సస్పెన్షన్‌ తర్వాత స్వార్థంగా ఆలోచించా.. విఫలమయ్యా..

ABN , First Publish Date - 2020-06-15T08:59:39+05:30 IST

గతేడాది బీసీసీఐ విధించిన సస్పెన్షన్‌ తర్వాత స్వార్థంగా ఆలోచించి, వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడాలనుకున్నానని భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు...

సస్పెన్షన్‌ తర్వాత స్వార్థంగా ఆలోచించా.. విఫలమయ్యా..

న్యూఢిల్లీ: గతేడాది బీసీసీఐ విధించిన సస్పెన్షన్‌ తర్వాత స్వార్థంగా ఆలోచించి, వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడాలనుకున్నానని భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు. కానీ దారుణంగా విఫలం కావడంతో తప్పు తెలుసుకుని మారిపోయినట్టు చెప్పాడు. ఆ తర్వాతే  క్రికెట్‌పై నా ఆలోచనా ధోరణి మారిపోయిందన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే కారణంతో రాహుల్‌తో పాటు హార్దిక్‌ పాండ్యాపై గతేడాది జనవరిలో బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) వేటు వేసింది. దీంతో అప్పట్లోఇద్దరు ఆటగాళ్లు ఆసీస్‌ పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి రావాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత రెండు వారాలకు ఇద్దరిపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు.   ‘అప్పటి సంఘటన తర్వాత నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. నాపై సస్పెన్షన్‌ తొలగించాక స్వార్థంగా ఆలోచించా. కేవలం నాకోసం పరుగులు చేసి నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. కానీ అలా ఆడినప్పుడల్లా విఫలమయ్యేవాడిని. అందుకే ఎలాంటి ఆలోచనలు లేకుండా జట్టు కోరుకున్నట్టుగా ఆడాలని నాకు నేను గట్టిగా చెప్పుకొన్నా. నా సమయాన్ని, శక్తిని నైపుణ్యం కలిగిన ఆటగాడిగా, టీమ్‌ క్రికెటర్‌గా పేరు తెచ్చుకునేందుకు వినియోగించుకోవాలనుకున్నా. ఈ ఆలోచనా ధోరణి నాకు మంచి ఫలితాన్నిచ్చింది. అప్పటి వరకున్న ఒత్తిడి పోవడమే కాకుం డా.. ఆటపై దృష్టి పెట్టేలా, జట్టుకు కావాల్సి విధంగా ఆడడం 

ప్రారంభించా’ అని రాహుల్‌ తెలిపాడు. ఇటీవలి కాలంలో రాహుల్‌ ఆటతీరు గణనీయంగా మారిపోయింది. అతడి చివరి 13 వన్డే ఇన్నింగ్స్‌లో 572 పరుగులు, 9 టీ20ల్లో 356 రన్స్‌ సాధించాడు. ఈ ఏడాది 6 వన్డేల్లో 350.. 7 టీ20ల్లో 323 రన్స్‌తో దుమ్ము రేపాడు.  


రోహిత్‌ అండగా నిలిచాడు

‘అంతర్జాతీయ టీ20లో మొదటి ఓపెనర్‌గా రాహుల్‌ ఖాయమని, రెండో స్థానం కోసం తనకు, ధవన్‌ మధ్య పోటీ ఉందని రోహిత్‌ చెప్పడం నాకిచ్చిన గౌరవంగా భావిస్తున్నా. అతడికి నా మీద  నమ్మకం ఎక్కువ. సీనియర్‌ ఆటగాడిగా చాలాసార్లు నాకు అండగా నిలిచాడు. ప్రతీ క్రికెటర్‌కు ఇలా ఒకరి నుంచి మద్దతు లభిస్తే ఒక్కోసారి మనం రాణించకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోం’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.


Updated Date - 2020-06-15T08:59:39+05:30 IST