ములుగు జిల్లాలో ఇద్దరు కిరాణషాపు నిర్వాహకులకు కరోనా... వారికెలా సోకిందంటే..

ABN , First Publish Date - 2020-04-03T17:36:59+05:30 IST

ములుగు జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు..

ములుగు జిల్లాలో ఇద్దరు కిరాణషాపు నిర్వాహకులకు కరోనా... వారికెలా సోకిందంటే..

ములుగు జిల్లాలో ఇద్దరికి కరోనా

కిరాణషాపు నిర్వాహకులు కావడంతో ఆందోళన

కుటుంబ సభ్యులు, పనిమనుషులకు క్వారంటైన్‌


ఏటూరునాగారం/ గోవిందరావుపేట/ ములుగు: ములుగు జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏటూరునాగారం మండలకేంద్రం, గోవిందరావుపేట పస్రాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల మర్కజ్‌ సామూహిక ప్రార్థనలకు హాజరై జిల్లాకు చేరుకున్నారు. అధికారులు వీరిని గుర్తించి మార్చి 31న వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసోలేషన్‌కు తరలించారు. వారి రక్త నమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన పోలీసు, మెడికల్‌, రెవెన్యూ అధికారులు గురువారం ఉదయమే వారి ఇళ్లకు వెళ్లి వారితో ప్రాథమిక సంబంధాలు కలిగిన 26 మందిని తాడ్వాయి మండల కేంద్రంలోని హరిత హోటల్‌ కాటేజీలో క్వారంటైన్‌కు తరలించారు.


బాధితులిద్దరూ మార్చి 13న ఇంటినుంచి బయలుదేరి 15, 16, 17 తేదీల్లో ప్రార్థనల్లో పాల్గొని 18న ఇల్లు చేరారు. వీరిద్దరూ కిరాణా దుకాణాలు నిర్వహిస్తుండగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వీరివద్ద నుంచి నిత్యావసరాలను కొనుగోలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో వీరు ఎవరెవరిని  కలిశారో వారందరి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గోవిందరావుపేట, ఏటూరునాగరంలో 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఏటూరు నాగారానికి వచ్చే అన్ని ప్రధాన దారులను మూసివేయించిన పోలీసులు రాకపోకలకు కట్టడి చేశారు. ఫైరింజన్‌ల సాయంతో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావకాన్ని పిచికారీ చేయించారు. హరిత కాటేజీ క్వారంటైన్‌ కేంద్రం వద్ద డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


ఆందోళన వద్దు..: కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

ములుగు జిల్లాలో ఇద్దరికి కోవిడ్‌-19 పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య గురువారం ఒక ప్రకటనలో ధృవీకరించారు. వారి ప్రాథమిక  సంబంధీకులు 26 మందిని పరీక్షించగా వారికి వైరస్‌ లక్షణాలు లేవని పేర్కొన్నారు. వారందరినీ తాడ్వాయిలోని క్వారంటైన్‌ హోంకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి అంతా నియంత్రణలో ఉందని, ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-03T17:36:59+05:30 IST