ఆ మూడు.. కిడ్నీకి కీడు..

ABN , First Publish Date - 2020-03-12T15:14:22+05:30 IST

ప్రస్తుతం ఆ మూడు (షుగర్‌, హైబీపీ, అధిక బరువు) మనిషిని భయపెడుతున్నాయి. ఎంతలా అంటే.. ఏ మాత్రమూ నిర్లక్ష్యం చేసినా.. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా కిడ్నీకి కీడు చేస్తున్నాయి. మారిన జీవనశైలి, పని ఒత్తిడి, సమయభావం కారణంగా.. శారీరక వ్యాయామం, పౌష్టికాహారం లేక చిన్న వయస్సులోనే

ఆ మూడు.. కిడ్నీకి కీడు..

భయపెడుతున్న షుగర్‌, హైబీపీ, అధిక బరువు 

హైబీపీ కిడ్నీ జబ్బుకు సంకేతం

మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల్లో యువతే అధికం

జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకు ముప్పు

హెచ్చరిస్తున్న వైద్యులు 


హైదరాబాద్‌ సిటీ, మార్చి11 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఆ మూడు (షుగర్‌, హైబీపీ, అధిక బరువు) మనిషిని భయపెడుతున్నాయి. ఎంతలా అంటే.. ఏ మాత్రమూ నిర్లక్ష్యం చేసినా.. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా కిడ్నీకి కీడు చేస్తున్నాయి. మారిన జీవనశైలి, పని ఒత్తిడి, సమయభావం కారణంగా.. శారీరక వ్యాయామం, పౌష్టికాహారం లేక చిన్న వయస్సులోనే మధుమేహం, హైబీపీ, అధిక బరువు లాంటి దీర్ఘకాలిక రోగాలు అటాక్‌ చేస్తున్నాయి. ఈ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యాన్ని ఏమాత్రమూ అశ్రద్ధ చేసినా.. ఈ రోగాల పట్ల అప్రమత్తత లేకపోయినా.. అవి సైలెంట్‌గా కిడ్నీలపైనే దాడి చేస్తున్నాయి. చివరికి ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... వీటి బారిన పడే బాధితుల్లో యువతే ఎక్కువగా ఉంటోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనితోపాటు ఆరోగ్యాన్నీ చూసుకోవాలని, అన్నింటికి మించి కిడ్నీల పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు. నేడు వరల్డ్‌ కిడ్నీ డే సందర్భంగా కిడ్నీ జబ్బులు, వాటి నివారణ, సంరక్షణ తదితర విషయాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం. 


కిడ్నీ వ్యాధులు మనిషిని ఆర్థికంగా, ఆరోగ్యంగా చాలా దెబ్బతీస్తున్నాయి. ఒక్కసారి వచ్చిందంటే.. మరలా కోలుకోలేని స్థితికి తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వారిలో 40 ఏళ్ల లోపు యువతరమే ఎక్కువగా ఉంటోంది. అధిక బరువు ఉన్న వారిలో 20 శాతం మందికి కిడ్నీ సమస్యలు ఉంటున్నాయి. అధిక బరువుతో మధుమేహం, హైబీపీ పెరుగుతుందని, తద్వారా కిడ్నీలు వైఫల్యం చెందడానికి కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైద్యుల వద్దకు వస్తున్న కిడ్నీ బాధితుల్లో షుగర్‌, హైబీపీ, అధిక బరువు ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారు. 


కిడ్నీ పనితీరుపై దృష్టి పెట్టాలి... 

కిడ్నీల జబ్బు మనిషిని ఎప్పుడు చంపేస్తుందో అంతుపట్టని పరిస్థితి నెలకొంది. 100 మందిలో 8 మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి చేయడానికి వీలవుతోందని వైద్యులంటున్నారు. ప్రస్తుతం కిడ్నీలు దొరకడం చాలా కష్టంగా మారిందని, బాధితుల సంఖ్యకు అనుగుణంగా కిడ్నీల దాతలు లేరని, నూటికి 70 నుంచి 80 మంది వరకు కిడ్నీ బాధితులు మృత్యువుతో పోరాడుతున్నారని కిడ్నీ వ్యాధుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల కిడ్నీ పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని ఎవరికి వారు కిడ్నీల సంరక్షణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. రక్త ప్రసరణ, కిడ్నీ ఫంక్షన్‌ స్థాయి తెలుసుకుని దానికి అనుగుణంగా మందులు వాడాలని, జన్యుపరమైన చరిత్ర ఉన్న వారు కూడా తరచూ వైద్య పరీక్షలు చేయించుకుని కిడ్నీలను కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 



జబ్బును గుర్తించలేక...

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 20 శాతం వరకు కిడ్నీ బాధితులు ఉంటారని వైద్యులు పేర్కొంటున్నారు. బాధితుల్లో 40 శాతం మందికి కిడ్నీ జబ్బు ఉన్నట్లు తెలియదని, 75 శాతం మందిలో కిడ్నీ జబ్బు 3వ దశలో ఉందని వైద్యులు వివరించారు. జబ్బు ఉన్నట్లు తెలియకపోవడంతో చాలా మంది చికిత్సకు రావడం లేదు. ఎక్కువ శాతం మంది జబ్బు ముదిరిన తరువాత వైద్యులను సంప్రదించడం వల్ల చికిత్సలు పొందడంలో ఆలస్యమవుతుంది. 


రూ.5 లక్షల నుంచి 10 లక్షల వ్యయం...

