కరెంటు బిల్లు గొడవ.. ఓనర్ హత్య చేసిన కిరాయి హంతకులు.. నిందితుడిగా ఇన్‌కం ట్యాక్స్ అధికారి

ABN , First Publish Date - 2021-11-21T15:53:08+05:30 IST

సమయానికి కరెంటు బిల్లు ఎందుకు కట్టడంలేదని అడిగిన యజమానితో అద్దెదారులు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెద్దదై యజమాని హత్య జరిగింది. తీగ లాగితే డొంక కదిలిందన్నట్టు హత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులకు డబ్బుల కోసం కిడ్నాప్, హత్య చేసే పెద్ద గ్యాంగ్ గురించి తెలిసింది. అంతేకాదు ఆ గ్యాంగ్‌ మాస్టర్ మైండ్ ఒక ఇన్‌కం ట్యాక్స్ అధికారి అని తేలింది...

కరెంటు బిల్లు గొడవ.. ఓనర్ హత్య చేసిన కిరాయి హంతకులు.. నిందితుడిగా ఇన్‌కం ట్యాక్స్ అధికారి

సమయానికి కరెంటు బిల్లు ఎందుకు కట్టడంలేదని అడిగిన యజమానితో అద్దెదారులు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెద్దదై యజమాని హత్య జరిగింది. తీగ లాగితే డొంక కదిలిందన్నట్టు హత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులకు డబ్బుల కోసం కిడ్నాప్, హత్య చేసే పెద్ద గ్యాంగ్ గురించి తెలిసింది. అంతేకాదు ఆ గ్యాంగ్‌ మాస్టర్ మైండ్ ఒక ఇన్‌కం ట్యాక్స్ అధికారి అని తేలింది.


దేశ రాజధాని ఢిల్లీలో నివసించే బడా వ్యాపారి కిషన్‌పాల్‌కు చాలా వ్యాపారాలున్నాయి. ఢిల్లీలో ఆయనకు డాల్ఫిన్ అనే పేరుతో ఒక లాడ్జింగ్ హోటల్ కూడా ఉంది. ఆ హోటల్‌ను ఆయన రోషన్ మిశ్రా అనే వ్యక్తికి లీజు కింద ఇచ్చాడు. రోషన్ మిశ్రా లోలోపల ఒక కిడ్నాపింగ్, హత్యలు చేసే గ్యాంగ్ నడుపుతున్నాడు. సమయానికి లీజు డబ్బులు, కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో హోటల్ యజమాని కిషన్‌పాల్.. రోషన్ మిశ్రాని నిలదీశాడు. వారిద్దరికీ మధ్య వాదనలు జరిగాయి. దీంతో కిషన్‌పాల్ త్వరగా హోటల్ ఖాళీ చేయాలని హెచ్చరించి వెళ్లిపోయాడు. ఇదంగా జరిగేటప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. రోషన్ మిశ్రా దీనిని అవమానంగా భావించాడు. 


కోపంతో బీహార్ గ్యాంగ్‌స్టర్ దిల్‌షాద్‌కు రోషన్ మిశ్ర కిల్లర్ సుపారీ(హత్య చేసేందుకు డబ్బులు) ఇచ్చాడు. అక్టోబర్ 31న వ్యాపారి కిషన్‌పాల్ హత్య జరిగింది. పోలీసులు హత్య కేసుని విచారణ చేయగా.. సీసీటీవీ వీడియోలో కొందరు కిషన్ పాల్‌ని చంపేసి ఒక కారులో పారిపోతుండడం కనపించింది. ఆ కారు నెంబర్‌ గురించి ఆరా తీయగా.. అది ఒక ఇన్‌కం ట్యాక్స్ అధికారి హరేంద్రది అని తేలింది.


పోలీసులు ఇన్‌కం ట్యాక్స్ అధికారి హరేంద్రని అరెస్టు చేసి ప్రశ్నించగా.. ఆ కారు రెండు క్రితమే దొంగలించబడినదిగా అతను చెప్పాడు. దానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని అన్నాడు. విచారణ జరుగుతున్న సమయంలోనే హరేంద్ర చిన్నాన్నను బీహార్‌లో ఎవరో హత్య చేశారని పోలీసులకు తెలిసింది. ఢిల్లీ పోలీసులు బీహార్ పోలీసులతో కలిసి ఈ రెండు హత్య కేసులను ఛేదించారు. బీహార్‌లో జరిగిన హత్య కేసు నిందితులే ఢిల్లీ వ్యాపారి కిషన్ పాల్ హత్య చేశారని తేలింది. నిందితులంతా బీహార్‌లోని సివాన్ నగర సమీపంలోని ఒకే గ్రామానికి చెందిన వారని తెలిసింది.


నిందితులలో గ్యాంగ్‌స్టర్లు గుడ్డూ, అవినాశ్, సుపారీ కిల్లర్ దిల్షాద్ ఉన్నారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేసి తమ పద్ధతిలో విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. నిందుతులంతా వేర్వేరు నగరాలలో కిడ్నాపింగ్, హత్యలు చేసేవారు. ఆ తరువాత ఢిల్లీలో రోషన్ మిశ్రా వద్ద అతని హోటల్‌లో తలదాచుకునేవారు. ఈ విషయం తెలిసిన పోలీసులు.. రోషన్ మిశ్రాని అరెస్టు చేసి ప్రశ్నించారు. 


రోషన్ మిశ్రాతో కలిసి ఇన్‌కం ట్యాక్స్ అధికారి హరేంద్ర ఈ కిడ్నాపింగ్ వ్యాపారం చేసేవాడని విచారణలో తేలింది. దీంతో పోలీసులు హరేంద్రని కూడా అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-11-21T15:53:08+05:30 IST