30 వరకు ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2021-04-11T06:43:41+05:30 IST

జిల్లాలో కుప్పల్లో ఉన్న 2020-21 ఖరీఫ్‌ ధాన్యాన్ని ఈ నెల 30 వరకు కొనుగోలు చేస్తామని జేసీ కె.మాధవీలత పేర్కొన్నారు.

30 వరకు ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు

 జేసీ కె.మాధవీలత

విజయవాడ సిటీ, ఏప్రిల్‌ 10: జిల్లాలో కుప్పల్లో ఉన్న 2020-21 ఖరీఫ్‌  ధాన్యాన్ని ఈ నెల 30 వరకు కొనుగోలు చేస్తామని జేసీ కె.మాధవీలత పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నిర్వహించిన డయల్‌ యువర్‌ జేసీ కార్యక్రమంలో ఆమె రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులను పలువురు రైతులు జేసీకి తెలిపారు. ఇంతవరకు 7,90,302 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 9,269 మెట్రిక్‌ టన్నుల తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సేకరించామన్నారు. రూ.1464.75 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. రబీ 2020- 21 పంట కాలంలో ధాన్యం సేకరణకు త్వరలో 497 రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలోని రైతులందరూ వెంటనే తమ సమీపంలోని రైతుభరోసా కేంద్రాల్లో భూమి వివరాలు, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు, సెల్‌ఫోన్‌ నంబర్‌ తప్పనిసరిగా నమోదు చేయించు కోవాలన్నారు. రైతుభరోసా కేంద్రాల్లో ఇప్పటికే రైతుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందన్నారు.  ఉంగుటూరుకు చెందిన మేకా కృష్ణకుమారి తనకు ధాన్యం నగదు జమ కాలేదని జేసీకి చెప్పారు. ఈ నెల 3వ తేదీన రూ.1,06,483 మీ ఖాతాలో జమ అయిందని ఆమెకు జేసీ తెలిపారు. పెడనకు చెందిన రామకృష్ణ, పెదపారుపూడికి చెందిన జి.వీరనాగ బాబూరావు, గూడూరుకు చెందిన మోహబూబ్‌ఖాన్‌ తమ వద్ద ఉన్న తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని  కొనుగోలు చేయాలని కోరారు. స్పందించిన జేసీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు. 

Updated Date - 2021-04-11T06:43:41+05:30 IST