Abn logo
May 11 2021 @ 11:34AM

రియల్‌ వివాదంలో వ్యక్తి కిడ్నాప్‌, బెదిరింపులు

  • శివారులో వదిలేసిన నిందితులు


హైదరాబాద్/బంజారాహిల్స్‌ : రియల్‌ వివాదంలో ఓ వ్యక్తిని కొంత మంది కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం శివారుప్రాంతాల్లో వదిలేసి పారిపోయారు. నగరానికి చెందిన పుట్టపాక శ్రీనివాస్‌ వ్యాపారి. శంకర్‌పల్లి మండలంలోని కొండకల్‌ గ్రామంలో 2020లో ఆయన 2.33 ఎకరాల భూమిని బుచ్చిరెడ్డి వద్ద కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఇదే భూమిని వైట్ల రమణమూర్తి, వెన్న సత్యనారాయణ మరికొంత మందికి రూ.3కోట్లకు అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నాడు. రమణమూర్తి, సత్యనారాయణ సకాలంలో డబ్బు చెల్లించలేదు. దీంతో బుచ్చిరెడ్డి భూమిని మరొకరికి అమ్మేశాడు. 


రమణమూర్తి, సత్యనారాయణ తాము ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనికి శ్రీనివాస్‌ ఒప్పుకోలేదు. ఈ నెల 6న శ్రీనివాస్‌ జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లోని చట్నీస్‌ వద్ద ఉండగా రమణమూర్తి, సత్యనారాయణ మరికొంత మంది కారులో వచ్చి బలవంతంగా ఎక్కించుకున్నారు. దారిలో భూమి కొనుగోలులో మధ్యవర్తిత్వం చేసిన భగవాన్‌ నాయక్‌ను ఎక్కించుకున్నారు. ఎక్కువ డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. వారి వద్ద సెల్‌ ఫోన్‌లు లాక్కొని మోకిళ్ల వద్ద వదిలేసి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్మరిన్ని...