మామపై కక్షతో బావమరిది కిడ్నాప్‌.. ఆరుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2021-02-19T17:28:02+05:30 IST

భార్యను కాపురానికి పంపని మామగారిపై

మామపై కక్షతో బావమరిది కిడ్నాప్‌.. ఆరుగురి అరెస్ట్

చెన్నై : భార్యను కాపురానికి పంపని మామగారిపై కక్ష తీర్చుకునేందుకు బావమరిదిని కిరాయి గూండాలతో కిడ్నాప్‌ చేసిన అల్లుడు, మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్‌ కేసును ఐదు గంటలలోపే ఛేదించి ఐదుగురిని అరెస్టు చేసి రెడ్‌హిల్స్‌ పోలీసులు ప్రశంసలందుకున్నారు. రెడ్‌హిల్స్‌ సమీపం బాలాజీ గార్డెన్‌లో నివసిస్తున్న మారియప్పన్‌కు గణేష్‌ (17), జనని అనే కుమార్తె ఉన్నారు. రెండు నెలలకు  ముందు పుదుకోటకు చెందిన భూపతి అనే యువకుడితో జననికి వివాహం జరిగింది. గణేష్‌ ఎంఏ నగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో ప్లస్‌-2 చదువుతున్నాడు. జననికి అత్తింటి వారితో మనస్పర్థలు ఏర్పడి ఇటీవల పుట్టింటికి తిరిగి వచ్చింది.


ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఐదుగంటలకు గణేష్‌ పాఠశాలలో తరగతిలో చదువుకుంటున్న సమయంలో కారులో వచ్చిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని బలవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఆ కారును వెంబడించి దుండగులను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఐదుగురు కిడ్నాపర్లలో ఒకడిని విద్యార్థులంతా కలిసి బయటకు లాగిపడేశారు. ఆ తర్వాత కారు మెరుపువేగంతో మాయమైంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న రెడ్‌హిల్స్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కారులో నుంచి నేలపై పడిన వ్యక్తి వద్ద విచారణ జరిపారు.


ఆ వ్యక్తి పుదుకోటకు చెందిన సంతోష్‌కుమార్‌ అని గుర్తించారు. అతడి వద్ద విచారణ జరిపినప్పుడు అసలు విషయం బయటపడింది. తన భార్య జననిని కాపురానికి పంపని మామపై కక్ష తీర్చుకునేందుకు గణేష్‌ తన అనుచరులతో కలిసి గణేష్‌ను కిడ్నాప్‌ చేశాడని తెలుసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి చెన్నై నగరమంతటా వాహనాల తనిఖీ చేపట్టారు. రాత్రి పది గంటలకు అచ్చిరపాక్కం టోల్‌గేట్‌ వద్ద గణేష్‌ను తీసుకెళుతున్న కారును గమనించి చుట్టుముట్టారు. పోలీసులను చూడగానే దుండగులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆలోపున పోలీసులు అందరిని అదుపులోకి తీసుకుని గణేష్‌కు విముక్తి కలిగించారు. కిడ్నాప్‌కు పాల్పడిన జనని భర్త భూపతి, అతడి అనుచరులు మణికంఠన్‌, శీనివాసన్‌, ఆదిత్యా, నటరాజ్‌, శక్తివేల్‌ను అరెస్టు చేశారు. కిడ్నాప్‌ సంఘటన జరిగిన ఐదు గంటలలోపూ కిడ్నాపర్లను అరెస్టు చేసిన పోలీసులకు నగర పోలీసు కమిషనర్‌ మహేష్‌కుమార్‌ అగర్వాల్‌ ప్రశంసించారు.


Updated Date - 2021-02-19T17:28:02+05:30 IST