కియ..క్రెడిట్‌ వారిదేనట!

ABN , First Publish Date - 2021-06-10T08:08:31+05:30 IST

అనంతపురం జిల్లాలో ప్రారంభమైన కార్ల తయారీ కంపెనీ కియ ఎలా వచ్చింది...ఎప్పుడొచ్చింది...ఒప్పందం ఎప్పుడు జరిగింది... నిర్మాణం ఏ ప్రభుత్వంలో పూర్తయింది..

కియ..క్రెడిట్‌ వారిదేనట!

పెట్టుబడులపై పెద్ద కోతలు

హీరో, అశోక్‌లేలాండ్‌ కూడా వైసీపీయే తెచ్చిందట

రెండేళ్లపాలన ఘనతల్లో కలిపేసి మంత్రి ప్రకటన

64 కంపెనీలు, 30 వేల కోట్ల పెట్టుబడులు!

మెగా కంపెనీలపై నివేదికలో ‘భారీ’గా అబద్ధాలు 

ఈ పెట్టుబడిలో సగంమేర కియ, హీరో, అశోక్‌లదే

టీడీపీ ప్రభుత్వం హయాంలోనే కియకారు లాంచ్‌

అదే ‘కారు’కు రాగానే వైసీపీ మరోసారి లాంఛనం

గత సర్కారులోనే హీరో, అశోక్‌లో మేజర్‌ పనులు 

మిగతా పరిశ్రమల్లోనూ అత్యధికం ఇదే స్థితి


పుట్టిన నెలరోజులకే పాపాయి పరుగులు పెట్టిందట! నమ్మాలి మరి! కావాలంటే వైసీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు పరుగులు పెట్టిన తీరు చూడండి! ఒక పరిశ్రమకు భూమిపూజ జరిగి నిర్మాణం పూర్తయి, ఉత్పత్తి ప్రారంభం కావాలంటే ఎంత లేదన్నా, రెండు నుంచి మూడేళ్ల కాలం పడుతుంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే రెండేళ్లు. కానీ, 2019 మేనెల చివర్లో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, జూన్‌ నెల చివరికి కొన్ని, జూలై ఆఖరికి మరికొన్ని కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించినట్టు బుధవారం ‘కొత్త పెట్టుబడులు- కంపెనీలు- ఉద్యోగాల’పై విడుదల చేసిన జాబితాలో చెప్పుకొచ్చారు. వీటిలో భారీ, మెగా కంపెనీలు కూడా ఉండటం కొసమెరుపు!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అనంతపురం జిల్లాలో ప్రారంభమైన  కార్ల తయారీ కంపెనీ కియ ఎలా వచ్చింది...ఎప్పుడొచ్చింది...ఒప్పందం ఎప్పుడు జరిగింది... నిర్మాణం ఏ ప్రభుత్వంలో పూర్తయింది... అనే వివరాలు రాష్ట్రంలో చిన్నపిల్లాడికి కూడా తెలుసు. కానీ, కియను తెచ్చిన క్రెడిట్‌ను వైసీపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకొంది. హీరో, అశోక్‌ లేలాండ్‌ వంటి దిగ్గజ కంపెనీలూ తన హయాంలోనే ఉత్పత్తి ప్రారంభించాయంటూ రెండేళ్లపాలన ఘనతల్లో కలిపేసి ప్రచారంలో కూడా పెట్టేసింది. ఈ రెండేళ్లలో రూ. 30 వేలకోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కేవలం కియ, హీరో, అశోక్‌లేలాండ్‌ ద్వారానే ఇందులో సగం పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అయితే, ఇవన్నీ గత ప్రభుత్వంలోనే తమ పెట్టుబడులతో అడుగుపెట్టడం గమనార్హం! గత ప్రభుత్వంలోనే కియ తన తొలికారును విడుదల చేసింది కూడా. హీరో, అశోక్‌లేలాండ్‌కు సంబంధించిన మేజర్‌ పనులూ చంద్రబాబు పాలనలోనే పూర్తయ్యాయి. వాస్తవం ఇది కాగా, ఇవిగో ఈ రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభించిన 64భారీ, మెగా కంపెనీలు...తద్వారా వచ్చిన సుమారు రూ.30వేల కోట్ల పెట్టుబడులంటూ బుధవారం మంత్రి మేకపాటి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన చూస్తే, ప్రజల జ్ఞాపకశక్తితో ప్రభుత్వం ఆటలాడుతున్నదా అనే అనుమానం కలగక మానదు. 


