ఖరీఫ్‌ మందగమనం

ABN , First Publish Date - 2021-09-12T06:20:48+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌ పంటల సాగుకు వాతావరణం కలిసిరావడం లేదు. అదునులో పడని వాన.. సీజన్‌ చివర్లో ఎడతెరపి లేకుండా కురిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.

ఖరీఫ్‌ మందగమనం
దున్ని పంటలు సాగు చేయకుండా ఉన్న భూమి

సాధారణ సాగు కూడా అనుమానమే

తొలుత వర్షాభావం, తర్వాత ముసురు 
పశ్చిమ ప్రాంతంలో నేటికీ తక్కువగానే వర్షాలు 
మూడు వారాల్లో ముగియనున్న సీజన్‌
ఇప్పటికి 57శాతం విస్తీర్ణంలోనే పంటలు
గణనీయంగా తగ్గిన కంది, పత్తి సాగు
స్వల్పంగా పెరిగిన మిర్చి
సాగర్‌ ఆయకట్టులో వరి సాగుపై అయోమయం 
తూర్పున ముసురు వాన, పశ్చిమాన ఒకటే ఎండ.. ఇదీ నాలుగు రోజుల కిందట వరకూ జిల్లాలో వాతావరణ పరిస్థితి. అటు వాన పడక సాగు ముందుకు కదలడం లేదు.. ఇటేమో పొలాలు ఆరడం లేదు. రెండు రోజుల నుంచి తూర్పు ప్రాంతాల్లో కొంత మేరకు వానలు ఆగినా కొన్ని పంటల సాగుకు సంబంధించి అదును దాటిపోయిందనే భయం వెంటాడుతోంది. ఇప్పుడు వేసినా పంట పండుతుందో లేదోనన్న సంశయంతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఇదీ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ పరిస్థితి. పంటల సాగు మందగించింది. సీజన్‌ ప్రారంభమై వందరోజులు పూర్తయినప్పటికీ సాధారణంలో సగం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ప్రధానమైన మెట్ట పంటల విస్తీర్ణం తగ్గిపోగా ఇక వాటి సాగుకు సమయం మించిపోయింది. అలాగే మరో మూడు వారాలలో ఈ సీజన్‌ ముగియనుండటంతో ఈఏడాది ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణంలో కూడా పంటలు సాగు ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. 
ఒంగోలు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌ పంటల సాగుకు వాతావరణం కలిసిరావడం లేదు. అదునులో పడని వాన.. సీజన్‌ చివర్లో ఎడతెరపి లేకుండా కురిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. మరోవైపు పశ్చిమంలో ఎండబెట్టింది. దీంతో ఖరీఫ్‌ సాగు పూర్తిగా మందగించింది. జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ ఖరీఫ్‌ సీజన్‌గా పరగణిస్తారు. మే ఆఖరు నుంచే ప్రారంభమయ్యే తొలకరి జల్లులతో జూన్‌లో సజ్జ, పెరస, నువ్వు వంటి తొలకరి పైర్లతోపాటు పశుగ్రాస పంటలను వేస్తారు. ఇక జూలై, అగస్టు మాసాల్లో ప్రధానమెట్ట పంటలను సాగు చేశారు.  ఆగస్టు రెండో పక్షం నుంచి మిర్చి, సెప్టెంబరులో వరి, మినుము ఇతరత్రా వేస్తారు. ఇలా ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తం 2,15,552 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. అలాంటిది ఈ ఏడాది ఇప్పటివరకు 1,21,703 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ప్రధానమైన పంట అయిన కంది జిల్లాలో సాధారణ విస్తీర్ణం 90,173 హెక్టార్లు కాగా ఇప్పటివరకు 52,999 హెక్టార్లలో మాత్రమే సాగుకాగా.. 33,037 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉన్న పత్తి పంట 19,250 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 

