అడిగిందిస్తే చాలు!.. నిబంధనలను పక్కన పెట్టేస్తున్న ఎంపీవోలు

ABN , First Publish Date - 2021-02-22T05:30:00+05:30 IST

వాళ్లడిగింది.. ముట్టజెప్పితే... ఎక్కడ, ఎప్పుడు పనిచేశారనే విషయాలేవీ వారికి అక్కర్లేదు. కానీ అడిగింది ఇవ్వకపోతే.. ‘మీకు ఇక్కడ పనిలేదు.. మాకు అక్కర్లేదు... మీరెక్కడైనా చెప్పుకోండి’ అంటూ నిర్ధాక్షణ్యంగా చెప్పేస్తారు. కాసులిస్తే చాలు నిబంధనలు పక్కనపెట్టి మరీ తమకు కావాల్సిన వారికి, కావాల్సిన విధంగా పనులు చేసిపెడతారు.

అడిగిందిస్తే చాలు!.. నిబంధనలను పక్కన పెట్టేస్తున్న ఎంపీవోలు

కాసుల కనుసన్నల్లో మండల పంచాయతీ అధికారులు

ప్రతీపనిలోనూ చేతివాటం.. 

కంప్యూటర్ల ఆపరేటర్ల నియామకంలోనూ కక్కుర్తి

ఉన్నతాధికారుల కళ్లుగప్పి తతంగం

ఖమ్మం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 22 : వాళ్లడిగింది.. ముట్టజెప్పితే... ఎక్కడ, ఎప్పుడు పనిచేశారనే విషయాలేవీ వారికి అక్కర్లేదు. కానీ అడిగింది ఇవ్వకపోతే.. ‘మీకు ఇక్కడ పనిలేదు.. మాకు అక్కర్లేదు... మీరెక్కడైనా చెప్పుకోండి’ అంటూ నిర్ధాక్షణ్యంగా చెప్పేస్తారు. కాసులిస్తే చాలు నిబంధనలు పక్కనపెట్టి మరీ తమకు కావాల్సిన వారికి, కావాల్సిన విధంగా పనులు చేసిపెడతారు. అంతేకాదు పంచాయతీల్లో జరిగే ప్రతీ పనికి ఆమ్యామ్యాలు తీసుకుంటున్నారు. ఇదీ ప్రస్తుతం మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు) ప్రదర్శిస్తున్న చేతివాటం. ఉన్నతాధికారుల కళ్లుకప్పి మరీ ఈ తతంగాన్ని నిర్వహిస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడిగింది ముట్టజెప్పితే చాలు నిబంధనలతో పనిచేదన్నట్టుగా.. ఎంపీవోలు వ్యవహరిస్తుండటంతో అర్హులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంచాయతీల్లో జరుగుతున్న ప్రతీ పనికి సెక్రటరీలతో సంబంధం లేకుండా కొందరు ఎంపీవోలు కమీషన్లు దండుకుంటూ చెక్కులను పాస్‌ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 

ఆపరేటర్ల నియామకంలోనూ బేరసారాలు..

ఈ పంచాయతీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రతి పంచాయతీలోనూ కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మేజర్‌ పంచాయతీల్లో కార్వీ ఏజెన్సీ ద్వారా అప్పట్లో ఎంపిక చేసింది. కంప్యూటర్‌ పరిజ్ఞానంపై పరీక్షలను నిర్వహించి అర్హులైన వారిని 130 మందిని ఎంపిక చేసింది. ఆ తర్వాత ఓ ఏడాది పాటు ఏజెన్సీ ద్వారానే వేతనాలు అందించారు. ఆ తర్వాత క్లస్టర్‌స్థాయి పంచాయతీల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లను సర్దుబాటు చేశారు. ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పంచాయతీల్లో రోటేషన్‌ పద్ధతిన వేతనాలు చెల్లించేలా ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో వివిధ మండలాల్లో సుమారు 70మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు.  అంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో కొన్ని మండలాల్లో ఎంపీవోలు పనిభారం పేరుతో తామే స్వయంగా కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించుకుంటున్నారు. వారి మధ్య బేరం కుదుర్చుకుని పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుని నియామకం చేసుకున్న తర్వాత ఆపరేటర్‌ వేతనంలో సగాన్ని కూడా తాము తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుని అక్రమ నియమకాలకు తెరలేపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో 2015లో నియమితులైన కంప్యూటర్‌ ఆపరేటర్లను పక్కకు తప్పించి తాము అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వారిని తమకు కావాల్సిన చోట పనిచేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెనుబల్లి, రఘునాఽథపాలెం, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్‌ మండలాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లను కొత్తగా నియమించుకున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీవో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కంప్యూటర్‌ ఆపరేటర్లను అక్రమంగా నియమించుకుని వారి నుంచి సగం వేతనాలు తీసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా గ్రామాల్లో జరగుతున్న అభివృద్ధి పనులకు 5శాతం పర్సంటేజీలను ఇస్తేనే చెక్కులను పాస్‌చేస్తున్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా 2015 నుంచి పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేట్లను కాదని ఇష్టారాజ్యంగా నియామకాలు చేస్తున్న తీరుపై విచారణ నిర్వహించాలని ప్రజలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

డీపీవో ఏమంటున్నారంటే..

పంచాయతీల్లో కానీ, మండల కేంద్రాల్లో కానీ కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించుకునే అధికారం ఎంపీవోలకు లేదని జిల్లా పంచాయతీ అధికారి వి.ప్రభాకర్‌రావు ‘ఆంద్రజ్యోతి’కి వివరించారు. కేవలం కలెక్టర్‌ అనుమతితోనే నియమించుకునే విధానం ఉంది. తాను వచ్చాక ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. అయితే గతంలో పనిచేసిన కంప్యూటర్‌ ఆపరేటర్లకు మెదటి ప్రాధాన్యమివ్వాల్సి ఉంది. వారిని సర్దుబాటు చేశాకే అవసరమైన చోట్ల కలెక్టర్‌ అనుమతితోనే నియమించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా దీనికి విరుద్ధంగా జరిగితే చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2021-02-22T05:30:00+05:30 IST