గిట్టుబాటు కాని కిసాన్‌ రైలు ప్రయోగం.. నష్టం రూ.లక్ష

ABN , First Publish Date - 2020-10-29T17:46:21+05:30 IST

కిసాన్‌ రైల్లో టమోటాలను ఢిల్లీ, నాగ్‌పూర్‌ లకు ఎగుమతి చేసేందుకు వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ, రైల్వేశాఖ అధికారులు చేసిన ట్రయల్‌ రన్‌ విజయవంతం కాలేదు.దీంతో టమోటాల ఎగుమతిపై మదనపల్లెలో మంగళవారం వ్యాపారులతో చర్చించినా వారు ఆసక్తి చూపలేదు.ప్రయోగాత్మకంగా ములకలచెరువు నుంచి కిసాన్‌ రైల్లో నాగ్‌పూర్‌కు

గిట్టుబాటు కాని కిసాన్‌ రైలు ప్రయోగం.. నష్టం రూ.లక్ష

గిట్టుబాటు కాని కిసాన్‌ రైలు ప్రయోగం

టమోటా ట్రయల్‌ రన్‌తో నష్టం రూ.లక్ష

మరోసారి ముందుకు రాని వ్యాపారులు


మదనపల్లె టౌన్ (చిత్తూరు): కిసాన్‌ రైల్లో టమోటాలను ఢిల్లీ, నాగ్‌పూర్‌ లకు ఎగుమతి చేసేందుకు వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ, రైల్వేశాఖ అధికారులు చేసిన ట్రయల్‌ రన్‌ విజయవంతం కాలేదు.దీంతో టమోటాల ఎగుమతిపై మదనపల్లెలో మంగళవారం వ్యాపారులతో చర్చించినా వారు ఆసక్తి చూపలేదు.ప్రయోగాత్మకంగా  ములకలచెరువు నుంచి కిసాన్‌ రైల్లో నాగ్‌పూర్‌కు టమోటా పంపిన ట్రేడర్‌ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిన క్రమంలో టమోటా ఎగుమతిపై ట్రేడర్స్‌ నిరాసక్తత వ్యక్తం చేశారు.ఈ నెల 20వ తేదిన ములకలచెరువు నుంచి కిసాన్‌ రైల్లోని రెండు వ్యాగన్లలో 43 టన్నుల టమోటాను నాగ్‌పూర్‌కు పంపించారు.అక్కడి మార్కెట్‌లో క్రేట్‌(30కిలోలు)ధర కేవలం రూ.150 పలికింది.దీంతో ములకలచెరువులో క్రేట్‌ ధర రూ.250 నుంచి రూ.400కు కొనుగోలు చేసిన ట్రేడర్‌ రవాణా ఖర్చులతో పాటు రూ.లక్షకు పైగా నష్టాన్ని చవిచూడాల్సి రావడంతో మదనపల్లె యార్డులోని ట్రేడర్స్‌ కిసాన్‌ రైలు అంటే నే ఆసక్తి చూపడం లేదు.


మదనపల్లెలో ఒకసారి  టమోటాను లారీకి లోడ్‌ చేశాక, ఎగుమతి చేసే మార్కెట్‌లోనే అన్‌లోడ్‌ చేయాల్సి వుంది. అలా కాకుండా కిసాన్‌రైలులో ఎగుమతి చేయాలంటే అటు అనంతపురం,ఇటు సీటీఎం రైల్వేస్టేషన్‌కు ఒక సారి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ తరువాత డిల్లీ, నాగ్‌పూర్‌లో రైలు నుంచి అన్‌లోడ్‌ చేశాక మళ్లీ అక్కడ నుంచి లారీలో టమోటా హోల్‌సేల్‌ మార్కెట్‌కు తరలించాల్సి వస్తోంది. దీని వలన క్రేట్లలో గ్రేడింగ్‌ చేసిన పైపై టమోటాలు దెబ్బతింటున్నాయి. 30 కిలోల క్రేట్‌కు సుమారు 5 కిలోల టమోటా నష్టపోవాల్సి వస్తోంది. టమోటా వ్యాపారం అంటేనే గంట, గంటకు మార్కెట్లలో ధరల్లో వ్యత్యాసం వుంటుంది.  లారీలో రవాణా చేస్తే ఒక మార్కెట్‌లో ధరలు తక్కువగా వుంటే పక్క మార్కెట్‌కు లారీని దారి మళ్లించవచ్చు. దీని వలన ట్రేడర్స్‌ నష్టపోకుండా జాగ్రత్త పడొచ్చు. అలా కాకుండా కిసాన్‌రైలులో పంపిస్తే రైలుప్రయాణంలో సమయం ఆదా అయినా...ఇక్కడినుంచి అనంతపురం రైల్వేస్టేషన్‌కు, నాగ్‌పూర్‌, డిల్లీ స్టేషన్ల నుంచి అక్కడి టమోటా మార్కెట్లకు పంపించడంలో సమయం వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో కిసాన్‌రైల్లో టమోటా ఎగుమతి చేయలేమని వ్యాపారులు చేతులెత్తేయడంతో మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - 2020-10-29T17:46:21+05:30 IST