పెరిగిన మిర్చి విస్తీర్ణం 
గతానికి భిన్నంగా ఈ ఏడాది మిర్చి విస్తీర్ణం పెరిగింది. ఈ సీజన్‌లో మిర్చి 27,152హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా మూడొంతులు ఈనెలలో వేస్తారు. అలాంటిది ఇప్పటికే 19,561 హెక్టార్లలో సాగు చేశారు. ఇక తొలకరి పైర్ల సాగు ఈ ఏడాది సరిగా జరగలేదు. సీజన్‌ ప్రారంభంలో వర్షాలు సరిలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌ సీజన్‌ నాలుగు మాసాలలో చూస్తే జూన్‌లో 58.0 మి.మీ, జూలైలో 89.70, ఆగస్టులో 107.0, సెప్టెంబరులో 133.40మి.మీ వర్షం కురవాలి. అలాంటిది జూన్‌లో 42.30 మి.మీ మాత్రమే కురవగా జూలైలో 130.70, ఆగస్టులో 107.20 సెప్టెంబరులో ఇప్పటివరకు 32.1మి.మీ పడింది. అయితే మొత్తంగా సాధారణ వర్షపాతం కనిపిస్తున్నా.. అది  కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఆది కూడా అదునులో కురవకపోవడంతో పంటల సాగు ముందుకు సాగలేదు. తొలకరి పైర్లు వేసే జూన్‌లో సరైన వర్షం లేదు. దీంతో ఆ సమయంలో వేయాల్సిన సజ్జ, నువ్వు, పెసర వంటి వాటిని రైతులు సాగు చేయలేకపోయారు. ఇక జూలైలో అధిక వర్షపాతం కనిపిస్తున్నా అది రెండోపక్షంలో కురవడంతో ప్రధానమెట్ట పంటలైన కంది, పత్తి వంటి పంటలు సరిగా సాగు చేయలేకపోయారు. కనీసం ఆగస్టులో అయినా వేసేందుకు వీలుగా చాలాప్రాంతాల్లో జూలైలో కురిసిన వర్షాల ఆధారంగా భూములను దున్ని సాగుకు సిద్ధం చేయగా తిరిగి ఆగస్టులోనూ మూడోవారం వరకూ వర్షాభావమే నెలకొంది. దీంతో కీలకమైన కంది, పత్తి సాగు విస్తీర్ణం తగ్గిపోగా కొన్ని ప్రాంతాల రైతులు మిర్చి సాగు చేపట్టడంతో ఆ పంట విస్తీర్ణం కొంత మేర పెరిగినట్లు కనిపిస్తోంది. 

పశ్చిమాన వర్షాభావం
ఈ సమయంలో ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతూ ఉండాలి. అయితే గత నెల ఆఖరి వారంలోనూ, అలాగే ఈ వారంలోనూ తూర్పున ముసురు పట్టి వర్షాలు కురవడంతో ఏ పంట సాగుకూ వీలు కావడం లేదు. మరోవైపు జిల్లా ఉత్తర, తూర్పు ప్రాంతంలో మంచి వర్షాలు, దక్షిణాన ఒక మోస్తరుగా కురిసినా పశ్చిమ ప్రాంతంలో అంతగా లేవు. సాధారణంగా కంది, ఇతర పలు మెట్ట పంటలు ఆ ప్రాంతంలో అధికంగా సాగు చేస్తారు. అలాంటిది వర్షాభావంతో సాగు అంతగా ముందుకు సాగలేదు. మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాలతోపాటు కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో పర్చూరు,. మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో పత్తి కన్నా ఈసారి మిర్చి వైపు రైతులు చూస్తున్నారు. అస్తవ్యస్త వాతావరణంతో సాగు ముందుకు సాగకపోగా ఈనెలాఖరుతో ఖరీఫ్‌ సీజన్‌ ముగియనుంది. ఇప్పటికే పత్తి, కంది వంటి పంటలు సాగుకు సమయం మించిపోగా కొన్నిచోట్ల తొలకరిలో వేసిన పైర్లు కోతలకు కూడా వచ్చాయి. ఇక వరి, మిర్చి, మినుముకు మాత్రమే సీజన్‌లో సాగుకు సమయం ఉండగా, సాగర్‌ ఆయకట్టులో ఆరుతడికే నీరు అని ప్రభుత్వం ప్రకటించడంతో వరిసాగు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఏడాది ఖరీఫ్‌ సాగు మందగించగా సీజన్‌ ముగిసే నాటికి సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు.


Updated Date - 2021-09-12T06:20:48+05:30 IST