ఉప్పుడు బియ్యం తీసుకోం

ABN , First Publish Date - 2021-10-17T09:18:00+05:30 IST

ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ నెల 18(సోమవారం) నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఉప్పుడు బియ్యం తీసుకోం

  • 100 శాతం ముడి బియ్యం సేకరణ
  • రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు 
  • ఏ-గ్రేడ్‌ మద్దతు ధర 1,960, సాధారణ
  • రకం 1,940.. మార్గదర్శకాలు విడుదల


హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ నెల 18(సోమవారం) నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈసారి ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది. ఏ ఒక్క రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యాన్ని తీసుకోబోమంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఉప్పుడు బియ్యం సేకరణ ఉండదని సర్కారు వివరించింది. ఈ మేరకు ఖరీ్‌ఫలో చేపట్టే ధాన్యం సేకరణ కోసం ‘ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌(కేఎంఎస్‌)-2021-22’ మార్గదర్శకాలను శనివారం పౌర సరఫరాల శాఖ కార్యదర్శి అనిల్‌ కుమార్‌ జారీ చేశారు. రాష్ట్రంలో 100 శాతం వరకు ముడి బియ్యాన్ని సేకరిస్తామని ప్రభుత్వం తెలిపింది. 


ఈసారి ఖరీఫ్‌లో సుమారు 135 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఎఫ్‌సీఐ ద్వారా ఎంత ధాన్యం సేకరించాలి, పౌర సరఫరాల సంస్థ ద్వారా ఎంతన్నది తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. ఏ-గ్రేడ్‌ ధాన్యం క్వింటాలు మద్దతు ధర(ఎంఎ్‌సపీ) రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940గా ప్రకటించింది. ఫోర్టిఫైడ్‌ కెర్నెల్‌(ఎ్‌ఫఆర్‌కే) బియ్యాన్ని ఎంత మేర సేకరించాలన్నది తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ముడి బియ్యాన్ని(రా రైస్‌) పౌర సరఫరాల సంస్థకు, బాయిల్డ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐకి పంపాల్సి ఉంటుందని చెప్పింది. రైస్‌ మిల్లులుగానీ, గోదాములుగానీ అనుమతి ఉన్న మేరకే ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో పౌర సరఫరాల అధికారులు, డీఎంలు నిఘా పెట్టాలని ఆదేశించింది. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) విషయంలో వేగం తగ్గితే, అలాంటి మిల్లుల నుంచి ధాన్యాన్ని ఇతర మిల్లులకు తరలిస్తామని హెచ్చరించింది. ఇక ధాన్యం, బియ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేసుకోవాలని మిల్లర్లకు సూచించింది. ఏ-2 రిజిస్టర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని, ఈ రిజిస్టర్లను తనిఖీ చేయాలంటూ అధికారులను ఆదేశించింది. 

Updated Date - 2021-10-17T09:18:00+05:30 IST