వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-09-26T09:58:33+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20న పార్లమెంటులో ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని వామపక్ష, వ్యవసాయ, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలి

వామపక్షాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్భందం


కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 25: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 20న పార్లమెంటులో ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని వామపక్ష, వ్యవసాయ, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కర్నూలు జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.


నగరంలోని ఐటీసీ వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం(సీపీఎం) జిల్లా కార్యదర్శి కేవీ నారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి(సీపీఐ) జగన్నాథం అధ్యక్షతన రహదారి దిగ్బంధం చేశారు. అరగంట సేపు ట్రాఫిక్‌ అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకుని నాయకులను పంపించారు.


దాదాపు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతుల గొంతుకోసే బిల్లులను పార్లమెంటులో ఆమోదించిందన్నారు. ఈ బిల్లులను విపక్షాలు వ్యతిరేకించినా మూజువాణి ఓటుతో ఆమోదించడం దారుణమన్నారు. భారత రాష్ట్రపతి ఈ బిల్లును తిరస్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.


కార్పొరేట్‌ శక్లునే ధరలను నిర్ణయించే విధంగా ఈ బిల్లును బీజేపీ ప్రభుత్వం తయారు చేసిందని వారు ఆరోపించారు. పార్లమెంటులో  వైసీపీ, టీడీపీలు బిల్లుకు మద్దతు ఇవ్వడం ఏపీ ప్రజల దౌర్భాగ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టి.రాముడు, సీపీఐ నగర కార్యదర్శి రాజశేఖర్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు కే.పెద్దారెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నాయకులు మనోహర్‌ మాణిక్యం, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, శ్రీరాములు గౌడు, బీసన్న, మహేష్‌, సీపీఐ ఎంఎల్‌ డెమోక్రసీ నాయకులు నరసింహులు, రామక్రిష్ణారెడ్డి, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-26T09:58:33+05:30 IST