వ్యాక్సిన్‌కు 841మంది డుమ్మా.. ఖమ్మం జిల్లాలో 2,570మందికి గాను 1,729మందికే టీకాలు

ABN , First Publish Date - 2021-01-20T04:10:22+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతుండగా.. ఖమ్మం జిల్లాలో మంగళవారం టీకా వేసేందుకు నిర్ణయించిన వారిలో 841మంది డుమ్మా కొట్టారు. అయితే వీరంతా అందుబాటులో లేరని, అందువల్లే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు రాలేకపోయారని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌కు 841మంది డుమ్మా.. ఖమ్మం జిల్లాలో 2,570మందికి గాను 1,729మందికే టీకాలు
జిల్లా ఆసుపత్రిలో టీకాల తీసుకున్న డాక్టర్లు, నర్సింగ్‌ ఉద్యోగులు, రఘునాథపాలెం మండలం మంచుకొండ పీహెచ్‌సీలో టీకా వేస్తున్న దృశ్యం

జిల్లా ఆసుపత్రిలో ఒక్కరోజే 100మందికి వ్యాక్సిన్‌

భద్రాద్రి జిల్లాలో 3,797 మందికి టీకా

ఖమ్మంసంక్షేమవిభాగం/రఘునాథపాలెం/కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 19 : కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతుండగా.. ఖమ్మం జిల్లాలో మంగళవారం టీకా వేసేందుకు నిర్ణయించిన వారిలో 841మంది డుమ్మా కొట్టారు.  అయితే వీరంతా అందుబాటులో లేరని, అందువల్లే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు రాలేకపోయారని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో మంగళవారం 26కరోనా కేంద్రాల ద్వారా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అందించారు. సత్తుపల్లి, మధిర ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఖమ్మంనగరంలోని శ్రీనివాసనగర్‌, ముస్తాఫానగర్‌ అర్బన్‌ ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సిన్‌ తీసుకునే వారు లేక పోవటంతో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించలేదని అధికారులు ప్రకటించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 26కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 2570మందికి టీకాలు వేయడం లక్ష్యంకాగా 1,729మందికి మాత్రమే వేశారు. ఒక్క జిల్లా ప్రధాన ఆసుపత్రిలోనే 100 మంది వరకు టీకా వేయించుకున్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ, వైరా, చింతకాని, కొణిజర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను జిల్లా వైద్యాధికారి మాలతి పరిశీలించారు. తిరిగి ఈనెల 21, 22 తేదీల్లో కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. 

వారి పేర్ల రిపీట్‌తో ఇబ్బందులు..

కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు నిర్ణీత తేదీన రాని వారి పేర్లు మరుసటి రోజు వ్యాక్సిన్‌ కార్యాచరణలో నమోదు చేస్తుండటంతో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు గుర్తించారు. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వేసిచూసే ధోరణిలో ఉన్న కొందరు ఉద్యోగులు వ్యాక్సినేషన్‌కు ముందుకు రావటం లేదు. తిరిగి వారి పేర్లు అన్‌లైన్‌ చేస్తుండటంతో తదుపరి జాబితాలో ఉన్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. అలాగే జిల్లా ఆసుపత్రిలో కరోనా వార్డులో విధులు నిర్వహించిన కొందరు ల్యాబ్‌టెక్నీషిన్లు, డేటా ఎంట్రీ అపరేటర్లకు ఆన్‌లైన్‌లో పేర్లు కనిపించటం లేదని తెలుస్తోంది. 

వ్యాక్సిన్‌పై సందేహాలు అవసరంలేదు : ఖమ్మం డీఎంహెచ్‌వో 

జిల్లాలో నిర్దేశించిన కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని, ఈ వ్యాక్సిన్‌పై ఎలాంటి సందేహాలు అవసరం లేదని డీఎంహెచ్‌వో మాలతి తెలిపారు. మంగళవారం మంచుకొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని పరిశీలించిన ఆమె వ్యాక్సినేషన్‌ తీరును పరిశీలించారు. వ్యాక్సిన్‌ తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది అపోహమాత్రమేనన్నారు. ఆమె వెంట ఎంపీడీవో అశోక్‌కుమార్‌, వైద్యులు సునంద, స్రవంతి, సిబ్బంది తదితరులున్నారు. 

22 నాటికి ఆర్యోగ, అంగన్‌వాడీ సిబ్బందికి పూర్తి : భద్రాద్రి డీఎంహెచ్‌వో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం 44 ఆరోగ్య కేంద్రాల్లో 3,797మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌ తెలిపారు. 22వ తేదీ నాటికి జిల్లాలోని ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. టీకాల కార్యక్రమంపై మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ సాధారణ టీకాల కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలుగకుండా బుధ, శని, ఆది వారాలు మినహా మిగితా అన్ని రోజుల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ మార్గద్శకాలకు అనుగుణంగా తదుపరి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం గురువారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌ తీసుకున్నవారు  సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఎలాంటి దుస్ప్రభావాలు కనిపించలేదన్నారు.

Updated Date - 2021-01-20T04:10:22+05:30 IST