మద్యం దుకాణాలకు దరఖాస్తుల కిక్‌

ABN , First Publish Date - 2021-11-19T06:45:12+05:30 IST

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి.

మద్యం దుకాణాలకు దరఖాస్తుల కిక్‌
భువనగిరిలో దరఖాస్తు చేసుకుంటున్న వ్యాపారులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,481 దరఖాస్తులు

 రూ.169.62కోట్ల ఆదాయం

 గతంతో పోల్చితే పెరిగిన రూ.27.82కోట్ల ఆదాయం

యాదాద్రి జిల్లాలో తగ్గిన దరఖాస్తుల సంఖ్య

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 336 దుకాణాలకు ఈ నెల 9నుంచి గురువారం సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించగా, 8,481 వచ్చాయి. దీంతో రూ.169.62కోట్ల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే కేవలం దరఖాస్తుల ద్వారా రూ.27.82కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. దుకాణాల సంఖ్య పెరగడంతో లాభాల్లో వాటా తగ్గుతుందని, మద్యం వ్యాపారులు పకడ్బందీగా ప్రచారం చేసినా ఫలితం లేకుండాపోయింది. 

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)


ఉమ్మడి జిల్లాలో గతంతో పోలిస్తే అధిక సంఖ్యలో దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం పెరిగింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 155 మద్యం దుకాణాలకు 4079 దరఖాస్తులు రాగా, రూ.81.58కోట్ల ఆదాయం లభించింది. గతంలో 134 దుకాణాలకు 3,039 దరఖాస్తులు రాగా, రూ.60.78కోట్లు సమకూరాయి. ఈ మారు అదనంగా రూ.20.80కోట్లు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 99 దుకాణాలకు 3023 దరఖాస్తులు రాగా, రూ.60.46కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో 75 దుకాణాలకు 2,440 దరఖాస్తులు రాగా, రూ.48.80కోట్లు వచ్చాయి. ఈసారి అదనంగా రూ.11.66కోట్లు వచ్చాయి. యాదాద్రి జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దుకాణాల సంఖ్య పెరిగినా గతంకంటే దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 82 దుకాణాలకు 1,379 దరఖాస్తులు రాగా, రూ.27.58కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో 67 దుకాణాలకు 1,575 దరఖాస్తులు రాగా, రూ.31.50కోట్లు సమకూరాయి. అంటే దుకాణాలు పెరిగినా రూ.3.92కోట్ల ఆదాయం తగ్గింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 336 దుకాణాలకు 8,481 దరఖాస్తులు రాగా, రూ.169.62కోట్లు సమకూరాయి. గతంలో 276 దుకాణాలకు 7,054 దరఖాస్తులు రాగా, రూ.141.80కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో అదనంగా రూ.27.82కోట్ల ఆదాయం లభించింది.


