రైతుకు మద్దతుగా.. ఖమ్మంలో మహామానవహారం

ABN , First Publish Date - 2021-01-18T04:44:57+05:30 IST

విపక్షాలు, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా, మైనారిటీ తదితర సంఘాల నేతలు, కార్యకర్తలు, చిన్నారులు రైతులకు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేసే వరకూ పోరాటాన్ని ఆపేది లేదంటూ స్పష్టం చేశారు.

రైతుకు మద్దతుగా.. ఖమ్మంలో మహామానవహారం
మానవహారంలో వామపక్షాల నేతల అభివాదం, రైతుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు, ఖమ్మంలో మానవహారం, మైనారిటీ మహిళలకు నమస్కరిస్తున్న సీఎల్పీ నేత భట్టివిక్రమార్క

కదంతొక్కిన విపక్షాలు, ప్రజాసంఘాలు

ప్రదర్శనలో ఆకట్టుకున్న చిన్నారులు 

హాజరైన కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఎన్డీ నేతలు

కేంద్రం కొత్త చట్టాలను రద్దుచేసే వరకు పోరాడుతామని స్పష్టీకరణ

ఖమ్మం, జనవరి 17 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) :  విపక్షాలు, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా, మైనారిటీ తదితర సంఘాల నేతలు, కార్యకర్తలు, చిన్నారులు రైతులకు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేసే వరకూ పోరాటాన్ని ఆపేది లేదంటూ స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా, ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా ఆదివారం ఖమ్మంలో ఖమ్మం రైతు సంఘటిత సమితి ఆధ్వర్యంలో మహా మానవహారాన్ని నిర్వహించారు. ఉదయం 10గంటలనుంచి 12గంటల వరకు మయూరిసెంటర్‌ నుంచి జిల్లా కోర్టు వరకు నిర్వహించిన ఈ మానవహారంలో విపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన, మైనారిటీ, జర్నలిస్టు సంఘాలు, ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులు, పైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు కదంతొక్కారు. ‘జై కిసాన్‌’ అన్న నినాదాలతో మారుమోగించారు. ఈ క్రమంలో వామపక్షాల నాయకులు, కార్యకర్తలు రైతుబజార్‌ సమీపంలో రోడ్డుపై కూరగాయలు పారబోసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ మానవహారంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర నేత బాగం హేమంతరావు, ఎన్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తదితరులు మాట్లాడారు. 

ఫ సీఎల్పీనేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేసేవరకు ఢిల్లీనుంచి గల్లీవరకు పోరాటం సాగుతుందన్నారు. మోదీ ప్రభుత్వం రైతుసంక్షేమాన్ని పక్కనబెట్టి కార్పొరేట్‌ శక్తులకు ప్రయోజనం కల్పించేలా కొత్తచట్టాలు చేసిందని, ఫలితంగా స్వాతంత్య్ర ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని, దేశ ఆర్థికరగం దెబ్బతింటుదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షాన పోరాడతానని చెప్పి ఢిల్లీ వెళ్లియూటర్న్‌ తీసుకున్నారని, ఎవరి ప్రయోజనంకోసం యూటర్న్‌ తీసుకున్నారో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నూతన వ్యవసాయచట్టాలు అమలైతే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతోపాటు వ్యవసాయ రంగం కార్పొరేట్‌ శక్తుల పరమవుతుందని, స్వాతంత్య్రం తెచ్చినపార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌.. చట్టాలు రద్దయ్యేవరకు పోరాటం చేస్తుందన్నారు.

ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర నేత బాగం హేమంతరావు, ఎన్డీరాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ప్రసంగిస్తూ కేంద్రంలోని నరేంద్రమోదీ కార్పొరేట్‌శక్తుల ప్రయోజనం కోసం పనిచేస్తున్నారని, రైతువ్యతిరేక చట్టాలు రద్దుచేయాలని ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తుంటే అందులో ఉగ్రవాదులున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రైతులు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తుంటే.. సమస్యను పరిష్కారించాల్సిన కేంద్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకోసం లేవని కార్పొరేట్‌శక్తుల కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ రైతుసంఘీభావ మానవహారంలో ఖమ్మం జిల్లా రైతు సంఘటన సమితి కన్వీనర్‌ ఐవీ రమణారావు, కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు నగర అధ్యక్షుడు జావీద్‌, కార్పొరేటర్‌ దీపక్‌చౌదరి, కిసాన్‌ఖేత్‌ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్‌రెడ్డి,  సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటుప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎన్డీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు బీజీ క్లెమెంట్‌, మాదినేని రమేష్‌, ఆవుల వెంకటేశ్వర్లు, అశోక్‌, ఎన్డీ చంద్రన్న వర్గం గిరి, జర్నలిస్టు సంఘాల నాయకులు ఆకుతోట ఆదినారాయణ, ఇస్మాయిల్‌, ఎన్‌.వెంకటరావు, గోగినేని శ్రీనివాసరెడ్డి, ఏనుగు వెంకటేశ్వరరావు, సాతుపాటి రామయ్య, వనం నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న చిన్నారులు.. 

రైతు ఉద్యమానికి మద్దతుగా ఖమ్మంలో నిర్వహించిన మహామానవహారంలో శ్రామిక, అవనిక అనే చిన్నారులు రైతు వేషధారణల్లో ఆకట్టుకున్నారు. రైతుదంపతుల్లా నిరసన తెలిపి.. రైతు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారంటూ వారిని పలువురు అభినందించారు. అలాగే జమాతే ఇస్లామిహింద్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. ఓ మహిళ భుజాన చిన్నారిని ఎత్తుకుని మరో చేతిలో చిన్నారితో ప్లకార్డు పట్టుకుని పాల్గొనడం అందరినీ ఆలోచింపజేసింది. 

Updated Date - 2021-01-18T04:44:57+05:30 IST