కలిసొస్తున్న కాలం

ABN , First Publish Date - 2020-07-02T10:31:27+05:30 IST

ఈ ఏడాది ఖరీఫ్‌కి కాలం కలిసొస్తోంది. అదునులో పదునందుతుండడంతో మెట్టపైర్లపై రైతులు ఆశాజనకంగా ఉన్నారు

కలిసొస్తున్న కాలం

ఇరు జిల్లాల్లో జోరుగా ఖరీఫ్‌సాగు 

జూన్‌లో అధిక వర్షపాతం నమోదు

ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు


ఖమ్మం, జూలై 1(ప్రతినిధి): ఈ ఏడాది ఖరీఫ్‌కి కాలం కలిసొస్తోంది. అదునులో పదునందుతుండడంతో మెట్టపైర్లపై రైతులు ఆశాజనకంగా ఉన్నారు. చాలా సంవత్సరాల తరువాత జూన్‌లో మంచి వర్షాలు కురవడంతో గతంలో ఎన్నడూలేని విధంగా రైతులు విత్తనాలు పెట్టారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో జూన్‌ నెలలో సగటును మించి అధిక వర్షపాతం కురవడంతో రైతులు పత్తి, కంది, పెసర, తదితర పంటలతోపాటు వరినారుమళ్లు పోశారు. గత ఏడాది జూన్‌లో జిల్లాలో సగటు వర్షపాతం కూడా కురవకపోవడంతో పంటల విస్తీర్ణం చాలా తగ్గింది. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో 5,18,000 ఎకరాలు ఖరీఫ్‌ సాగు లక్ష్యం కాగా ఇప్పటికి జిల్లాలో 1,20,000 ఎకరాల్లో పంటలు వేశారు. జూన్‌లో 105మిమీ సగటు వర్షపాతం కాగా 185మిమీ వర్షపాతం నమోదైంది. జూలైలో జిల్లా సగటు వర్షపాతం 270మి.మీ కాగా నెల ప్రారంభంలోనే ఇరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలో జూన్‌లో 144మిమీ. సాధారణ వర్షపాతం కాగా 200మి.మీ కురిసింది. 55మి.మీ. అదనంగా కురిసింది. ఇప్పటి వరకు జిల్లాలో పత్తి 2,55,000ఎకరాలకు గాను 1,05,000 ఎకరాలు వేశారు. కంది 10వేల ఎకరాలకుగాను 3500 ఎకరాల్లో సాగుచేశారు.


చెరకు 3వేల ఎకరాలకు గాను 1500 ఎకరాల్లో వేశారు. పెసర 22వేల ఎకరాలకుగాను 10వేల ఎకరాల్లో వేశారు. వరి 1000 ఎకరాల్లో వేశారు. వరినారుమళ్లు జిల్లాలో పెద్దమొత్తంలో పోశారు. మొత్తంమీద జిల్లాలో 1,20,000 హెక్టార్ల వరకు పంటల సాగు జరిగింది. జూలైలో వర్షాలు భారీగా కురిస్తే వరినాట్లు కూడా ముమ్మరంగా సాగే పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం, 3,54,337 ఎకరాల సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 80,101 ఎరాల్లో రైతులు పంటలు వేశారు. అందులో వరి 1,53,767 ఎకరాలకు గాను 1629 ఎకరాలు, పత్తి 1,83,416 ఎకరాలకు గాను 77,433, కంది 13,500కుగాను 764, పెసర 1000 ఎకరాలకు గాను 202 ఎకరాలలో సాగు చేశారు. జూలైలోఓ మిగిలిన విస్తీర్ణంలో పంటలు వేసే అవకాశం ఉంది. జూలైలో కురిసే వర్షాలపైనే ఇరు జిల్లాల్లో వరినాట్లు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు మిర్చి నారుమళ్లు కూడా ఉభయ జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభించారు. మొత్తానికి ఖరీఫ్‌ ప్రారంభంలోనే వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండడంతో రైతులు ఈ సారి మంచి దిగుబడులపై ఆశలు పెంచుకుంటున్నారు  

Updated Date - 2020-07-02T10:31:27+05:30 IST