వచ్చిన నెలకే ఎన్నెన్నో తెచ్చారట!

వాస్తవానికి ఒక పరిశ్రమకు భూమిపూజ జరిగి నిర్మాణం పూర్తయి, ఉత్పత్తి ప్రారంభం కావాలంటే రెండు నుంచి మూడేళ్ల కాలం పడుతుంది. భారీ, మెగా పరిశ్రమలకు ఈ మాత్రం సమయం కచ్చితంగా పడుతుంది. కానీ రెండేళ్లలోనే ఎన్నెన్నో పరిశ్రమలు గ్రౌండ్‌ అయిపోయాయని చెప్పుకుంటోంది. మరీ చిత్రం ఏంటంటే...ఈ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో పలు పరిశ్రమలు 2019 జూన్‌, జూలై, ఆ తదుపరి నెలల్లోనే కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఉంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో రూ.10కోట్లతో వాల్‌మెట్‌ అనే ఇంజనీరింగ్‌ కంపెనీ జూన్‌ 2019లో తన కార్యకలాపాలు ప్రారంభించిందని, కృష్ణా జిల్లాలో రూ.86కోట్లతో మాడ్యులో సిరామిక్స్‌ కంపెనీ, అనంతపురంజిల్లాలో యునైటెడ్‌ ఇండస్ర్టీస్‌ ఆటోమోటివ్‌ ప్లాస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలు కూడా అదే నెలలో గ్రౌండ్‌ అయ్యాయని పేర్కొంది. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే ఈ కంపెనీలు ఒప్పందాలు చేసుకుని, ఒక నెలలోనే భూ కేటాయింపు, నిర్మాణం పూర్తిచేసుకుని కార్యకలాపాలు ప్రారంభించాయా? అన్న అనుమానం వస్తుంది. కియ కార్ల పరిశ్రమతో పాటు పలు ఆటో మొబైల్‌ విడిభాగాల కంపెనీలు, ఆటోమొబైల్‌ కంపెనీలు జూలై 2019లోనే కార్యకలాపాలు ప్రారంభించాయని పేర్కొన్నారు.


అందులో రూ.847కోట్ల పెట్టుబడితో ఉన్న హ్యుందయ్‌ ట్రాన్సిస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, రూ.463కోట్ల పెట్టుబడితో ఉన్న కేఎ్‌సహెచ్‌ ఆటోమోటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రూ.372కోట్లు పెట్టుబడి పెట్టిన సియోన్‌ ఇ-హ్వ ఆటోమోటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌...ఇలా రూ.200 కోట్లు నుంచి రూ.500ల కోట్లు పెట్టుబడి పెట్టిన అరడజను కంపెనీలున్నాయి. ఇవి కియతోపాటు ప్రారంభమైన కంపెనీలే. 2019 జూలైలో ఈ కంపెనీలన్నీ కార్యకలాపాలు ప్రారంభించాయని...తమ రెండేళ్ల కాలంలో వచ్చిన పెట్టుబడుల్లో ఇవి కూడా లెక్కేనని జమ వేసేసుకున్నారు. 


అసలు తెచ్చిందెంత?

కియ పరిశ్రమ రూ.13,500కోట్లు, కియ అనుబంధ పరిశ్రమలు సుమారు రూ.5వేల కోట్ల పెట్టుబడి, అశోక్‌లేలాండ్‌ కంపెనీ వెయ్యికోట్ల పెట్టుబడులు కలిపితే సుమారు రూ.19,500కోట్ల పెట్టుబడులయ్యాయి. ఇంతేకాక చిత్తూరు జిల్లాలో వచ్చిన హీరో మోటార్‌కార్ప్‌ రూ.1,600కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇదీ గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం జరిగి, పనులు ప్రారంభమై ఒక స్థాయికి చేరుకున్న కంపెనీయే. అంటే అక్కడికి రూ.21వేల కోట్ల పెట్టుబడులు. రూ.30వేల కోట్ల పెట్టుబడుల్లో ఈ రూ.21వేల కోట్లు గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే అని తెలుస్తోంది. మిగతా సుమారు రూ.9వేల కోట్లలోనూ పలు కంపెనీలు గతంలో ప్రారంభమై ఇప్పుడు పూర్తయినవి ఉన్నాయి. కొన్ని మాత్రం కొత్తగా ఒప్పందాలు జరిగి కార్యకలాపాలు ప్రారంభించనివి ఉండొచ్చని అంటున్నారు.