తగ్గిన దరఖాస్తులు

ఈసారి జిల్లాలో అదనంగా మద్యం దుకాణాలను పెంచడంతోపాటు వ్యాపారులకు పలు సౌకర్యాలు కల్పించినప్పటికీ, గతంతో పోలిస్తే తక్కువగా దరఖాస్తులు అందాయి. ఈసారి దుకాణాల లైసెన్సుల జారీలో పలు నిబంధనలు ప్రభుత్వం సడలించింది. గతంలో ఒక్కొక్కరికి ఒక్కటే దరఖాస్తు, ఒకే షాపునకు లైసెన్స్‌ ఇచ్చేవారు. ఈసారి ప్రభుత్వం ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా, ఎన్ని షాపులైనా తీసుకునే అవకాశం కల్పించింది. అయినప్పటికీ మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. జిల్లాలో మొత్తం 82షాపులకు 2021-23 సంవత్సరానికి సంబంధించిన లైసెన్స్‌కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జిల్లా యంత్రాంగం జారీచేసింది. 1379 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షలు, తద్వారా ప్రభుత్వానికి రూ.27,85,00,000 ఆదాయం సమకూరింది. ఈ నెల 9నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆదివారం మినహాయించి అన్ని రోజుల్లోనూ దరఖాస్తులను స్వీకరించారు. గురువారం ఒక్కరోజే 686 దరఖాస్తులు అందాయి. రాత్రి వరకు వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో గతంలో 67 దుకాణాలకు గానూ మొత్తం 1575 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.31.50కోట్లు ఆదాయం సమకూరింది. ఈ సారి జిల్లాలో 13 మద్యం దుకణాలు పెరగడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్‌శాఖ అంచనా వేసింది. అయితే గతం కంటే కూడా 4,73,00,000 ఆదాయం తగ్గింది. జిల్లాలో సంవత్సరానికి రూ.50లక్షల స్లాబ్‌గల దుకాణాలు 20 ఉండగా, రూ.55లక్షల స్లాబ్‌ 46 దుకాణాలు, రూ.60లక్షల స్లాబ్‌ 16దుకాణాలు ఉన్నాయి. నూతన మద్యం పాలసీలో భాగంగా దుకాణాల కేటాయింపుపై ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేసింది. జిల్లాలో ఎస్సీలకు 7దుకాణాలను రిజర్వేషన్లకు కేటాయించింది. వీరిలో ఎస్టీలకు ఒకటి, గౌడ కులస్తులకు 21 దుకాణాలను కేటాయించింది. మిగతా 53 షాపులకు అన్నికులాల వారు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని భువనగిరి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో మొత్తం 424 దరఖాస్తులు రాగా, ఆలేరులో 326, రామన్నపేటలో 361, మోత్కురులో 268 దరఖాస్తులు వచ్చాయి. తక్కువగా వచ్చిన దుకాణాల్లో వంగపల్లి, ముత్తిరెడ్డిగూడెంలో తొమ్మిది చొప్పున దరఖాస్తులు అందాయి. ఎల్లంబావి దుకాణానికి అత్యధికంగా 48 దరఖాస్తులు వచ్చాయి. ఎస్టీలకు రిజర్వుడు చేసిన ఒక దుకాణానికి 15 దరఖాస్తులు, ఎస్సీ దుకాణికి 112, గౌడకులస్థులకు రిజర్వ్‌ చేసిన దుకాణాలకు 322, ఓపెన్‌ 930 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులు జిల్లా ఎక్సైజ్‌ శాఖ పేరుమీద రూ.2లక్షలు డీడీ రూపంలో చెల్లించారు. 


సూర్యాపేట జిల్లాలో.. 

 సూర్యాపేట జిల్లా మొత్తం 99 మద్యం దుకాణాలు ఉండగా, బీసీ(గౌడ)లకు 27, ఎస్సీలకు 10, ఎస్టీలకు మూడు దుకాణాలు కేటాయించారు. మిగిలిన 59 దుకాణాలను జనరల్‌ కేటగిరిలో కేటాయించారు. సూర్యాపేట ఎక్సైజ్‌స్టేషన్‌ పరిధిలో మొత్తం 30దుకాణాలు ఉండగా 793, కోదాడ ఎక్సైజ్‌స్టేషన్‌ పరిధిలో 24దుకాణాలు ఉండగా 888 దరఖాస్తులు, హుజూర్‌నగర్‌ ఎక్సైజ్‌స్టేషన్‌ పరిధిలో మొత్తం 28 దుకాణాలు ఉండగా 969 దరఖాస్తులు, తుంగతుర్తి ఎక్సైజ్‌స్టేషన్‌ పరిధిలో 17దుకాణాలు ఉండగా 373 దరఖాస్తులు వచ్చాయి. ఈ దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో నల్లబండగూడెంలో గల దుకాణం నెంబరు 60కి అత్యధికంగా 83 దరఖాస్తులు వచ్చాయి. అక్కడ గతంలో ఒక్క దుకాణం ఉండగా అప్పుడు 116 దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి ప్రభుత్వం అక్కడ అదనంగా రెండు దుకాణాలు పెంచింది. అయినా ఒక దుకాణానికి మాత్రమే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని మద్యం దుకాణాలకు 15 దరఖాస్తుల కంటే తక్కువగా ఎక్కడ కూడా దరఖాస్తులు రాలేదు. జిల్లాలో ఎస్టీలకు మూడు దుకాణాలు కేటాయించగా నాగారంలో 23, చిలుకూరులో 41, హుజూర్‌నగర్‌ పట్టణంలో 26 దరఖాస్తులు కలిపి మొత్తం 90 ధరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజు రూపంలో ప్రభుత్వానికి రూ.60.46 కోట్ల ఆదాయం సమకూరింది. 2017లో సూర్యాపేట జిల్లాలో 71 మద్యం దుకాణాలకు 3043 ధరఖాస్తులు రాగా, 2019లో జిల్లాలోని 75 మద్యం దుకాణాలకు 2300 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి మాత్రం 99 దుకాణాలకు 3023 దరఖాస్తులు వచ్చాయి.  

Updated Date - 2021-11-19T06:45:12+05:30 IST