ముంబై అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం... మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం...

ABN , First Publish Date - 2022-01-22T21:34:11+05:30 IST

నగరంలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో

ముంబై అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం... మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం...

ముంబై : నగరంలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అదేవిధంగా గాయపడినవారికి రూ.50,000 చొప్పున అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున చెల్లిస్తామని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే చెప్పారు. 


ముంబైలోని తార్‌దేవ్ ప్రాంతంలో నానా చౌక్ వద్ద కమల బిల్డింగ్ 18వ అంతస్థులో శనివారం ఉదయం దాదాపు 7.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 28 మంది గాయపడ్డారు. 


మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు. మంత్రులు ఆదిత్య థాకరే, అస్లాం షేక్ దర్యాప్తును పర్యవేక్షిస్తారని తెలిపారు. 


కాంగ్రెస్ నేత బాలా సాహెబ్ థోరట్ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రమాద వార్త తెలిసి తాను చాలా విచారించానని తెలిపారు. 20 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం జరగడం, ఈ సంఘటనలో కొందరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంబంధిత శాఖలన్నీ ప్రమాద స్థలం వద్ద ఉన్నాయని, సహాయక చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. 


ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. 


Updated Date - 2022-01-22T21:34:11+05:30 IST