4 డకౌట్లు.. కానీ ఫైనల్ చేరిన కేకేఆర్

ABN , First Publish Date - 2021-10-14T04:57:29+05:30 IST

ఐపీఎల్2021 ఎలిమినేటర్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినా ఇరు జట్లూ పోటాపోటాగా పోరాడాయి. ఆఖరి బంతికి..

4 డకౌట్లు.. కానీ ఫైనల్ చేరిన కేకేఆర్

షార్జా: ఐపీఎల్2021 ఎలిమినేటర్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినా ఇరు జట్లూ పోటాపోటాగా పోరాడాయి. ఆఖరి బంతికి కోల్‌కతా నైట్ రైడర్స్ ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో ఓపెనర్ శిశర్ ధవన్(36: 39 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), శ్రేయాస్ అయ్యర్(30 నాటౌట్: 27 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా పట్టుమని 10 నిముషాలు కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 135 పరుగులు మాత్రమే చేసింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా.. శివమ్ మావి, లోకీ ఫెర్గ్యూసన్ చెరో వికెట్ తీసుకున్నారు.


అనంతరం 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు శుభ్‌మన్ గిల్(46: 46 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్(55: 41 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు. అయితే వీరిద్దరూ అవుటైన తర్వాత ఒక్కరు కూడా క్రీజులో నిలుదొక్కుకోలేకపోయారు. విచిత్రం ఏంటంటే వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్(0) నుంచి ఇయాన్ మోర్గాన్(0), షకిబ్ అల్ హసన్(0), సునీల్ నరైన్(0) నలుగురు బ్యాట్స్‌మన్ వరుసగా డకౌట్‌లుగా వెనుదిరిగారు. 


దీంతో కేకేఆర్ కష్టాల్లో పడింది. అయితే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి(12 నాటౌట్: 11 బంతుల్లో, 1 సిక్స్) చివరి బంతికి సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మొత్తం 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 136 పరుగులు చేసి ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఎన్‌రిచ్ నోర్ట్‌జే, రవిచంద్రన్ అశ్విన్, కగీసో రబాడా తలా 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ 1 వికెట్ దక్కించుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వెంకటేశ్ అయ్యర్‌కు దక్కింది. ఇక ఈ విజయంతో కేకేఆర్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరగబోయే ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.



Updated Date - 2021-10-14T04:57:29+05:30 IST