అందుకే అసలు ఆ 64 కంపెనీల జాబితా, వాటి ఒప్పందాలు జరిగిన తేదీలు, అవి పనులు ప్రారంభించిన తేదీలను కూడా ప్రకటిస్తే ఏది ఎప్పుడొచ్చింది, ఎవరి ఘనత ఎంత అనేది తేలిపోతుందని అంటున్నారు. ఈ ప్రభుత్వం కొత్తగా పెట్టుబడులు ఆకర్షించి ఒప్పందాలు చేసుకుని పరిశ్రమలను ప్రారంభింపచేస్తే రాష్ట్రానికి మంచిదేనని, అలా చేసినవాటిని చెప్పుకోకుండా గత కాలపు ఒప్పందాలను తమ ఖాతాలో వేసుకోవడం ఎంతవరకు సరైందని ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా కొప్పర్తి ఎలకా్ట్రనిక్స్‌ పార్కును ఇటీవల కాలంలోనే అభివృద్ధి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద, కేంద్రసాయంతో ఆ సెజ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఒకవేళ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాక...కొత్త కంపెనీలు ఆకర్షించి తీసుకొస్తే తమ ఘనతకింద చెప్పుకోవచ్చని, అంతే తప్ప పాత ఒప్పందాలు...కొత్త ప్రకటనలు సరికాదని అంటున్నారు. 


ఒక కారు.. రెండుసార్లు విడుదల

కియ పరిశ్రమ భూమిపూజకు, మోడల్‌ కారు లాంచింగ్‌కు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక...ఆయన కూడా ఆ పరిశ్రమను సందర్శించి కారును లాంచ్‌ చేశారంతే. కృష్ణా జిల్లాలో అశోక్‌లేలాండ్‌ పరిశ్రమ కూడా గత ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. కియ.. హీరో.. అశోక్‌ లేలాండ్‌ కథను అలా ఉంచితే.. రాష్ట్రానికి వచ్చాయని చెప్పుకొంటున్న మిగతా సగం పెట్టుబడుల్లో కూడా అత్యఽధికం గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు జరిగి, భూకేటాయింపు పొంది, పనులు ప్రారంభించినవే. ఈ ప్రభుత్వం కొత్తగా ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ప్రారంభమైన కొప్పర్తి ఎలకా్ట్రనిక్స్‌ పార్కు (కడప జిల్లా) వంటి కంపెనీలను వేళ్లమీదే లెక్కించవచ్చు. కానీ ఆ విషయాన్ని చెప్పకుండా తమ హయాంలోనే 64 భారీ, మెగా పరిశ్రమలు...రూ.30వేల కోట్ల మేర పెట్టుబడులు...48వేల మందికి ఉద్యోగాలు లభించాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అందులో తమ ఘనత ఎంత? గత ప్రభుత్వ ఘనత ఎంత? అన్నది మాత్రం చెప్పడం లేదు. వాటిని పరిశీలిస్తే కియ, అశోక్‌లేలాండ్‌ కంపెనీలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి.


అంటే గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగి, భూ కేటాయింపు జరిగి పనులు అత్యధిక శాతం పూర్తిచేసుకున్నవి, కార్యకలాపాలు ప్రారంభించిన వాటిని,  లేకుంటే అప్పటి కృషి వల్ల పరిశ్రమలు ఇప్పుడు పూర్తయి ప్రారంభమైనవాటినీ తమ ఘనతగానే చెప్పుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. తమ హయాంలో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీలు..పెట్టుబడులు...వచ్చిన ఉద్యోగాలు ఇవే అని చెప్తున్న ప్రభుత్వం... వాటికి మూలం ఎక్కడ పడింది? ఒప్పందాలు ఎప్పుడు జరిగాయి? ఎవరి హయాంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయన్నది మాత్రం చెప్పలేదు. 

Updated Date - 2021-06-10T08:08:31+05:30 IST