బీజేపీని ఓడించడానికి టీంలు పంపిస్తాం: రైతు సంఘాలు

ABN , First Publish Date - 2021-03-03T00:41:02+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల గరించి మాట్లాడుతూ ‘‘బీజేపీ సహా దాని మిత్రపక్షాలు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చాయి ఆ చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీని ఓడించాలి. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికలు

బీజేపీని ఓడించడానికి టీంలు పంపిస్తాం: రైతు సంఘాలు

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించేందుకు ఆందోళన చేస్తున్న రైతులు పిలుపునిచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు తమ కార్యకర్తలను పంపించి బీజేపీ అభ్యర్థుల్ని ఓడించేందుకు కృషి చేస్తామని స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్ అన్నారు. మంగళవారం ఆందోళన జరుగుతున్న ఢిల్లీ సరిహద్దులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఆయన మాట్లాడుతూ ‘‘మార్చి 15 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా (రైతు సంఘాల ఐక్య వేదిక) నిర్ణయించింది. మార్చి 6తో రైతుల ఆందోళన 100వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా కుండ్లీ-మానేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేను ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు దిగ్భందించాలని నిర్ణయించాం’’ అని అన్నారు.


అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల గరించి మాట్లాడుతూ ‘‘బీజేపీ సహా దాని మిత్రపక్షాలు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చాయి ఆ చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీని ఓడించాలి. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మా టీంలను పంపిస్తాం. మార్చి 12న కోల్‌కతాలో బహిరంగ సభతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ సభలో 10 ముఖ్యమైన కార్మిక సంఘాలు కూడా పాల్గొనబోతున్నాయి. రైతులు, కార్మికులు ఏకమై ఈ యుద్ధాన్ని చేయబోతున్నారు. దేశంలో జరుగుతున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మార్చి 15న ఆందోళన చేపడతాం’’ అని అన్నారు.


ఇదే విషయమై భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్బీర్ ఎస్ రాజేవాల్ మాట్లాడుతూ తాము ‘‘ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని అయితే ఆయా స్థానాల్లో బీజేపీని ఓడించే సమర్ధులకు మద్దతుగా ఉండి.. బీజేపీని ఓడించేందుకు సహకరిస్తాం. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలకు టీంలను పంపేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాం. మేం ప్రజలకు మోదీ ప్రభుత్వ దుర్మార్గాల గురించి చెబుతాం. వాళ్లు చేసిన చేస్తోన్న చేయబోతున్న కుట్రల గురించి వివరించి బీజేపీని ఓడించమని చెబుతాం’’ అని అన్నారు.

Updated Date - 2021-03-03T00:41:02+05:30 IST