కరోనా చికిత్సకు కింగ్‌ కోఠి ఆస్పత్రి సిద్ధం

ABN , First Publish Date - 2020-03-29T10:43:44+05:30 IST

కరోనా చికిత్సకు కింగ్‌ కోఠి ప్రభుత్వ ఆస్పత్రి సిద్ధమైంది. ఇప్పటివరకు ఇక్కడ అందించిన వైద్య సేవలను ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ఏర్పాట్లు పూర్తి

కరోనా చికిత్సకు  కింగ్‌ కోఠి ఆస్పత్రి సిద్ధం

300 పడకలతో ఐసోలేషన్‌ వార్డులు

50 పడకలతో ఐసీయూ ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్సకు కింగ్‌ కోఠి ప్రభుత్వ ఆస్పత్రి సిద్ధమైంది. ఇప్పటివరకు ఇక్కడ అందించిన వైద్య సేవలను ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇకనుంచి ఈ ఆస్పత్రిలో కరోనా బాధితులు, అనుమానితులకు మాత్రమే చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో 300 పడకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పూర్తిగా ఐసోలేషన్‌ సదుపాయాలతో సిద్ధం చేశారు. సీరియస్‌ పాజిటివ్‌ కేసులకు చికిత్స అందించడానికి 50 పడకలతో ఐసీయూని ఏర్పాట్లు చేశారు. ఇక్కడి వైద్యులే కాకుండా ఇతర ఆస్పత్రుల నుంచి కూడా ప్రభుత్వ వైద్యులను సేవల కోసం కింగ్‌ కోఠికి పంపించారు. 14 మంది పల్మానాలజిస్టులు, జనరల్‌ మెడిసిన్‌, అనస్థీషియా వైద్యులను కరోనా చికిత్స సేవలకు కేటాయించారు.


ప్రసూతి వార్డు తరలింపు

కింగ్‌ కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్‌ వైద్య సేవలతో పాటు ప్రసూతి సదుపాయం ఉంది. ప్రసూతి సేవలను పూర్తిగా సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. ఇతర వైద్య సేవలను ఉస్మానియాలో అందించే ఏర్పాట్లు చేశారు. 


గాంధీలో పూర్తిస్థాయి సేవలు

గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కరోనా బాధితులకు చికిత్సలు అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో 1160వరకు పడకలున్నాయి. ఈ ఆస్పత్రిలో ఇప్పటికే పూర్తిగా ఓపీని నిలిపివేశారు. కేవలం కరోనా  ఓపీ, ఐపీ సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతమున్న ఇన్‌పేషంట్లను ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఇన్‌పేషంట్లను  ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం చెస్ట్‌ ఆస్పత్రిలో 50 పడకలు ఏర్పాటు చేసి పాజిటివ్‌, అనుమానితులకు చికిత్సలు అందిస్తున్నారు.


సిద్ధమవుతున్న నిమ్స్‌

నిమ్స్‌లోనూ కరోనా సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్పత్రి సమీపంలో ఉన్న ఓ భవనంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మొదటి దశలో పది పడకలు ఏర్పాటు చేసి 40 పడకలకు విస్తరించనున్నారు. మొదటి అంతస్తులో స్ర్కీనింగ్‌, రెండో అంతస్తులో ఐసీయూ, సమీపంలో మరో గదిని పర్యవేక్షణ కోసం కేటాయించనున్నారు.నిలోఫర్‌ ఇన్ఫోసిస్‌ భవనంలోని గ్రౌండ్‌, మొదటి అంతస్తుల్లో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-29T10:43:44+05:30 IST