కిలేడీ!

ABN , First Publish Date - 2021-04-16T05:40:55+05:30 IST

నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి వారికి దాదాపు రూ.20 లక్షల వరకు ఓ యువతి టోకరా వేసిన సంఘటణ మెదక్‌ జిల్లా చిల్‌పచెడ్‌ మండలం పరిధిలోని గంగారం గ్రామ పంచాయతీలో చోటు చేసుకున్నది.

కిలేడీ!
ఎస్సై మల్లారెడ్డికి ఫిర్యాదు చేస్తన్న బాధితులు

ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు ఎర

రూ.20 లక్షల వరకు టోకరా

బాధితులంతా స్నేహితులు, బంధువులే 



చిల్‌పచెడ్‌, ఏప్రిల్‌ 15 : నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి వారికి దాదాపు రూ.20 లక్షల వరకు ఓ యువతి టోకరా వేసిన సంఘటణ మెదక్‌ జిల్లా చిల్‌పచెడ్‌ మండలం పరిధిలోని గంగారం గ్రామ పంచాయతీలో చోటు చేసుకున్నది. బాధితులు, ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన మల్లేపల్లి శృతి అనే యువతి గ్రామానికి సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కొన్ని సంవత్సరాలు  పనిచేసింది. రెండేళ్ల క్రితం తనకు ప్రభుత్వ శాఖలో ఉద్యోగం వచ్చిందని పాఠశాలలో ఉద్యోగం మానేసింది. తనకు మేడ్చల్‌ జిల్లాలో అంగన్‌వాడీ శాఖలో పీడీగా పోస్టింగ్‌ వచ్చిందని చెప్పి పలువురిని ఆకర్శించింది. అనంతరం కొంత కాలం తర్వాత నిజామాబాద్‌ జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ అయిందని చెప్పింది. రోజు నిజామాబాద్‌కు వెళ్లేది. తనకు తెలిసిన నిరుద్యోగులైన వారికి పలు ప్రభుత్వ శాఖలలో ఖాళీలు ఉన్నాయని తెలియజేసి డబ్బు ఇస్తే ఉద్యోగం వస్తుందని నమ్మ బలికింది. ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారితో తరుచుగా కాంటాక్ట్‌లో  ఉండేది. మొన్నటి దాకా ప్రైవేటు పాఠశాలలో పని చేసిన తను కొత్తగా కారును కొని డ్రైవరును పెట్టుకుని ప్రయాణించడంతో ఆమె హుందాను చూసి నిజమే నని నమ్మి చాలా మంది ఆమె ఉచ్చులో పడిపోయారు. ఇదే ఆసరాగా తీసుకున్న ఆమె వారి నుంచి డబ్బును వసూలు చేసింది. ఇప్పుడు ఎలాంటి నోటిఫికేషన్లు లేవు అని అడిగితే అన్‌ అఫిషియల్‌ కోటా నుంచి భర్తీ చేస్తారని ఆలస్యం చేస్తే అవి ఉండవని తొందర పెట్టింది. బాధితుల్లో కొందరు నేరుగా ఆమె చేతికే డబ్బు ఇవ్వగా మరికొందరు గూగుల్‌ పే, ఫోన్‌ పే ద్వారా పంపించే వారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందని నన్ను నమ్మండని తనకు కూడా ఉద్యోగం అలాగే వచ్చిందని తెలిపింది. ఉద్యోగం రాకుంటే డబ్బు మీకు ఇస్తానని తెలిపింది. నమ్మకం కుదిరేలా బాండు పేపర్‌పై లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చింది. ప్రతి ఒక్కరితో ఈ విషయం ఎవరికి చెప్పవద్దని, లీకైతె మీకే నష్టమని భయ పెట్టింది. దాంతో ఎవరికి చెప్పకుండా ఉద్యోగం వస్తుందనే ఆశతో వారు ఎదురు చూడసాగారు. తన గ్రామస్థులను, బంధువులను, స్నేహితులను, సన్నిహితులను ఎవరని చూడకుండా అందరికీ మాయమాటలను చెప్పి దాదాపు రూ.20 లక్షల వరకు డబ్బు వసూలు చేసింది. మెదక్‌ జిల్లాతో పాటు సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలోనూ ఆమె వసూలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇంకా ఉద్యోగం రాలేదని అడగగా ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునేది. వారికి నమ్మకం కుదిరేలా వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తూ బురిడీ కొట్టించింది. చూసి చూసి విసిగిపోయిన బాధితులు ఇంటికి వెళ్లి విచారించగా మోసపోయామని లబోదిబోమన్నారు. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులను అడగగా  తాము డబ్బు చెల్లిస్తామని గడువు పెట్టారని బాధితులు తెలిపారు. గడువు పూర్తి అయినా చెల్లించకపోవడంతో వారిని నిలదీయగా తమకేం సంబంధమని మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ విషయమై స్థానికులను విచారించగా వాళ్లింటికి చాలా మంది వస్తున్నారని, వచ్చి గొడవకు దిగుతున్నారని పేర్కొన్నారు. దీంతో కొంత మంది బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై మల్లారెడ్డి మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరికొందరు బాధితులకు శనివారం నాడు డబ్బు చెల్లిస్తామని యువతి కుటుంబ సభ్యులు గడువు పెట్టినట్లు తెలుస్తోంది.


అప్పు చేసి మరీ ఇచ్చాం

మా ఊరి ఆమనే కదా తప్పకుండా తమకు ఉపకారం చేస్తదనే నమ్మకంతో మా భార్యకు ఉద్యోగం కోసం రూ.3.70 లక్షల వరకు ఇచ్చా. చాలా రోజులైంది పైసలు తీసుకుని అని అడిగినప్పుడల్లా తప్పకుండా ఉద్యోగం వస్తుంది కంగారు పడొద్దని చెప్పేది. ఇప్పుడు చూస్తే మాలాగే డబ్బు కట్టిన వాళ్లు చాలా మందే ఉన్నారని తెలుస్తోంది. అప్పు చేసి మరీ ఇచ్చాం.  మాకు డబ్బు వచ్చేలా చూడాలని కోరుతున్నాం.  

-ప్రభాకర్‌, బాధితుడు, గంగారం

Updated Date - 2021-04-16T05:40:55+05:30 IST