ఉమ్మడి ఖమ్మంలో మరో 19 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-18T04:42:53+05:30 IST

శనివారం ఉమ్మడి జిల్లాలో 10కేంద్రాల్లో వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగుల, సిబ్బందికి తొలివిడతగా వ్యాక్సిన్‌ వేయగా.. రెండోవిడతగా సోమవారం మరో 19ఆసుపత్రుల్లో టీకాలు వేయనున్నారు.

ఉమ్మడి ఖమ్మంలో మరో 19 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌
పీహెచ్‌సీల వైద్యులకు వ్యాక్సిన్‌ వయల్స్‌ను అందజేస్తున్న అధికారులు

నేటినుంచి రెండోవిడత ప్రారంభం

ఖమ్మం జిల్లాలో తొమ్మిది, భద్రాద్రిలో పది సెంటర్లు

తొలిరోజున టీకా తీసుకున్నవారంతా సేఫ్‌

భయపడాల్సిన పనిలేదంటున్న వైద్యాధికారులు 

ఖమ్మం సంక్షేమవిభాగం/ కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 17: కరోనా మహమ్మారిని తరిమేందుకు అందుబాటులోకి తెచ్చిన కొవిషీల్డ్‌ టీకాను ఇరుజిల్లాల్లో రెండోవిడతగా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శనివారం ఉమ్మడి జిల్లాలో 10కేంద్రాల్లో వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగుల, సిబ్బందికి తొలివిడతగా వ్యాక్సిన్‌ వేయగా.. రెండోవిడతగా సోమవారం మరో 19ఆసుపత్రుల్లో టీకాలు వేయనున్నారు. అయితే తొలిరోజున టీకాలు తీసుకున్న వారంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి దుష్ప్రభావాలు లేవని, ఎవరూ భయాందోళన చెందాల్సిన పనిలేదని ఇరు జిల్లాల వైద్యాధికారులు వెల్లడించారు. అధికారులు గుర్తించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ఈ టీకాలు ఇవ్వనున్నారు. అయితే ఖమ్మం జిల్లాలో పెంచిన కేంద్రాలకు గాను మరో 2వేల డోసులు, భద్రాద్రి జిల్లాకు 2వేల డోసులను కేటాయించారు. 

తాజాగా కేటాయించిన కేంద్రాలు.. 

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ, వైరా, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి, తల్లాడ, కల్లూరు, కారేపల్లితో పాటుగా ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో అదనంగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జిల్లా ఆసుపత్రిలోని ఆయుర్వేద విభాగాన్ని కూడా వ్యాక్సిన్‌ సెంటర్‌గా అందుబాటులోకి తెచ్చారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పాల్వంచ,  చంద్రుగొండ, ఎంపీ బంజర్‌, అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల, రేగళ్ల, దమ్మపేట, మంగపేట ప్రాథమిక వైద్యశాలల్లో ఏర్పాట్లు చేశారు. 

అత్యవసర వైద్యానికి మూడు కేంద్రాలు

వ్యాక్సినేషన్‌ తర్వాత అత్యవసర వైద్యసేవలు అవసరమైన వారి కోసం మూడు అత్యవసర విభాగాలను సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రితో పాటు మధిర, సత్తుపల్లి ఏరియా ఆసుపత్రిల్లో అత్యవసర వైద్యం కోసం ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో అందుబాటులోకి వచ్చిన 15కేంద్రాల్లో వెయిటింగ్‌, రిసీవింగ్‌, వ్యాక్సినేషన్‌ కోసం ఒక్కో కేంద్రంలో ఐదుగురు ఆఫీసర్లను కేటాయించారు. అలాగే ఆయా కేంద్రాల వద్ద వైద్యుల బృందం, 108వాహనాలు, ఆర్‌బీఎస్‌కే వాహనాలను అందుబాటులో ఉంచారు. భద్రాద్రి జిల్లాలో పది కేంద్రాలకు ఆరుగురు పర్యవేక్షణ అధికారులను నియమించారు. అలాగే కొవిన్‌ యాప్‌లో వ్యాక్సిన్‌ తీసుకునే వారి వివరాల నమోదు, ఇతర సాంకేతిక అంశాలపై ఖమ్మం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డేటా ఎంట్రీ ఉద్యోగులకు ఆదివారం శిక్షణనిచ్చారు. 

ఆ 170మంది ఆరోగ్యంగా ఉన్నారు..

డాక్టర్‌ మాలతి, ఖమ్మం జిల్లా వైద్యాధికారి 

శనివారం కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న 170 మంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించాం. వ్యాక్సినేషన్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. గతంలో ఉన్న ఆరు కేంద్రాలతో పాటు సోమవారం నుంచి మరో తొమ్మిది కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలు ద్వారా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అందిస్తాం. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారుల సూచనల మేరకు క్రమంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పెంచుతాం.

మరో పది కేంద్రాల్లో వ్యాక్సిన్‌ 

భాస్కర్‌ నాయక్‌, భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్‌వో 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  సోమవారం నుంచి మరో 10 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశాం. కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రాలో ఒక్కొకేంద్రంలో 50మంది చొప్పున 500మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేయనన్నాం. కొత్తగా పాల్వంచ,  చంద్రుగొండ, ఎంపి బంజర్‌, అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల, రేగళ్ల, దమ్మపేట, మంగపేట ప్రాథమిక వైద్యశాలల్లో టీకాలు వేయనున్నాం. దీంతో ప్రస్తుతం జిల్లాలో మొత్తం 14 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. 

Updated Date - 2021-01-18T04:42:53+05:30 IST