స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేట కీర్తి పతంగిలా ఎగరాలి

ABN , First Publish Date - 2021-01-16T06:16:08+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేట కీర్తిపతాక దేశమంతా గుర్తించేలా గాలిపటంలా ఎగరాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకాక్షించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేట కీర్తి పతంగిలా ఎగరాలి
కైట్‌ ఫెస్టివల్‌లో గాలిపటం ఎగురవేస్తున్న మంత్రి హరీశ్‌రావు

దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలి

ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట సిటీ, జనవరి 15: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేట కీర్తిపతాక దేశమంతా గుర్తించేలా గాలిపటంలా ఎగరాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకాక్షించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం సంక్రాంతి పండుగ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా ప్రారంభించి మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేట ఐక్యతను దేశం నలుమూలలా చాటడానికే మహా నగరాల్లో జరిగే కైట్‌ఫెస్టివల్‌ను పట్టణంలో జరుపుతున్నామని స్పష్టం చేశారు. పతంగిని ఆకాశంలో ఉన్నతంగా నిలుపడానికి దారం అవసరమని.. ఆ దారంలాగే సిద్దిపేట ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పట్టణం సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. చెత్తరహిత, క్లీన్‌అండ్‌గ్రీన్‌ పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం అందజేసే స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో సిద్దిపేటను నంబర్‌వన్‌గా నిలుపాలని కోరారు. పట్టణానికి చెందిన ప్రతీ పౌరుడు స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి బెంగళూరు, వడోదర, హైదరాబాద్‌ తదితర నగరాల నుంచి వచ్చిన ఉత్సాహవంతులకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రెండున్నర గంటపాటు జరిగిన కైట్‌ ఫెస్టివల్‌ను కౌన్సిలర్లతో కలిసి వీక్షించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ రమణాచారితో కలిసి కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న మంగళూరు కైట్‌ క్లబ్‌, వడోదర కైట్‌ క్లబ్‌, వడోదర, దూద్‌ భల్లాపూర్‌, బెంగళూరు, జీమ్‌ కైట్‌ క్లబ్‌, ఇండియన్‌ కైట్‌ క్లబ్‌, కోహినూర్‌ కైట్‌ క్లబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధులకు మెమెంటోలను అందజేశారు.

Updated Date - 2021-01-16T06:16:08+05:30 IST