో కేసులు నమోదయనట్టు సమాచారం.


వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ప్రకారం అద్దెకు గర్భం ఇచ్చే మహిళ ఒకసారి మాత్రమే అనుమతి ఉండగా.. ప్రస్తుతం ముదిగొండ మండలంలో బిడ్డకు జన్మనిచ్చి వచ్చిన మహిళ మళ్లీ అద్దె గర్భం దాల్చేందుకు వెళ్లినట్టు తెలిసింది. నేడో రేపో మరో మహిళ కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

Updated Date - 2020-09-26T11:13:23+05:30 IST