మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు తినకపోవడమే మంచిది..

ABN , First Publish Date - 2020-06-29T19:03:50+05:30 IST

బీట్‌రూట్‌ను మధుమేహం ఉన్నవారు తినొచ్చా?

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు తినకపోవడమే మంచిది..

ఆంధ్రజ్యోతి(29-06-2020)

ప్రశ్న: బీట్‌రూట్‌ను మధుమేహం ఉన్నవారు తినొచ్చా?


- కీర్తన, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: ఆకర్షణీయంగా ఉండే బీట్‌రూట్‌ను సలాడ్‌లు, జ్యూస్‌లు, సూప్స్‌, కూరలు, చట్నీల్లో వాడుతుంటాం. బీట్‌రూట్‌లో అధిక భాగం నీరే. దీని బరువులో సుమారు తొంభై శాతం నీరే ఉండడం వల్ల క్యాలరీలు తక్కువే. వంద గ్రాముల పచ్చి బీట్‌రూట్‌లో కేవలం నలభై ఐదు క్యాలరీలే. ఇంకా తొమ్మిది గ్రాముల పిండి పదార్థాలు,  మూడు గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. రెండు లేదా మూడు వందల గ్రాములకు మించి బీట్‌ రూట్‌ను ఒకేసారి తీసుకుంటే తప్ప రక్తంలో గ్లూకోజు స్థాయిలు అంతగా పెరగవు. కాబట్టి డయాబెటీస్‌ ఉన్నవారు నిశ్చింతగా పరిమిత మోతాదుల్లో బీట్‌ రూట్‌ను తీసుకోవచ్చు. గర్భిణీలకు ముఖ్యమైన ఫోలేట్‌ కూడా ఇందులో అధికం. ఇంకా పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌ ఉన్నాయి. పచ్చిగా తీసుకున్నప్పుడు విటమిన్‌ - సి కూడా లభిస్తుంది. దీనిలో ఉండే ఇనార్గానిక్‌ నైట్రేట్స్‌ రక్త ప్రసరణ బాగుండడానికి, అధిక రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగపడతాయి. తద్వారా గుండె జబ్బుల నియంత్రణకు బీట్‌ రూట్‌ సహాయపడుతుంది. ఆటలాడేప్పుడు, వ్యాయామం చేసేప్పుడు సామర్థ్యాన్ని పెంచడానికీ ఈ దుంప మంచిది. కొంతమందికి ఇందులోని ఫ్రూక్టాన్స్‌ అనే పదార్థాల వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి. వీళ్లు బీట్‌ రూట్‌ను తినకపోవడమే మేలు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వాళ్ళు ఆ సమస్య పరిష్కారమయ్యేవరకు బీట్‌రూట్‌ను వాడరాదు. అవసరమైతే పోషకాహార నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు) 

Updated Date - 2020-06-29T19:03:50+05:30 IST