Abn logo
Jun 29 2020 @ 00:00AM

రాజు బంటయ్యాడు

  • నాయకుడంటే..? ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించి తరువాత పత్తా లేకుండా పోయేవారేనా? రాబర్ట్‌ రాయ్‌టీ లాంటి వారూ ఉంటారు! ఆయనెవరనేగా..? ప్రజల బాధలకు చలించి... వారి కష్టాలు పంచుకొనే మనసున్న నేత. మిజోరాం పర్యాటక, క్రీడా శాఖల మంత్రి. ‘రాళ్లెత్తిన’ కూలీ!


మిజోరాంలోని ఐజ్వాల్‌కు చెందిన లాంఘిలోవా ఇల్లు శిథిలమైపోయింది. దీన్ని పునర్‌నిర్మించేందుకు అతడు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ ఇది కరోనా కాలం. లాంఘిలోవాకు డబ్బు సమకూర్చు కోవడమొక్కటే కాదు, భవన నిర్మాణ కార్మికులు దొరకడం కూడా కష్టమైపోయింది. ఇది తెలుసుకున్న అతడి ‘ఛిటేవెంగ్‌’ కమ్యూనిటీ వారు చందాలేసి నాలుగున్నర లక్షల రూపాయలు ఇచ్చారు. ఒక సమస్య తీరింది. మరి కూలీలను ఎక్కడి నుంచి తేవాలి? పైగా మిజోరాంలో ఈ నెల 9 నుంచి రెండు వారాలపాటు పూర్తి లాక్‌డౌన్‌! ఈ ఆపత్కాలంలోనూ కమ్యూనిటీకి చెందిన ఒకరిద్దరు ముందుకు వచ్చారు. సేవకు సిద్ధమయ్యారు. 


బండ రాళ్లను భుజానికెత్తుకుని...

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. లాంఘిలోవా ఇల్లు కొండ పైన! నిర్మాణ సామగ్రి దుకాణమేమో కింద! అక్కడి నుంచి పైకి 60 మీటర్లు పైకి వాటిని చేరవేయాలంటే... మోసుకురావడం తప్ప వేరే మార్గం లేదు. కానీ ‘భౌతిక దూరం’ దృష్ట్యా సరిపడా మనుషులు లేరు. ఉన్నవాళ్లలో అందరూ అంత ఎత్తుకు సామగ్రి మోయలేరు. దిక్కుతోచని పరిస్థితి. 

ఇదంతా లాంఘిలోవా ఇంటి పక్కనే నివసిస్తున్న మంత్రి రాబర్ట్‌ గమనించారు. వారు పడుతున్న బాధలు ప్రత్యక్షంగా చూశారు. తనూ ఓ చెయ్యి వేయాలనుకున్నారు. అదేదో ఫొటోల కోసం కాదు... నిజాయతీగా పక్కింటి వారికి సాయం చేయాలన్న తలంపుతో కార్యక్షేత్రంలోకి దిగారు. కింద దుకాణం నుంచి బండ రాళ్లను భుజానికెత్తుకున్నారు. అరవై మీటర్ల దూరం... ఏటవాలుగా ఉండే కొండ ప్రాంతం... అలవాటు లేని పని. ఏ కొంచెం పట్టు తప్పినా పెను ప్రమాదం. అయితే మంత్రి మనసులో ఇవేవీ లేవు. ఒక్కో అడుగు పైకి వేస్తూ సాగారు. యాభై మూడేళ్ల వయసులో మంత్రి రాబర్ట్‌ కష్టాన్ని చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఆయన స్ఫూర్తితో యువత కదిలారు. 

‘‘ఇది నేను ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభా స్థానం. ఇక్కడ ప్రతి ఒక్కరికీ నేను తెలుసు. వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాయకుడిగా నా వైపు చూస్తారు. నిజమే..! నాయకుడనేవాడు ముందుండి నడిపించడం ముఖ్యం’’ అంటారు రాబర్ట్‌. అయితే మంత్రి సాయం లాంఘిలోవాకు కొత్తగా ఏమీ అనిపించలేదట! అతడికే కాదు... ఆ ప్రాంతంలో మరికొంతమందికి కూడా! ‘‘ఎందుకంటే ఆయనో సమాజ సేవకుడు. క్రీడలను ప్రోత్సహిస్తారు. కానీ నన్ను కూడా ఆశ్చర్యపరిచిన విషయం... ఫుట్‌బాల్‌ను మోసినంత సులువుగా ఆయన బండరాళ్లను భుజానికెత్తుకుని తీసుకురావడం’’ ... ఇది ఓ స్థానిక ఫుట్‌బాలర్‌ మాట. 


ఫుట్‌బాల్‌ ప్రేమికుడు

అన్నట్టు మంత్రి రాబర్ట్‌ ఒకప్పటి ఫుట్‌బాల్‌ ఆటగాడు. యూనివర్సిటీ స్థాయిలో ఆడారు. కొంతకాలం ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. తరువాత వ్యాపారవేత్తగా అనుభవం గడించారు. అటు నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాబర్ట్‌ రాళ్లెత్తిన సాహసం చూసిన జనం ఆయన్ను పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఈ వయసులో కూడా అంత ఫిట్‌గా ఉండటం ఆయనకే సాధ్యమైందని కొనియాడుతున్నారు. 

మిజోరాం జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నది రాబర్ట్‌ చిన్నప్పటి కల. కానీ అది నెరవేరలేదు. అందుకే రాజకీయాల్లోకి వచ్చాక ఆటకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘ఐజ్వాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌’ నెలకొల్పి స్థానికులను ప్రోత్సహిస్తున్నారు. తనను వారిలో చూసుకొంటున్నారు. ఆయన శ్రమకు ఫలితంగా క్లబ్‌ 2017 ‘ఐ-లీగ్‌’ ఛాంపియన్‌షిప్‌ సాధించి చరిత్ర సృష్టించింది. 2018 ఎన్నికల ముందు ‘మిజోరాం నేషనల్‌ ఫ్రంట్‌’లో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. ఐజ్వాల్‌ ఈస్ట్‌-2 స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన రాబర్ట్‌... మిజోరాం అభ్యర్థులందరిలో సంపన్నుడని భోగట్టా.


Advertisement
Advertisement
Advertisement