కిడ్నీ జబ్బు వచ్చిందంటే కచ్చితంగా డయాలిసిస్‌ చేయాల్సిందే. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నెలలో నాలుగు వరకు కిడ్నీ మార్పిడులు జరుగుతున్నాయి. షుగర్‌ బాధితులు డయాలిసిస్‌ చేయించుకుంటే నెలకు దాదాపు రూ.2 వేలు ఖర్చు అవుతుంది. ఏడాదికి మందులు, డయాలిసిస్‌ కలిపి రూ.30 వేలు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఖరీదైన వైద్యం కావడంతో చాలా మంది డయాలిసిస్‌, కిడ్నీ మార్పిడి చేయించేకోలేకపోతున్నారు. ఒకటి, రెండు సార్లు డయాలసిస్‌ చేయించుకుని మానివేస్తున్నారు. ఇటువంటి వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు తెలిపారు. 


40 శాతం కిడ్నీ రోగులు 40 ఏళ్ల వారే...

ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రకారం.. కిడ్నీ బాధితులు 12.8 శాతం, హైబీపీ 18 శాతం, మధుమేహ బాధితులు 10 శాతం మంది ఉన్నారు. కిడ్నీ బాధితుల్లో బీపీ ఉన్న వారు ఎక్కువగా ఉన్నారు. బీపీ ఉందంటే కిడ్నీకి ముప్పుగా భావించాలి. కిడ్నీ బాధితుల్లో 40 ఏళ్లలోపు వారే 40 శాతం మంది ఉన్నట్లు తేలింది. నిమ్స్‌లో ప్రతి రోజు 250 మంది ఓపీకి కిడ్నీ బాధితులు వస్తుంటారు. బాధితుల కోసం వంద పడకలు ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా 8 వేల నుంచి 10 వేల మంది, ఇతరులు 32 వేల మంది డయాలిసిస్‌ చేయించుకుంటున్నారు. చాలా మందికి కిడ్నీ సమస్య ఎందుకు వచ్చిందో అవగాహన లేకుండా ఉన్నారు. జన్యుపరమైన కారణాలతో కిడ్నీ జబ్బు వచ్చిన వారు 15 శాతం ఉన్నారు. 35 నుంచి 40 శాతం మధుమేహం కారణంగా కిడ్నీ ఫెయిల్‌ అయిన వారు ఉన్నారు. మధుమేహం, బీపీ, అధిక బరువు, గుండె, పక్షవాతం, చర్మసంబంధిత జబ్బులు, కీళ్ల నొప్పులు, ఆల్కాహాల్‌ సమస్యలతో బాధపడే వారిలో ప్రతి నలుగురిలో ఒకరు కిడ్నీ సమస్యతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు. 

- డాక్టర్‌ శ్రీభూషన్‌రాజు, మూత్రపిండాల విభాగం అధిపతి, నిమ్స్‌



ఒక్కసారి వస్తే నయం చేయడం కష్టం...

మధుమేహంతో పాటే మూత్రపిండాల వైఫల్యం కేసులు పెరుగుతున్నాయి. టైప్‌-1 మధుమేహం బాధితుల్లో 10 నుంచి 30 శాతం, టైప్‌-2 మధుమేహుల్లో 40 శాతం మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశముంది. ఒకసారి ఈ మూత్రపిండాల సమస్య మొదలైందంటే దానిని పూర్తిగా నయం చేయడం కష్టం. అందుకే మధుమేహం, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం, హెచ్‌బీఏ1సీ పరీక్ష ఫలితం ఏడు కన్నా తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గత మూడు నెలల సమయంలో మధుమేహం కచ్చితంగా అదుపులో ఉందా, లేదా అనేది చెప్పే పరీక్ష. రక్తపోటును 130-80 కంటే తక్కువే ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి. అలాగే రక్తహీనత తలెత్తకుండా జాగ్రత్త పడాలి. మూత్రంలో సుద్ద పోతుంటే వెంటనే గుర్తించి తక్షణం చికిత్స తీసుకోవాలి.  

- డాక్టర్‌ అశ్విన్‌కుమార్‌ అయ్యంగార్‌, నెఫ్రాలజిస్టు, కేర్‌ ఆస్పత్రి



దీర్ఘకాలిక బాధితులు ఎక్కువ...

దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులుపెరుగుతున్నాయి. మన దేశంలో ప్రతి పది లక్షల మందిలో వెయ్యి మంది క్రానిక్‌ కిడ్నీ జబ్బులతో బాధపడుతుండగా, 150 మంది డయాలసిస్‌, కిడ్నీ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో 40 వేల మంది వివిధ దశల్లో క్రానిక్‌ కిడ్నీ జబ్బులతో బాధపడుతుంటే 10 వేల మంది డయాలసిస్‌, ట్రాన్స్‌ప్లాంటే కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా 30 నుంచి 60 ఏళ్ల లోపు వారే. ఉప్పు తగ్గించడం, 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, యూరిన్‌లో ఇన్‌ఫెక్షన్‌, కిడ్నీలో స్టోన్ప్‌ ఉంటే వైద్యులను సంప్రదించాలి. 

- డాక్టర్‌ శ్రీధర్‌, సీనియర్‌ నెఫ్రాలజిస్టు, గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రి



అప్రమత్తత లేకపోతే అంతే...

ఆరోగ్యవంతమైన జీవన శైలి, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు పొగాకు వినియోగం తగ్గించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కిడ్నీ వ్యాధులను నివారించవచ్చు. జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీ ముప్పు పొంచి ఉంటుంది. బీపీ, మధుమేహ వ్యాధిగ్రస్తులు సక్రమంగా మందులు వేసుకోకపోతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది. బీపీ, మధుమేహ రోగులకు రెండు కిడ్నీలూ చెడిపోయే ప్రమాదముంది.

- డాక్టర్‌ జస్వంత్‌ చల్లా, నెఫ్రాలజిస్టు, మెడికవర్‌ ఆస్పత్రి

Updated Date - 2020-03-12T15:14:22+05:30 IST